header

Alluru Sitarama Raju

అల్లూరి సీతారామరాజు

ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చేరారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, తక్కువ కూలీ ఇచ్చేవారు అది కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండు అణాలో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది.
కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేదికాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.
మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా వారిని తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యంలోని గిరిజనులను కూడగట్టుకొని, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేసాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు. అక్కడి బ్రిటీషు అధికారులలో చింతపల్లి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు.
అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజుపై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను రెచ్చగొట్టి విప్లవానికి సిద్ధపడుతన్నాడనేది ఆ నివేదిక సారాంశం. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు,అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.
ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాడట. 27-7-1922న తిమ్మాపురంలో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వరసాపురం పంపేశాడు.
గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు - భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారవుతారు. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం మొదలవుతుంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యంలో విప్లవం ఆరంభమైంది.
1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. వారు తీసుకున్నవి రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా తీసుకున్నారు.
ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి, భోజనాలు చేసి ఆ రాత్రే ఆగష్టు 23న - కృష్ణదేవు పేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి. తరువాత పేజీలో .....