Rajagopalaswamy, Mannar Gudi/ రాజగోపాలస్వామి ఆలయం, మన్నారుగుడి
తమిళనాడులోని మన్నారుగుడిలో గల రాజగోపాలస్వామి ఆలయం సువిశాలమైన ప్రాంగణంతో, అద్భుతమైన శిల్పసంపదతో కనువిందు చేస్తుంది. దక్షిణద్వారకగా పేరొందిన ఈ ఆలయం అతి విశాలమైనది, అత్యంత పురాతనమైనదీ! రోజూ ఆరుమార్లు నిత్యపూజలతో, మూడు సంవత్సరోత్సవాలతో అంగరంగవైభవంగా అలరారే ఈ ఆలయంలో రథోత్సవం, చక్రతీర్థం, గరుడవాహన సేవ సుప్రసిద్ధమైనవి.
ఆలయ నిర్మాణం: 11వ శతాబ్దానికి చెందిన కుళోత్తుంగ చోళుడు ఇటుకలు, బంకమట్టితో నిర్మించగా, ఆయన తర్వాత వచ్చిన చోళ రాజులు దీనిని మరింత అభివృద్ధి పరిచారు. 16 వ శతాబ్దికి వచ్చేసరికి ఆలయం శిథిలావస్థకు చేరగా తంజావూరు నాయకరాజులు జీర్ణోద్ధరణ చేసి, మరింత విస్తారం చేశారు. 23 ఎకరాల స్థలంలో 192 అడుగుల ఎల్తైన రాజగోపురంతో, విశాలమైన కొలనుతో దక్షిణభారతదేశంలో అతిపెద్ద కొలనుగల ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతం వెయ్యి స్తంభాలతో, 16 గోపురాలతో, ఏడు ప్రాంగణాలతో, ఏడు హాళ్లతో, తొమ్మిది ట్యాంకులతో, 24 విగ్రహాలతో అత్యంత పెద్దదిగా, నయన మనోహరంగా విలసిల్లే ఈ ఆలయంలో రుక్మిణీ సత్యభామాసమేత రాజగోపాలస్వామిగా శ్రీ కృష్ణుడు పూజలందుకుంటాడు. ఆలయానికి అనుబంధంగా1158 అడుగుల పొడవు, 837 అడుగుల వెడల్పుతో హరిద్రానదిగా ఖ్యాతినొందిన కొలను ఉంటుంది. ఇది దేశంలోని అతిపెద్ద కొలనుల్లో ఒకటిగా పేరు పొందింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పంగుణి అనే తమిళ మాసంలో ఈ దేవాలయంలో 18 రోజులపాటు పంగుణి తిరువిళ అనే ఉత్సవం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తారు.
తీర్థాలయం: ఈ ఆలయంలోని హరిద్రానదికి రాధాకృష్ణులు, గోపికలు కలసి జలకాలాడినదిగా పేరు. వారు జలక్రీడలాడటం కోసం పసుపు, చందనం, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల నదికి హరిద్ర అనే పేరు వచ్చింది. అందుకే కాబోలు నది నీరు ఇప్పటికీ పరిమళభరితంగా ఉంటుంది. ఈ నదిని కావేరీనది కుమార్తెగా భావిస్తారు స్థానికులు. నది మధ్యలో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని చూస్తుంటే ఆయన మనతో కలసి జలక్రీడలాడుతున్నాడేమో అన్నంత సజీవంగా ఉంటుంది. రోహిణీ నక్షత్రం, తిరువోనం, పౌర్ణమి, అమావాస్య, సూర్య, చంద్రగ్రహణాల సమయాలలో భక్తులు నదిలో పవిత్రస్నానాలు చేస్తారు.
ఆలయానికి ఉత్తర దిశగా దుర్వాస తీర్థం, భృగుతీర్థం, గోపికాతీర్థం, రుక్మిణీ తీర్థం, అగ్నికుండతీర్థం, కృష్ణతీర్థం, శంఖుతీర్థం, చక్రతీర్థం, పంబనీ నది వంటి ఇతర తీర్థరాజాలున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క చరిత్ర, ఆవిర్భావ గాధ, పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆలయానికి వచ్చినవారు ఈ తీర్థాలన్నింటిలోనూ పుణ్యస్నానాలు చేయడం ఆచారం.
ఆలయ ఉత్సవాలు: తమిళనాడులోని తంజావూరు జిల్లా కోయిల్ పాథీ, కూళం పాథీ అనే సామెతతో ప్రసిద్ధి. అంటే ఆలయాలు సగం, పుష్కరిణులు సగం అని. ఇది మన్నార్‌గుడి ఆలయానికి పూర్తిగా వర్తిస్తుంది.
ఆలయ ఉనికి: మన్నార్‌గుడి రాజగోపాల ఆలయం తంజావూరు జిల్లా తిరువరూరుకు 28 కిలోమీటర్ల దూరంలోని మన్నార్‌గుడిలో ఈ ఆలయం ఉంది.
క్షేత్రపురాణం: కుంభకోణం వద్దగల చంపకవనానికి చేరువలో హేమపుష్కరిణి తీర్థం ఒడ్డున ఎనిమిది మంది రుషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. వారిలో వహ్నిముని ఒకరు. ఆయనకు గోపిలర్, గోప్రలాయర్ అని ఇద్దరు కుమారులు. బాల్యం నుంచే వారికి మోక్షాపేక్ష తప్ప మరే ధ్యాసా లేదు. నిత్య తపోనిష్ఠాగరిష్ఠులు. వారి కఠోర తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తమను ఈ భవబంధాలనుంచి తప్పించి, శాశ్వత కైవల్యాన్ని కలిగించవలసిందిగా కోరారు వారు. అందుకు స్వామి నవ్వి, ‘‘మీరు ద్వారక వెళ్లి, అక్కడ కన్నయ్యను దర్శించుకుని రండి, అప్పుడు మీకు మోక్షం లభిస్తుంది’’ అని చెప్పి అంతర్థానమయ్యాడు. వెంటనే వారు పరమానందంతో తమకు తారసిల్లిన పుణ్యనదులన్నింటిలోనూ స్నానం చేస్తూ, ద్వారకను వెదుక్కుంటూ వెళ్లసాగారు. దారిమధ్యలో వారికి నారదముని కనిపించాడు. ఆయన కు నమస్కరించి, ‘‘మేము ద్వారకకు వెళ్లాలనుకుంటున్నాము. ఇక్కడినుంచి ఎలా వెళ్లాలి, కన్నయ్యను ఎలా కలవాలి?’’ అని అడిగారు. అందుకు నారదుడు నవ్వి, ‘‘మీరు కలవాలనుకుంటున్న స్వామి అవతార పరిసమాప్తి కూడా అయిపోయింది. ఆయన ఇప్పుడు వైకుంఠానికి చే రిపోయాడు. ఆయనను మీరు ఇక కలవలేరు’’ అన్నాడు.
..................................తరువాత పేజీలో .........................................