header

Medical Courses...మెడిసిన్

Medical Courses...మెడిసిన్
సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుత ఫలితాలతో ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతోంది. నిన్నటివ‌ర‌కూ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం కొత్తది అనుకుంటే, నేడు బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం నూతన సిద్ధాంతాలకు ఆధారం అంటున్నారు. 1960లో అర్ధవాహక పరికరాలతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 20వ శతాబ్దాన్ని అర్ధవాహక శతాబ్దంగా అభివర్ణించారు. అలాగే 21 శతాబ్దాన్ని బయాలజీ శతాబ్దంగా వర్ణించవచ్చు. కంప్యూటర్, కమ్యూనికేషన్స్ రంగాల్లో వస్తున్న మార్పులు నేడు ఒక సంతృప్తికర స్థాయికి చేరాయి.
ఇంతవరకు మెడికల్ విభాగానికి సంబంధించి పరిశోధనలు జరిగింది ఇల్‌నెస్ విభాగంలో మాత్రమే. అంటే ఒక వ్యాధి, దాని నిర్ధారణ, తగ్గించే విధానమనే చెప్పాలి. రాబోయేది వెల్‌నెస్ విభాగం. అంటే ఇక నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయో ఇన్‌ఫర్‌మ్యాటిక్స్‌లదే రాజ్యం. ఇదే ఈ శతాబ్దపు రిసెర్చి విభాగం.
బయాలజీ విద్యార్థులకు (ఇంటర్ బై.పి.సి) రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా, జాతీయ స్థాయిలో అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షల ద్వారా అనేక కోర్సులు లభిస్తున్నాయి. వైద్య విద్య అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఎంబీబీఎస్. ఎంసెట్ రాస్తే... మంచిర్యాంకు వస్తే... తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ పూర్తిచేయవచ్చు. కానీ ఎంసెట్ రాయకపోయినా, మంచి ర్యాంకు రాకపోయినా వైద్య వృత్తిలో చేరాలనే లక్ష్యాన్ని మార్చుకోవాలా? అవసరంలేదు . మరికొన్ని మార్గాల్లో మరెన్నో కోర్సులు ఉన్నాయి. వాటిని పూర్తిచేసి వైద్యవృత్తిలో చేరి ప్రజలకు సేవచేయవచ్చు. ప్రధానంగా బీఎ
స్సీ నర్సింగ్, పారామెడికల్ లాంటి సంప్రదాయ కోర్సులతోపాటు ఆప్టోమెట్రీ, మెడీకల్ ల్యాబ్ టెక్నాలజీ, ఆక్యుపేషనల్ థెరెపీ, ఫిజియోథెరపీ లాంటి ఆధునిక చదువులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు ఆయా ప్రకటనలు వెలువడినప్పుడు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉన్నత విద్యావకాశాలు:
ఎంసెట్‌తో డిగ్రీ చేసి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారికి లభిస్తున్న విద్యావకాశాలు ఇలా ఉన్నాయి.
1. ఎం.డి (డాక్టర్ ఆఫ్ మెడిసిన్)
2. ఎం.ఎస్ (మాస్టర్ ఆఫ్ సర్జరీ)
3. డి.ఎం/ఎం.కెమి. మెడిసిన్‌లో సూపర్‌స్పెషాలిటీ ప్రోగ్రామ్
4. ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పి.జి. ప్రోగ్రామ్.
5. ఏరోస్పేస్ మెడిసిన్
6. ఏవియేషన్ మెడిసిన్
7. డెర్మటాలజీ
8. పీడియాట్రిక్
9. సైకియాట్రి....
ఇవి కొన్నిమాత్రమే.
అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా పి.జి. లేదా పి.జి డిప్లొమా తదితర కోర్సుల్లో చేరవచ్చు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ప్రవేశ పరీక్షల ద్వారా మాత్రమే చేర్చుకుంటాయి.
జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు
జాతీయస్థాయిలో ఎయిమ్స్, జిప్‌మర్ లాంటి సంస్థలు ఏటా డిసెంబరు మొదలు మార్చి వరకు ప్రవేశ ప్రకటనలు జారీ చేస్తాయి. ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష సాధారణంగా జూన్ లో జరుగుతుంది. జిప్‌మర్ జూన్ మొదటివారంలో, ఎఎఫ్ఎంసి మే మొదటివారంలో నిర్వహిస్తాయి.
ఎం.బి.బి.ఎస్.
బ్యాచ్‌లర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచ్‌లర్ ఆఫ్ సర్జరీ అనేది ఎం.బి.బి.ఎస్.కు సంక్షిప్త రూపం. ఎం.బి.బి.ఎస్. డిగ్రీ చేస్తేనే డాక్టర్ అవుతారు. సమాజంలో డాక్టర్‌కు వృత్తిపరంగా ఎనలేని గౌరవం లభిస్తోంది. అంకితభావంతో కోర్సును పూర్తిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.
కాలవ్యవధి: నాలుగున్నర సంవత్సరాలు. ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి.
డాక్టర్ కావడమే లక్ష్యంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బై.పి.సి.లో చేరుస్తున్నారు. ఒకసారి డాక్టర్‌గా కెరీర్ ప్రారంభిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరంలేదు.
భారతదేశంలో మొత్తం మెడికల్ కాలేజీలు 450 ఉండగా, వీటిలోని సీట్ల సంఖ్య దాదాపు 30000. ఈ సీట్ల కోసం ప్రతి సంవత్సరం ప్రయత్నిస్తున్న విద్యార్థుల సంఖ్య సుమారు లక్షకు పైగా ఉంటుంది. అంటే పోటీ 1 : 3 గా చెప్పవచ్చు.
జాతీయ స్థాయిలో...
AIIMS, JIPMER, AFMC, CMC, MGIMS, BHU మొదలైన ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశం కోసం ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. రాష్ట్రంలో...
మన రాష్ట్రం విషయానికొస్తే మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ రాయాల్సిందే. 'ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్' అనేది ఎంసెట్ పూర్తి రూపం. ఈ పరీక్ష రాస్తే రాష్ట్రంలోని 33 కళాశాలల్లో ఎక్కడైనా చేరవచ్చు.
నాలుగేళ్ల క్రితం ప్రతి మెడికల్ సీటుకీ కనీసం 100 మంది వరకు పోటీపడుతుండేవారు. ఈ పోటీ ఇప్పుడు చాలా తక్కువగా ఉంటోంది. ఎంసెట్ మెడికల్ విభాగపు పరీక్షకు గతంలో లక్షకు పైగా హాజరయ్యేవారు. అది ఇప్పుడు దాదాపు 30 వేలకు తగ్గింది.
ప్రస్తుతం లభిస్తున్న ఎం.బి.బి.ఎస్. సీట్లు:
4400. అంటే పోటీ దాదాపు 1:6 మాత్రమే ఉంటోంది. పోటీ ఎంత తగ్గిందో ఊహించుకోవచ్చు. కాబట్టి విద్యార్థి లేదా తల్లిదండ్రులు 6 సంవత్సరాల తర్వాత అధిక ప్రాధాన్యం ఉన్న విభాగం ఏది అవుతుందో దాన్ని నేడు ఎంపిక చేసుకోగలగాలి. అప్పుడే ఆ విద్యార్థి భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుందని పేర్కొనవచ్చు.
