header

Narasimhavataram

నారసింహావతారము
Narasimhavataramనారసింహావతారము జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. సనకసనందనాది మునులు నారాయణుని దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా స్వామిని చూచుటకు తగిన సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు వారు కోపించి, మీరు విష్ణులోకానికి దూరమవుతారని శపిస్తారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి తిరిగి వస్తారని వరమిస్తాడు. అప్పుడు వారు, మీకు దూరంగా 7 జన్మల పాటు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు చాలని కోరతారు.
ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత సంహరించబడి అనంతరం శాపవిముక్తి పొందుతారు
దశావతారాలలో నాలుగవ అవతారమే నారసింహావతారము.
కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వి యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభ్రాంతులను చేస్తుంటాడు. పాతాళంలో ఉన్న భూదేవిని శ్రీవరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీమహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు.
సోదరుని మరణానికి విచారిస్తూ హిరణ్యకశిపుడు రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు ఆచరిస్తాడు. అతని తపస్సుకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడుగా తయారవుతుంది. బ్రహ్మ ప్రత్యక్షమై అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్రసదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మంటాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవులచు గానీ, మనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణం ఉండకూడదని కోరతాడు. బ్రహ్మ వరాన్ని అనుగ్రహిస్తాడు.
హిరణ్యకశిపుడు వరగర్వంతో విజృంభిస్తాడు. దేవతలను జయించి ఇంద్రసింహాసనాన్ని ఆక్రమిస్తాడు. పంచభూతాలను నిర్బంధిస్తాడు. మునుత తపసులను భంగ కావిస్తుంటాడు. సాధువులను హింసింపచేస్తాడు. హిరణ్యకశిపుని బాధలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు.
హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చేసే సమయంలో, దేవతలు అతనిరాజ్యంపై దండెత్తుతారు, గర్భవతియైన హిరణ్యకశిపుని భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెకు తన ఆశ్రమంలో ఆశ్రయం ఇస్తాడు. ఆశ్రమంలో నారదుడు ఉపదేశించిన భగవత్ చింతనను గర్భస్థ బాలుడైన ప్రహ్లాదుడు గ్రహిస్తాడు. బ్రహ్మచే వరాలు పొంది, తిరిగి రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగిస్తాడు
ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నారాయణ భక్తడు. సర్వభూతములందు సమభావము గలవాడు. ప్రహ్లాదునకు విద్య నేర్పమని, హిరణ్యకశిపుడు తమ కులగురువులైన చండామార్కులకు అప్పగిస్తాడు .
కొంతకాలం తరువాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పరీక్షంపగోరి - ఏమి నేర్చుకున్నావు? అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని భగవంతుని దివ్యకళామయము అని, విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. ఆందుకు ప్రహ్లాదుడు విష్ణు భక్తి నాకు సహజంగా సంభవించింది. అని బదులిస్తాడు. అపుడు గురువులు హిరణ్యకశిపునికి సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధిస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు . అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. హిరణ్యకశిపుడు. ముద్దుచేసి - "గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో, విద్యా సారమెరుంగకోరెద, భవదీయోత్కర్షమున్ జూపవే ననుగన్న తండ్రీ" -అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు మరి ఆ మర్మమమేమిటి? "తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రము. శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. నారాయణుని గూర్చి చెప్పేవాడే తగిన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి." - అని వివరించాడు.
హిరణ్య కశిపుడు కోపోద్రేకుడవుతాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశిస్తాడు. శూలాలతో పొడిచినా, ఏనుగులతో త్రొక్కించినా, మంటల్లో వేసినా, కొండలపైనుండి క్రిందకు త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతిస్తాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్తారు. ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు కూడా ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశిస్తూ వారిని కూడా భక్తిమార్గంలోకి నడిపిస్తుంటాడు. ఇంకా లాభం లేదని గురువులు హిరణ్యకశిపునితో మొరపెట్టుకున్నాడు. క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? నీ బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విష్ణువే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.
అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.
శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి శరీరం మానవశరీరంతో తల సింహతో ఊగ్రరూపంతో వెలువడతాడు.
అప్పుడు శ్రీ నృసింహదేవుడు హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తన ఒడిలో పెట్టుకొని ఇంటా, బయటగాక వాకిట్లో కూర్చొని వజ్రాలవంటి తన గోళ్లతో భీకరంగా చీల్చి వేస్తాడు. ఈవిధంగా శ్రీహరి నారసింహుని రూపంలో, పగలూ, రాత్రీ కాని సంధ్యాకాలంలో, ప్రాణం ఉన్నవీ, లేనివీ అని చెప్పటానికి వీలులేని గోళ్ళతో, ఇంటా బయటా కాక గుమ్మంలో, భూమిపైనా, ఆకాశంలో కాకుండా తన తొడపైన హిరణ్యకశిపుని ఉంచి సంహరించాడు. బ్రహ్మ వరము నేరవేరింది.