శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం వామనావతారం. త్రేతాయుగంలో ఈ సంఘటన జరిగింది.
దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో పోరాడి ఓడి పోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయతో బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. దీనితో గర్వితుడైన బలి ఇంద్రునితో
యుద్ధం చేయుటకు నిశ్చయించి, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధమునకు సంసిద్ధం గావించి దేవతల రాజధానియైన అమరావతిపై దండెత్తుతాడు. అతనిని ఎదిరించలేక దేవగురువు బృహస్పతి సలహాతో దేవతలుఅమరావతి వీడి పారిపోయారు.
దేవతల దుస్థితిని చూసి, సురమాత అదితి, తన భర్తయైన కశ్యపబ్రహ్మను వేడుకున్నది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవదంశతో వామనుడు జన్మిస్తాడు.
వామనుడు పుట్టినప్పుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, బిశంగ వర్ణ వస్త్రాలతో, మకరకుండల మండిత గండ భాగుడై సమస్త అలంకారాలతో అవతరిస్తాడు. రూపాంతరంబున తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, వటుని వలె, ఉపనయ వయస్కుండై వామన బాలకుడవుతాడు.
బలి మహాయాగాన్ని తలపెడతాడు. ఆ యాగానికి వామనుడు వస్తాడు.
బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి బాలకుడా ! ఎవ్వరి వాడవు? నీకేమి కావలయును కోరుకొమ్మన్నాడు. ఒంటరి వాడిని నేను. కాని అడగమన్నావు కనుక మూడు అడుగుల నేల చాలు దానిని నివ్వమని కోరతాడు. వామనుని విష్ణువుగా గుర్తించిన శుక్రాచార్యుడు బలిని వారిస్తాడు.
అపడు బలి గురువుకు వినయముగా నమస్కరించి . ఇచ్చెదనని పలికాను కనుక ఇవ్వవలసిందేనని చెబుతాడు. శుక్రాచార్యడు ఆగ్రహించి శ్రీహరికి గనుక మూడడుగుల నేలను దానంగా ఇస్తే రాజ్యంతో సహా సర్వసంపదలు హరించుకుపోతాయని చెబుతాడు. కానీ గురువుమాటను లెక్కించక బలి వామనునికి మూడుఅడుగులనేలను దానం ఇస్తాడు.
మాటను తోసి పుచ్చిన రాజును పదభ్రష్ఠునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు.
వామనుడు ఒక పాదంబుతో భూమిని కప్పి, దేవ లోకమును రెండవ పాదమున ఆక్రమించి , జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, పాతాళమునకు పంపి, తానే పాతాళలోకమునకు కావలిగా ఉంటాడు. బలిచేత గ్రహించబడ్డ లోకములను తిరిగి దేవతలకు ఇచ్చి వారి ఆనందానికి కారకుడవుతాడు.