బ్రహ్మ దేవతలందరినీ రామకార్యం కోసం పుట్టిన ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించకుండా వరం ఇస్తాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడూ , ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిస్తారు. బ్రహ్మ చిరంజీవత్వాన్ని ఇచ్చి, బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని వరం ఇస్తాడు. శత్రువులకు భయాన్ని , మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామ రూపం ధరించగల వరం ప్రసాదించి దేవతలతో సహా తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.
హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేస్తాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ప్రయాణిస్తూ సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు. నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు.
అప్పుడు కిష్కంధను రాజధానిగా చేసుకొని ఋక్షరజనుడు అనే వానర శ్రేష్టుడు పరిపాలించేవాడు. అతనికిద్దరు కొడుకులు. వాలి సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంజనేయుడు ఆంతరంగిక మిత్రుడవుతాడు.
వానరరాజైన వాలి మహాబలవంతుడు. రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తలవంచుతాడు. ఒక సారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి కిష్కింధకు వస్తాడు. వాలి, మాయావిలకు ఘోర యుద్ధం జరుగుతుంది. మాయావి వాలి ధాటికి తట్టుకోలేక ఒక గుహలోకి వెళతాడు. వాలి కూడా అతన్ని వెంబడిస్తూ సుగ్రీవుని గుహబయట కాపలాగా ఉంచి గుహలో ప్రవేశిస్తాడు ఏడాది పాటు యుద్ధం జరుగుతుంది. గుహనుండి ఆర్తనాదాలు వినిపిస్తాయి,రక్తం పారుతూ గుహనుండి వస్తుంది.వాలి రాక్షసుని చేతిలో చనిపోయాడని సుగ్రీవుడు పొరపాటుపడతాడు. వాలినే జయించిన మాయావి తిరిగి బయటకు వస్తే ప్రమాదమని భావించి గుహ ద్వారాన్ని పెద్దరాతితో మూసివేయిస్తాడు. సుగ్రీవుడు విచారిస్తూ కిష్కింధకు పోయి జరిగిన సంగతి అక్కడున్న వారికి చెప్పి వాలికి అంత్యక్రియలు చేస్తాడు. రాజులేని రాజ్యం శత్రువుల ఆక్రమణకు గురవుతుందని వానర పెద్దలు ఆలోచించి సుగ్రీవుడిని రాజుగా చేస్తారు
కానీ వాలి మాయావిని సంహరించి గుహ ముందు ఉన్నరాయిని తొలగించి కిష్కింధకు వస్తాడు. జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక రాజ్యం ఆక్రమించుకోవడానికి సుగ్రీవుడు పన్నిన పన్నాగమని సుగ్రీవుని రాజ్యం నుండి తరిమివేస్తాడు. సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన ఉనికి వాలికి తెలిసినప్పుడల్లా వేరే చోటుకు పారిపోయి తల దాచుకొనేవాడు సుగ్రీవునికి హనుమంతుడు, జాంబవంతుడు ఇంకా ఇద్దరు మంత్రులు బాసటగా నిలుస్తారు.
తరువాత పేజిలో...............
.