అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఈ శక్తిపీఠం అస్సాం రాజధాని గౌహతీకి 8 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్రా నది ఒడ్డున, నీలాచలం పర్వతం మీద ఉంది ఈ శక్తిపీఠం. ఈ ఆలయ నిర్మాణం నాలుగు గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి మూడు, మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండాలతో, తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. ఆలయంలో మూలవిరాట్టుకు విగ్రహం ఉండదు. శిలారూపంలో యోనిముద్రగా పూజలందుకుంటున్నది. ఇరుకైన గుహలో, జలధార నడుమ ఉందీ శక్తిపీఠం. ఆషాడ మాసంలో ఐదు రోజులపాటు జరిగే అంబుబాచి మేళా ఉత్సవానికి వేలాదిగా భక్తులు వస్తారు. మిగతా రోజులలో భక్తులు తక్కువ. కొండ కోనల్లో సాధన చేసుకునే సాధుసంతులు, అఘోరాలు, తాంత్రికులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు. అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూలకారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అద్భుతమైన ఉత్సవం: మృగశిర కార్తె వెళ్ళి ఆరుద్ర ప్రవేశించే నాటికి భూమాత రజస్వల అవుతుందని దేవీభాగవతంలో ఉంది. అంబుబూచి మేళా ఈ సమయంలోనే జరుగుతుంది. ఇదే కామాఖ్యా కుంభమేళాగా పిలుస్తారు. తొలకలరి చినుకులు కురిసే సమయంలో గర్భగుడిలో శక్తిపీఠంపై ప్రవహించే జలధార ఎర్రగా మారుతుంది దీనినే దేవీ వార్షిక రుతుచక్రంగా భావిస్తారు. దేవీప్రసాదం : అంబుభూచి పర్యానికి ముందు శక్తిపీఠంపై ఎర్రటి వస్ర్తాన్ని కప్పుతారు. జలధార ఎర్రగా మారటంతో వస్ర్తం ఎర్రగా మారుతుంది. ఈ వస్ర్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా మార్చి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. తరువాత పండాలు, గర్భగుడిని, శక్తిపీఠాన్ని శుభ్రపరచి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఐదోరోజున ఆలయాన్ని తెరుస్తారు. ఈ ఐదురోజులు సాధువులు, సామాన్యులు ఆలయం వెలుపల అమ్మవారి దర్శనంకోసం వేచివుంటారు. ఈ సందర్భంగా సిధ్ధులు అద్భుతమైన విన్యాసాలు చేస్తారు. వీభాగవతం, శివపురాణం ఇతర ఇతిహాసాలలో ఈ శక్తిపీఠం ఎంతో ప్రశస్తి కలిగివుంది. తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం. మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలను సైతం బలిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శనఫలం దక్కదని భక్తుల నమ్మకం. సంధ్యావేళ దాటిన తరవాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడాఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు. ఉత్సవాలు ఏటా వేసవిలో మూడురోజుల పాటు అంబుబాచీ పండుగ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు. పూజారులు కూడా గుడిలోపలికి వెళ్లరు. నాలుగో రోజు లక్షలమంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపురంగులో ఉంటుంది.నవరాత్రి సమయంలో ఐదు రోజుల పాటు ఇక్కడ దుర్గా ఉత్సవాలతో పాటు భాద్రపదమాసంలో మానస పూజ నిర్వహిస్తారు. ఆ సమయంలో జంతుబలులు నిషేధం. ఎలావెళ్లాలి : అసోం రాజధాని గౌహతి నగరం మధ్యలో కామాఖ్యాదేవి ఆలయం వుంది. నీలాచలం పర్వతంపై ఉన్న ఈ ఆలయానికి బస్సులలో వెళ్ళవచ్చు. ఇతర రాష్ర్టాల నుండి వచ్చేవారు కామాఖ్యా రైల్వే స్టేషన్లో దిగి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సులలో వెళ్ళవచ్చు. గౌహతీ విమానాశ్రయానికి 20 కి.మీ. దూరంలో ఉంటుంది ఈ ఆలయం. కొండమీదికి మెట్లమార్గంలో లేక బస్సులలో వెళ్ళవచ్చు.