header

Law Course....న్యాయవిద్య

Law Course....న్యాయవిద్య
ప్రపంచీకరణ తర్వాత నేరాల స్వరూప, స్వభావాలు మారిపోయాయి. సంఖ్యతోపాటు సంక్లిష్టత కూడా పెరుగుతోంది. దీంతో న్యాయస్థానాల్లో కేసులు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయవిద్య మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. సమాజంలో గౌరవంతోపాటు చక్కటి ఆదాయాన్ని అందించే న్యాయవిద్యకు రోజురోజుకూ ఆదరణ అధికమవుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సమర్థ న్యాయమూర్తులను, న్యాయవాదులను అందించడానికి పలు యూనివర్సిటీలు, సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి.
సమాజంలో న్యాయవాదులకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా న్యాయవిద్యను సాధారణ కోర్సుల మాదిరి పరిగణించకూడదు. దీంట్లో సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఇండియన్ బార్ కౌన్సిల్ 1961 న్యాయవాదుల చట్టానికి అనుగుణంగా న్యాయ విద్యా తీరుతెన్నులను పర్యవేక్షిస్తోంది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
న్యాయ నిపుణుల డిమాండ్ రోజురోజుకు అధికం కావడాన్ని దృష్టిలోపెట్టుకుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమర్థులైన న్యాయ నిపుణులను అందించేందుకు ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సులను యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టింది. తర్వాత 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్) కోర్సును ప్రారంభించింది. ప్రస్తుతం కొన్ని వర్సిటీలు ఎల్ఎల్‌బీ మూడు సంవత్సరాల కోర్సులతో పాటు, ఎల్ఎల్‌బీ అయిదు సంవత్సరాల 'లా కోర్సులు కూడా అందిస్తున్నాయి. దేశంలో లా డిగ్రీ అంటే 1985కు ముందు మూడేళ్ల కోర్సు మాత్రమే.
న్యాయ విద్యను విస్తరించాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సూచనలు చేయడంతో 1985లో బెంగళూరులో 'నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. అప్పటినుంచి 5 ఏళ్ల లా కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఏర్పడిన మొదటి లా వర్సిటీ ఇదే కావడం విశేషం. తర్వాత లా వర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి.
అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి ఇంటర్ ఉత్తీర్ణత, మూడేళ్ల లా కోర్సుకు డిగ్రీ కనీస అర్హతలు.
న్యాయ విద్యలో లభిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు: 1) బీఏ ఎల్ఎల్‌బీ జనరల్, 2) బీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్, 3) బీకాం ఎల్ఎల్‌బీ జనరల్, 4) బీకాం ఎల్ఎల్‌బీ ఆనర్స్, 5) బీబీఏ ఎల్ఎల్‌బీ జనరల్, 6) బీబీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్, 7) బీఎస్సీ ఎల్ఎల్‌బీ జనరల్, 8) బీఎస్సీ ఎల్ఎల్‌బీ ఆనర్స్. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రాములు. కాల వ్యవధి అయిదేళ్లు. ఈ కోర్సుల్లో చేరడంవల్ల ఏడాది ఆదా కావడమే కాకుండా ఒకేసమయంలో రెండు డిగ్రీలు (ఉదా: బీబీఏ + ఎల్ఎల్‌బీ) పొందే వీలుంటోంది.
ప్రవేశ విధానం
న్యాయ విద్యలోకి ప్రవేశించేందుకు జాతీయ స్థాయిలో 'క్లాట్, ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా లా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే... 3 లేదా 5 ఏళ్ల లా డిగ్రీ చేయడానికి లాసెట్ రాయాల్సి ఉంటుంది.
లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్' (లాసెట్)
'లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్' (లాసెట్) పేరుతో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, పద్మావతి, శ్రీవేంకటేశ్వర, నాగార్జున మొదలైన వర్సిటీల లా కళాశాలల్లో చేరవచ్చు. అభ్యర్థులకు లాసెట్‌లో కనీసం 35 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.