పారామెడికల్
వైద్య రంగంలో సేవలు అందించే వారిలో డాక్టర్లు, నర్సులతో పాటు పారామెడికల్ సిబ్బంది కూడా ముఖ్యమైన మానవ వనరులే. ల్యాబ్ లలో రక్తపరీక్షలు, ఎక్స్ రే, స్కానింగ్, తదితర విధులను నిర్వహించడదనికి ఆయా విభాగాల్లో అనుభవం కలిగిన సిబ్బంది కావాలి. వీరే పారామెడికల్ సిబ్బంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పారామెడికల్ ఇన్ స్టిట్యూట్లలో అనేక రకాల పారామెడికల్ కోర్సులను ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు నిర్వహిస్తోంది. రెండేళ్ల కాలవ్యవధి కోర్సులు:
మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, ఆప్టోమెట్రీ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, రేడియోథెరపీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ తదితర సబ్జెక్టులు. సంవత్సరం కాలవ్యవధి కోర్సులు:
కార్డియాలజీ టెక్నీషియన్ ఇ.సి.జి. టెక్నీషియన్, కాథ్ లాబ్ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, రేడియో గ్రాఫిక్ అసిస్టెంట్ మొదలైనవి. ప్రకటనలు మే, జూన్ లో వెలువడుతుంటాయి. ఇంటర్ తత్సమానం పాసైనవారు అర్హులు, ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
చిరునామా:
ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు,
రూమ్ నెం. 306,
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్,
కేంద్రీయ సదన్ వెనుక, కోఠి,
హైదరాబాద్ - 500095.
వెబ్ సైట్: www.appmb.org
భవిష్యత్తు: పారామెడికల్ కోర్సులు చేసినవారు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు, పరిశోధనశాలల్లో సంబంధిత విభాగంలో టెక్నీషియన్లుగా, అసిస్టెంట్ లుగా చేరవచ్చు.
ఫార్మా-డి
ఫార్మాస్యూటికల్ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని, క్లినికల్, రిసెర్చ్ రంగాల్లో నిపుణులను తయారుచేయడానికి వీలుగా ఈ కోర్సును రూపొందించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సే ఫార్మా-డి.
ప్రవేశం: ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.
కాలవ్యవధి: ఆరు సంవత్సరాలు. మూడు సంవత్సరాల కాలేజీ చదవాలి. రెండు సంవత్సరాలు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం పరిశోధన.
2008లో ఫార్మా-డి కోర్సును ప్రారంభించారు. దేశంలో 25కు పైగా కాలేజీల్లో ఈ కోర్సు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 15 కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఒక్కొక్క కాలేజీకీ కేవలం 30 సీట్లు మాత్రమే కేటాయించారు. వీటిలో 50 శాతం సీట్లను ఎం.పి.సి. విద్యార్థులకు, మరో 50 శాతం సీట్లను బై.పి.సి. విద్యార్థులకు ఇస్తారు. ఫార్మా రంగంలో ప్రవేశించేవారికి రాబోయే కాలంలో విశేషమైన కెరీర్ ఉంటుంది.
బి.డి.ఎస్.
రాష్ట్రంలో ఎంసెట్ రాసే వారిలో ఎక్కువమంది ఎం.బి.బి.ఎస్. వైపు మొగ్గుచూపుతారు. తరువాతే మిగిలిన వాటివైపు దృష్టి సారిస్తారు. వాటిలో మొదటి ప్రాధాన్యం బి.డి.ఎస్.కే దక్కుతోంది. బ్యాచ్‌లర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అనేది బి.డి.ఎస్.కు పూర్తి రూపం.
కోర్సు కాలవ్యవధి: నాలుగున్నర సంవత్సరాలు. ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 1340కి పైగా సీట్లున్నాయి.
బి.డి.యస్.లో అనాటమీతోపాటు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ సబ్జెక్టులను నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డెంటిస్ట్రీలో ఆర్థోడెంటిక్స్, డెంటో-ఫేషియల్ ఆర్థోపిడిక్స్, డెంటల్ పబ్లిక్ హెల్త్ ఎండోడెంటిక్స్, ఆర్థోపిడిక్స్, పీరియాడెంటిక్స్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎం.డి.ఎస్.కూడా చేస్తే అవకాశాలు బాగా ఉంటాయి.
బి.డి.యస్.లో అనాటమీతోపాటు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ సబ్జెక్టులను నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డెంటిస్ట్రీలో ఆర్థోడెంటిక్స్, డెంటో-ఫేషియల్ ఆర్థోపిడిక్స్, డెంటల్ పబ్లిక్ హెల్త్ ఎండోడెంటిక్స్, ఆర్థోపిడిక్స్, పీరియాడెంటిక్స్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎం.డి.ఎస్.కూడా చేస్తే అవకాశాలు బాగా ఉంటాయి.