నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) ప్రవేశానికి పరీక్షను ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఏటా జనవరి, మే నెలల్లో ప్రకటనలు విడుదలవుతాయి. జనవరిలో వచ్చే నోటిఫికేషన్‌కు ఏప్రిల్‌లో, మేలో విడుదలయ్యే ప్రకటనకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్‌డీఏకు ఎంపికైనవారు మూడేళ్లపాటు పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదువుతారు. నేవల్ అకాడమీకి ఎంపికైనవారు నాలుగేళ్లపాటు కేరళలోని ఎజిమాలలో బీటెక్ అభ్యసిస్తారు. రెండు చోట్లా విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఉచితంగా సమకూరుస్తారు. డిగ్రీలను న్యూదిల్లీలోని ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రదానం చేస్తుంది.
v అర్హతలు:
ఆర్మీ వింగ్ (ఎన్‌డీఏ)కు బాలురు మాత్రమే దరఖాస్తు చేయాలి. వీరు ఏదైనా గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని విభాగాలకు ఇంటర్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
16 1/2 - 19 1/2 ఏళ్లు
అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెం.మీ. ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
పత్రి నోటిఫికేషన్‌లోనూ 400కు పైగా ఖాళీలు ఉంటాయి. వీటిలో ఆర్మీ 200 నేవీ 60, ఎయిర్‌ఫోర్స్ 90 సుమారుగా ఖాళీలు ఉంటాయి. నేవల్ అకాడమీలో 55 వరకు ఉంటాయి.
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. అవి రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ తరహా), ఇంటెలిజెన్స్ - పర్సనాలిటీ టెస్ట్. రాత పరీక్షలో మొత్తం 900 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో మ్యాథ్స్ నుంచి 300 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. పేపర్-2లో 600 మార్కులకు జనరల్ ఎబిలిటీ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనికి వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో ఇంగ్లిష్‌కు 200, జనరల్ నాలెడ్జ్‌కి 400 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికి 900 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, అవుట్‌డోర్ గ్రూప్ టాస్క్‌లు ఉంటాయి. స్టేజ్-1లో అర్హత సాధించినవారినే స్టేజ్-2కి అనుమతిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిభ ఆధారంగా సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.
మొదటి రెండున్నర సంవత్సరాల శిక్షణ అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. ఎన్‌డీఏలో మూడేళ్ల శిక్షణ, చదువు అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమాలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ (మూల వేతనం రూ.56,100) చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి డిగ్రీలు ప్రదానం చేస్తారు. ఆర్మీని ఎంచుకున్న వారికి బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్స్)/ బీఏ; నేవీ, ఎయిర్‌ఫోర్స్, నావెల్ అకాడమీ అభ్యర్థులకు బీటెక్ డిగ్రీని న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) అందజేస్తుంది. అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ. లక్ష వరకు వేతనం ఉంటుంది.
వెబ్‌సైట్:www.upsc.gov.in