లాసెట్ ఆధారంగా చేరదగిన కోర్సులు:
ఎల్ఎల్‌బీ / బీఎల్ (కాలవ్యవధి 5 సంవత్సరాలు). ఈ కోర్సుకు ఇంటర్‌లో సగటున 45 శాతం మార్కులు ఉండాలి.
2) ఎల్ఎల్‌బీ / బీఎల్ (3 ఏళ్ల కోర్సు).(అర్హత: డిగ్రీలో సగటున 45 శాతం మార్కులు అవసరం.) వెబ్‌సైట్: www.aplawcet.org
జాతీయ స్థాయిలో...
న్యాయ విద్యను జాతీయ స్థాయి వర్సిటీల్లో చదవాలంటే ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి... • క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్).
• నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్.
• కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్.
క్లాట్‌
న్యాయ విద్యను మరింత విస్తృత పరచడంతోపాటు సమాజానికి నిపుణులైన, సమర్ధులైన న్యాయవాదులను అందించాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన నేషనల్ లా యూనివర్సిటీలు విద్యార్థులను చేర్చుకోవడానికి క్లాట్‌కు శ్రీకారం చుట్టాయి.
ఈ సంస్థలు నిర్వహించే లా కోర్సుల్లో చేరేందుకు 2007 వరకూ జాతీయ స్థాయిలో విడివిడిగా ప్రవేశ పరీక్ష రాయాల్సి వచ్చేది. దీనివల్ల విద్యార్థులకు ఆర్థికంగా, విద్యా పరంగా అనేక సమస్యలు తలెత్తేవి.
ఈ అంశాలను గమనించిన 7 నేషనల్ లా యూనివర్సిటీలు సమైక్యంగా ఒకే ఒక కామన్ ఎంట్రెన్స్ ఉండాలనే నిర్ణయానికి వచ్చాయి.
దీని ఫలితమే 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్- క్లాట్ అందుబాటులోకి వచ్చింది. 2008లో మొదటిసారిగా క్లాట్‌ను నిర్వహించాయి. దీనికి మంచి ఆదరణ లభించడంతో 2009లో మరో 4 నేషనల్ లా యూనివర్సిటీలు క్లాట్‌లో చేరాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 14కు పెరిగింది.
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో కనీసం 50 శాతం మార్కులు ఉన్నవారు ఈ పరీక్షకు హాజరు కావచ్చు. వయసు 20 సంవత్సరాలు దాటకూడదు.
చేరదగిన కోర్సులు
1. బీఏ/ బీఎస్సీ/ బీబీఏ/ బీఎస్‌డబ్ల్యూ/ బీకాం, ఎల్ఎల్‌బీ (ఆనర్స్): కోర్సుల కాల వ్యవధి 5 సంవత్సరాలు (ఇంటిగ్రేటెడ్ కోర్సులు).
2. పీజీ ప్రోగ్రామ్ ఎల్ఎల్ఎం: ప్రవేశ ప్రకటన మార్చిలో వస్తుంది. దరఖాస్తులను ఏప్రిల్ మొదటి వారంలోగా అందజేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.clat.ac.in
ఉస్మానియా లా కళాశాల
దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన న్యాయ కళాశాలల్లో హైదరాబాద్‌లోని 'ఉస్మానియా లా కళాశాల అత్యంత ప్రముఖమైందిగా గుర్తింపు పొందింది. ఉస్మానియా వర్సిటీ ఇటీవలే జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ వర్సిటీల్లో 6వ స్థానంలో నిలిచింది. ఉస్మానియాలో లా కళాశాల 1918లో ఉర్దూ మీడియంలో ప్రారంభమైంది. అప్పటినుంచి నేటి వరకు తన ప్రాభవాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఉస్మానియా వర్సిటీ లా విభాగం మూడు, అయిదు సంవత్సరాల ''లా" కోర్సులను నిర్వహిస్తోంది. వర్సిటీ ''లా" విభాగం పరిధిలోని పది అనుబంధ న్యాయ కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
లా యూనివర్సిటీ
నల్సార్ లా యూనివర్సిటీ:
నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ - నల్సార్ పూర్తి రూపం. ఈ వర్సిటీని 1998లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్‌బీ (ఆనర్స్) (5 సంవత్సరాలు) కోర్సును అందిస్తోంది. క్లాట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.nalsar.ac.in
నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ:
ఈ వర్సిటీ ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్‌బీ (ఆనర్స్) కోర్సును అందిస్తోంది. కాల వ్యవధి 5 సంవత్సరాలు. వర్సిటీ నిర్వహించే ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ) ర్యాంక్ ఆధారంగా చేరవచ్చు. పరీక్ష రాసేందుకు ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 21 సంవత్సరాలు దాటకూడదు.
