కూర్మావతారం విష్ణువు అవతారాలలో రెండవది. కృత (సత్య) యుగంలో జరిగింది.ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపిస్తాడు. అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని చెబుతాడు.
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటే శకితవంతులైన దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుని తాడుగా చేసి క్షీరసముద్ర మథనం మొదలు పెడతారు. కాని బరువైన మందరగిరి సముద్రంలో మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి రావటంతో దేవతలంతా శ్రీహరిని ప్రార్థిస్తారు. శ్రీహరి కూర్మరూపంలో మందరగిరిని మునిగిపోకుండా తనవీపుమీద భరిస్తాడు. దేవతలు, దానవులు తిరిగి సముద్ర మధనాన్ని సాగిస్తారు.
ముందుగా సముద్రంలోనుండి సర్వలోకాలను దహించే హాలాహలం వెలువడుతుంది. దేవతలందరూ పరమశివుని రక్షించమని కోరతారు. శివుడు హాలాహలాన్ని స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు. అందుకే పరమశివుని గరళకంఠుడు, నీలకంఠుడు అని అంటారు.
తరువాత సముద్రంనుండి అప్సరసలు, ఐరావతం, కల్పవృక్షము, కామధేనువు, తెల్లని గుర్రము వస్తాయి. తరువాత సకల శుభలక్షణ శోభితమై శ్రీమహాలక్ష్మీ ఉద్భవిస్తుంది. ఈమె శ్రీమహావిష్ణువుని వరిస్తుంది.
చివరకు ధన్వంతరీ అమృత కలశంతో సముద్రం నుండి వస్తాడు. ఆ అమృతకలశాన్ని దానవులు అపహరించి పారిపోతుండగా శ్రీహరి మోహినీ రూపంలో అమృతాన్ని దేవతలకు దక్కేటట్లు చేస్తాడు.