దెబ్బతిన్న శరీర అవయవాల పనితీరును యథాస్థితికి తీసుకురావడంలో ఫిజియోథెరపిస్టులు సిద్ధహస్తులు. తగిన వైద్యం, శస్త్రచికిత్సలతో పాటు పూర్తిస్థాయిలో కోలుకోడానికి ఫిజియోథెరపీ కూడా ఎంతో కీలకం.
పెద్ద పెద్ద ప్రమాదాలకు గురై విరిగిపోయిన అవయవాలను, అనుకోని పరిస్థితుల్లో చచ్చుబడిపోయిన శరీర భాగాలను కొద్ది నెలల్లో చక్కగా పనిచేయించగలిగే అద్భుత నైపుణ్యం ఫిజియోథెరపీ. నిజానికి ఇది అతి ప్రాచీన గ్రీకు వైద్య విధానం. చిన్న చిన్న మసాజ్‌లతో మొదలు పెట్టి అత్యంత క్లిష్టమైన ఆధునిక పద్ధతుల స్థాయికి చేరింది. ఇప్పుడు ఎన్నో రకాల స్పెషలైజేషన్లు, కోర్సులతో వైద్యరంగంలో ప్రధానమైన కెరియర్‌గా మారింది.
శరీరంలో ఏవైనా అవయవాలు ప్రమాదానికి గురైనా, చచ్చుబడినా నిర్దేశిత పద్ధతులు, వ్యాయామాల ద్వారా ఫిజియోథెరపిస్టులు వాటిని ప్రేరేపిస్తారు. తీవ్ర గాయాలకు మందులతో ప్రభావం కొంతవరకే ఉంటుంది. వాటి నుంచి పూర్తిగా కోలుకుని, మునుపటి స్థితికి తీసుకురావడం కేవలం ఫిజియోథెరపీతోనే సాధ్యమవుతుంది. పుట్టుకతో వచ్చే లోపాలు, వైకల్యాలు, ప్రమాదాల కారణంగా ఏర్పడిన గాయాల ప్రభావాన్ని వీలైనంత తగ్గించడమే ఫిజియో ప్రధాన ఉద్దేశం. ఆర్థరైటిస్, నడుము, వెన్ను, మెడనొప్పులు, పనిలో ఏర్పడిన గాయాలు, ఆటలాడుతున్నప్పుడు కండరాలు పట్టేయడం, పక్షవాతం, ప్రమాదవశాత్తూ ఏర్పడిన వైకల్యాలు తదితరాలన్నింటికీ ఫిజియోథెరపీ సేవలు ఎంతో అవసరం. క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్టులు ఉంటారు. వాళ్ల ఫిట్‌నెస్ కోసం నిరంతరం పనిచేస్తుంటారు. ఈ రంగంలో కోర్సులు చేస్తే మంచి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
అర్హతలు....
బైపీసీతో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు ఫిజియోథెరపీ కోర్సులు చేయడానికి అర్హులు.
ఫిజియోథెరపిస్టు కెరియర్‌లోకి ప్రవేశించాలనుకునే వాళ్లు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) చేయాలి. ఇది నాలుగున్నరేళ్ల కోర్సు. ఇందులో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఎలక్టివ్‌లు ఉంటాయి. దీనిలో భాగంగా ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, స్పోర్ట్స్, కార్డియో పల్మనరీ, ఐసీయూ, పీడియాట్రిక్స్ తదితరాలను స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. . ఆధునిక వైద్య పరిభాషపై ఎప్పటికప్పుడు పట్టు పెంచుకుంటూ ఉండాలి.
తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు నలభై కాలేజీల్లో ఫిజియోథెరపీ కోర్సు అందుబాటులో ఉంది. ఏపీలో ప్రవేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం జులైలో ప్రకటన విడుదల చేస్తుంది. తెలంగాణలోని సంస్థల్లో ప్రవేశానికి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆగస్టు చివరకు నోటిఫికేషన్ ఇస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ బీపీటీలోకి 50 సీట్లు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ (ఐఏపీ) దీనికి అపెక్స్ బాడీగా వ్యవహరిస్తోంది. ఇంటర్ బైపీసీ లేదా వొకేషనల్ (ఫిజియోథెరపీ) లేదా ఇంటర్ వొకేషనల్‌తోపాటు బయాలజీ, ఫిజికల్ సైన్స్‌ల్లో బ్రిడ్జ్ కోర్సులు పూర్తిచేసినవారు; ఏపీ/ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా బయాలజీ, ఫిజికల్ సైన్స్ కోర్సులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఆగస్టులోనే మరికొన్ని నోటిఫికేషన్లు వెలువడ వచ్చు
ఉద్యోగావకాశాలు
నరాల సంబంధిత ఇబ్బందులు, నడుము, మోకాళ్ల నొప్పులు, మెడ, కండరాలు పట్టేయడం సాధారణ సమస్యలుగా మారిపోయాయి. వీటికి తగిన చికిత్స అందించడానికి ఫిజియోథెరపిస్టులు తప్పనిసరి. దివ్యాంగులకు సేవలందించే కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్ హోంలు/ ప్రైవేటు కేర్ సెంటర్లు, ప్రైవేటు, పబ్లిక్ ఆసుపత్రులు, ప్రైవేటు ప్రాక్టీస్, పునరావాస కేంద్రాలు, స్పోర్ట్స్ క్లినిక్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలో ఫిజియోథెరపిస్టులకు ఉద్యోగాలు లభిస్తాయి.
అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ల్లో ఫిజియోథెరపిస్టులకు ఎక్కువ వేతనంతో ఉద్యోగాలు ఇస్తున్నారు. బీపీటీ డిగ్రీ, ఆంగ్లంలో నైపుణ్యం ఉన్నవాళ్లకి విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. వీరికి ప్రారంభంలో ప్రైవేటు క్లినిక్స్‌లో రూ.8000-15,000 వరకూ వేతనాలు అందుతున్నాయి. కొంచెం అనుభవంతో సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా నెలకు రూ.50,000పైగా సంపాదించవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ ఫిజియోథెరపిస్టులు రూ.30,000, సీనియర్లు రూ.45,000, ఫిజియోథెరపీ సూపరింటెండెంట్‌లు రూ.70,000, చీఫ్ ఫిజియోథెరపిస్టులు రూ.80,000 వరకు వేతనాలు పొందుతున్నారు. ప్రభుత్వపరంగా అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. ఇందులో టీచింగ్ వృత్తినీ ఎంచుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్నవారు ఒక్కో సిట్టింగ్‌కూ రూ.250 నుంచి రూ.400 వరకు తీసుకుంటున్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాలు పొందాలనుకున్నవారు, స్పెషలైజేషన్ చేయాలనుకునేవారు రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ) కోర్సులో చేరవచ్చు.
కోర్సులు అందించే సంస్థలు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ముంబయి.
పండిట్ దీన్ దయాళ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజెబిలిటీస్, న్యూదిల్లీ.
పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, చండీగఢ్
అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, హైదరాబాద్
గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ మెడిసిన్, చెన్నై
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, పట్నా
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్, న్యూదిల్లీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, మంగళూరు
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్, కటక్
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటివ్ డిజేబిలిటీస్ - కోల్‌కతా
స్వామీ వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ - కటక్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ - చెన్నై
వీటిలో కొన్ని సంస్థలు ప్రత్యేక రాతపరీక్ష ద్వారా, మరికొన్ని కనీస విద్యార్హత మార్కుల ఆధారంగా కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.