అరుణాచలం గొప్ప శైవపుణ్య క్షేత్రం. స్మరించినంత మాత్రమే ముక్తిని ప్రసాదించే దివ్వక్షేత్రమంటారు. తమిళంలో తిరువణ్ణామలై అని పేరు. అరుణాచలం వేదాలలో మరియు పురాణాలలో కూడా ప్రస్తావించిన క్షేత్రం. సాక్షాత్తు శివాజ్ఞచే విశ్వకర్మ అరుణాచలంను నిర్మించాడంటారు. ఇక్కడ పూజా విధానం మరియు అరుణాచల స్తోత్రం శివుడే గౌతమ ముని ద్వారా నిర్ధేశించాడని అరుణాచల మహాత్యంలో వివరించబడినది. ఈ కొండకు తూర్పున గల అరుణాచల క్షేత్రం కంటే ఈ కొండకే ప్రాముఖ్యం ఎక్కువ. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం.
అరుణాచలం జ్యోతిర్లింగమని చెప్పబడుచున్నది. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు ఇక్కడే అనేక పవిత్ర తీర్ధాలు ఉన్నవి. బ్రహ్మతీర్ధం, వ్యాసతీర్ధం, శివగంగతీర్ధం మొదలగునవి. ఒక్కొక్క తీర్ధంలో స్నానమాచరిసే ఒక్కోక్క రకమైన ఫలితం దక్కుతుందంటారు. పంచభూత లింగాలో ఒకటైన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు.
చోళరాజు 910 శతాబ్ధాల మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ క్షేత్రానికి నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుంటాయి. అన్నిటి కంటే ఎత్తైనది తూర్పు గోపురం. ఈ గోపురం ఎత్తు 217 అడుగులు. ఈ ఆలయం 25 ఎకరాలలో విస్తరించి ఉన్నది. శ్రీకృష్ణదేవరాయలచే నిర్మింపబడిన వేయి స్తంభాల మండపం, కోనేరు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అరుణగిరిపై స్కంధాశ్రమం, విరుపాక్ష గుహ ఉన్నాయి. అక్కడే రమణ మహర్షి ఎన్నో రోజుల పాటు ధ్యానముద్రలో ఉండేవారట.
పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ.. స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట.
‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట.
వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీపుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట.
ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. ‘మా అహంకారం పోయింది.
అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూ లోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు.
ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ.
శివసన్నిధి
తెలుగు వారిచే నిర్వహించబడుచున్న...శివసన్నిధి అరుణాచలం గుడికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది. ఆటోలకు రూ.50- తీసుకుంటారు. రూమ్ లకు అద్దె తీసుకోరు. కానీ తప్పనిసరిగా కొంత డోనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డోనేషన్ బట్టి గదులు కేటాయిస్తారు. గది కేటాయించబడితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితంగా పెడతారు. డోనేషన్ మన ఇష్టం వచ్చినంత ఇవ్వవచ్చు. శివసన్నిధికి ఫోన్ చేసి గదులు రిజర్య్ చేసుకోవచ్చు. లేక డైరెక్ట్ గా వెళ్ళవచ్చు.
ఫోన్ నెం: 04175-235089. సెల్ : 9789378779.
అరుణాచలం గుడికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ నార్మల్ డీలక్స్, ఏ.సి.(రూ.800) గదులు కలవు. ఫోన్ చేసి గదులు బుక్ చేసుకోవచ్చు.
ఫోన్ నెంబర్లు 04175-236999, 238599.
ఈ ఆశ్రమం కూడా అరుణాచలం గుడికి రెండుకిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆశ్రమంలో గదులు అప్పటికప్పుడు దొరకవు. కనీసం 15 నుండి 20 రోజుల ముందుగా బుక్ చేసుకోవలసి ఉంటుంది. ashramam@sriramanamaharshi.org ఈ మెయిల్ కు ముందుగా గదుల రిజర్వేషన్ కొరకు వివరాలు పంపవలసి ఉంటుంది. గదులు దొరికితే గది అద్దె, భోజనం ఉచితం.
ఈ ఆశ్రమంలోనే రమణ మహర్షి సమాధి ప్రాంగణం ఉంది. ఆశ్రమం చాలా ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది.
గుడి చుట్టుప్రక్కల హోటల్స్ ఉన్నాయి కానీ చాలా ఖరీదు.