header

Alluru Sitarama Raju

అల్లూరి సీతారామరాజు

రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవు పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం,కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.
చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.
1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు మొదలుపెట్టాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్యగ్రంథము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నాడు.
కృష్ణదేవు పేట చేరుకుని అక్కడికి దగ్గర్లోని ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేసాడు. కృష్ణదేవుపేట లోని చిటికెల భాస్కరుడు అనే వ్యక్తి, అతని తల్లి ద్వారా రాజు తల్లికి అతని ఆచూకీ తెలిసి,ఆమె రాజు వద్దకు వచ్చింది. 1918 వరకు అందరూ అక్కడే ఉన్నారు.
1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి, బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవు పేట చేరాడు. కృష్ణదేవిపేట వద్ద తాండవ నదిలో "చిక్కలగడ్డ" కలిసేచోట గ్రామస్థులు కట్టిఇచ్చిన రెండు ఇండ్లలో రాజు, అతని తల్లి, తమ్ముడు, సోదరి, బావ కాపురముండేవారు. దానికి "శ్రీరామ విజయ నగరం" అని పేరు పెట్టారు. రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమె పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలుదేరేవాడు.
అనేక యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవాడు. భక్తి చూపేవారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టుక్రింద మండల దీక్ష నిర్వహించాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు భావించేవారు.
ఆ రోజుల్లో అటవీ ప్రాంతంలోని ప్రజలు బ్రిటీష్ వారి చేతిలో అనేక అన్యాయాలకు, దోపిడీలకు, దరాగతాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణమైన విషయం. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది బ్రిటీష్ ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు కల్పించడం జరిగింది.
తరువాత పేజీలో .....