
కాని నూరు యోజనాలున్న సముద్రాన్ని దాటటం ఎలాగే వానరులకు తెలియలేదు. చివరకు జాంబవంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటగల సమర్థుడు హనుమంతుడు ఒక్కడనని గ్రహించి అతనిని ప్రేరేపిస్తాడు.
హనుమంతుడు దేవతలకు మ్రొక్కి, తన శరీరాన్ని అమాంతంగా ఆకాశమంత పెంచి మహేంద్రగిరిపై నుండి లంఘించుతాడు, రామబాణములా ప్రయాణిస్తూ దారిలో దేవతలచేత పంపబడిని సురస యొక్క పరీక్షలో గెలచి, తన నీడను పట్టి ఆపిన రాకాసి సింహికను వధించి సాయం సమయానికి లంకలోని త్రికూట పర్వతంపై దిగుతాడు. చీకటి పడిన తరువాత లంకలోనికి ప్రవేశించబోతే లంకకు కాపలాగా ఉన్న లంఘిణి అడ్డుపడుతుంది లంఘిణిలంకిణిని దండించి, లంకలో ప్రవేశించి, రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి సీతను వెదకడానికి బయలుదేరాడు.
అనేక ప్రయత్నాల అనంతరం అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, భీతయై కృశించిన సీతను చూచాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని గుర్తుగా ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.
హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇస్తుంది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.
ఇక హనుమంతుడు ఉగ్రాకారుడై అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లు నటించి రావణుని వద్దకు రాక్షసులచే తీసుకొనిపోబడతాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ రావణునికి హితవు చెబుతాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలుతున్న తన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతమ్మను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.
"చూచాను సీతను" అని ఒకే ఒక మాటతో వారి దుఃఖాన్ని పోగొడతాడు. తరువాత జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరిస్తారు.
యుద్ధకాండము....తరువాత పేజిలో............
.