header

Parasuramavataram

పరశురామావతారము
parasuramavataram శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగం ఆరంభములో జరిగినది పరశురాముని భార్గవరాముడు, అని కూడా అంటారు మహర్షి జమదగ్ని, రేణుకాదేవిల చిన్న కుమారుడు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండపరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండి తిరిగి రావడం కొంచెం ఆలస్యమౌతుంది. విషయం గ్రహించిన జమదగ్ని ఆమెను చంపమని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి మాట పాటించి తల్లిని సంహరిస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు గొప్ప దత్తాత్రతేయిని భక్తుడు, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి తన పరివారంతో సహా జమదగ్ని ఆశ్రమానికి వస్తారు. జమదగ్ని, కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి ఆతిధ్యమిచ్చి, పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఈ సంఘటన చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపుతాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని అంగీకరించడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి జరిగిన విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఖండిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు దర్శించిరమ్మని పంపుతాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి వేస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.

సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగుతుంది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ వినకుండా చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టేయమని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోతాడు.