భారతదేశ చరిత్రలో అల్లూరి సీతారామరాజు చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది. పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన విప్లవవీరుడు సీతారామరాజు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన ఆటవిక అనుచరులతో, కొద్ది పరిమిత వనరులతో బ్రిటీషు వారిని ఎదుర్కొన్నాడు
అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు.
ఇతని తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ
అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి కూడా పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంథం అట్టపైన కూఢా "శ్రీరామరాజు", "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది.
1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరిపుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి గతించాడు.
ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రి మరణించడంతో రాజు జీవితం కష్టాలకడలిలో కూరుకుపోయింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడవలసివచ్చింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసించారు. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది.
తరువాత
1909లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి మారారు. భీమవరంలో మిషన్ హైస్కూలులో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారంలో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి.
తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.
రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంకి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలోనాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్లనూ పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురంలో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు.
ఆ సమయంలో తల్లి తునిలో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడుకాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానివేసాడు.
తరువాత పేజీలో .....