వెబ్‌సైట్: nludelhi.ac.in
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ:
మనదేశంలో 1986లో బెంగళూరులో ఏర్పడిన మొదటి లా విశ్వవిద్యాలయం ఇది. దీంట్లో 5 ఏళ్ల బీఏ ఎల్ఎల్‌బీ (ఆనర్స్) ఉంది. క్లాట్ ద్వారా విద్యార్థులను చేర్చుకుంటారు. వెబ్‌సైట్: www.nls.ac.in
కర్ణాటక స్టేట్‌లా యూనివర్సిటీ:
కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీలో 1) బీఏ ఎల్ఎల్‌బీ (ఆనర్స్), 2) బీబీ ఎల్ఎల్‌బీ (ఆనర్స్) కోర్సులు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటుంది. ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి.
వెబ్‌సైట్: www.kslu.ac.in
భవిష్యత్తు
లా కోర్సులు (3, 5 సంవత్సరాలు) పూర్తి చేసినవారికి నేడు విపరీతమైన డిమాండ్ ఉంది. సామాజిక వాతావరణం న్యాయ శాస్త్ర అవసరాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో న్యాయ శాస్త్రానికి చిక్కని నేరాలు, అక్రమాస్తుల కేసులు, దొంగతనం కేసులు రోజురోజుకు పెరిగిపోవడం వల్ల, సత్వర పరిష్కారాల కోసం ప్రభుత్వాలు న్యాయస్థానాలను, న్యాయమూర్తుల సంఖ్యను పెంచక తప్పడంలేదు.
• అలాగే ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు కూడా న్యాయపరమైన సలహా కోసం, న్యాయశాస్త్ర సహాయకులను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
• లా డిగ్రీ చేసినవారు రాష్ట్ర హైకోర్టులో ఖాళీలు వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్లుగా చేరవచ్చు. అంతేకాకుండా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీ), జనరల్‌పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమితులవడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి.
• న్యాయ వ్యవస్థను గ్రామస్థాయి వరకూ విస్తృత పరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వ్యవస్థలు ఆచరణలోకి వస్తే లా అభ్యర్థుల అవసరం చాలా ఉంటుంది.
• బ్యాంకులు, సెబి, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, ఎల్ఐసీ హౌసింగ్‌కార్పొరేషన్, రైల్వే, పోలీస్ మొదలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో లా అభ్యర్థులకు లీగల్ ఆఫీసర్లుగా మంచి అవకాశాలున్నాయి. అలాగే కార్పొరేట్ రంగంలో అవుట్ సోర్సింగ్‌లో లీగల్ ప్రాసెస్ ఆఫీసర్లు (ఎల్‌పీవో)గా చేరవచ్చు.
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ
విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా పేరును ఇటీవల మార్చారు) ప్రత్యేకమైంది. దీనికి కడప, నిజామాబాద్ ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కదాన్లో 60 సీట్లు ఉంటాయి. 'ఇంటిగ్రేటెడ్ బీఏఎల్ఎల్‌బీ (ఆనర్స్)' పేరుతో ఈ వర్సిటీ కోర్సును అందిస్తోంది. కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉన్నవారు మాత్రమే అర్హులు.
దీన్లో విద్యార్థులను చేర్చుకోవడానికి జాతీయ స్థాయిలో జరిగే క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)లో వచ్చిన ర్యాంకును ఆధారంగా తీసుకుంటారు.
వెబ్‌సైట్: dsnlu.ac.in/index.html