
కొంతకాలం తరువాత దశరధుడు పెద్దకొడుకైన రామునకు పట్టాభిషేకం చేయ సంకల్పిస్తాడు. పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. దేవాసుర యుద్ధంలో దశరధునికి సాయం చేసిన కైకేయికి దశరధుడు రెండు వరాలిస్తాడు. కానీ కైక ఆ వరాలను అవసరమైనప్పుడు కోరతానని చెబుతుంది.
కైకేయి దాసియైన మంధర ప్రేరేపణతో ఆ కోరికలను ఇప్పుడు అడుగుతుంది. అందులో ఒకటి రాముని బదులు భరతునికి పట్టాభిషేకము, రెండు రామునకు 14 ఏండ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరతాడు. రామునితోబాటు సీత, తమ్ముడు లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరతారు.
దారిలో గుహుడనే నిషాదరాజు వారిని తన నావలో గంగానది దాటిస్తాడు.
ఈ సంఘటనలు జరిగినప్పుడు భరతుడు అయోధ్యలో ఉండడు. తన అత్తగారింట ఉంటాడు. తిరిగి అయోధ్యకు వచ్చిన భరతుడు తన తల్లిని దూషించి, నగర ప్రజలు, వశిష్టుడు, సైన్యాన్ని వెంటబెట్టుకుని అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నేను పరిగ్రహించను. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి రాజ్యాన్ని ఏలుకో" అని ప్రార్ధించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాటను పాటించటం మన కర్తవ్యం. వనవాసం చేయవలసిందే" అని పలుకుతాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు విడుస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, నీసేవకునికి నీ తరపున నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని తనతో తెచ్చిన స్వర్ణపాదులకును రామునిచే ధరింపజేసి తిరిగి వాటిని తీసుకొని అయోధ్యకు తిరిగి వెళతాడు. కానీ రాముడు లేని అయోధ్యలో ఉండటం ఇచ్చగించక సమీపంలోని నందిగ్రామ అనే ఊరిలో చిన్నకుటీరం నిర్మించుకొని శ్రీరామపాదుకులకు పట్టాభిషేకం జరిపించే అక్కడనుండే రాజ్యపాలన సాగిస్తాడు.
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని వనవాసం జీవితం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్నిదర్శిస్తారు. సీతమ్మవారు అత్రి భార్యయైన అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు పొందుతుంది.
తరువాత పేజిలో.... అరణ్యకాండము.....
.