header

Sri Anjaneya, Hanuman

అక్కడ వారికి ఒక పర్వతంలో ఉన్న బిలం , ఆ బిలంలోనుండి వస్తున్న పక్షులు కనిపించాయి. పక్షులొస్తున్నాయి గనక నీరు చెట్లు సమృధ్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్లారు. యోజనం పైగా నడిచినా వారికి అక్కడ ఏమీ కనపడక ప్రాణాలు పోయే స్థితికి వచ్చారు. అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూల వనం, బంగారు కట్టడాలు కలిగిన మణిమయ మండపాలు, స్వర్ణ వర్ణంతో ఉన్న తాబేళ్ళు చేపలు, నిర్మలమైన నీరు, పళ్ళు ఉన్న స్థలం కనిపించింది. అక్కడ తేజస్సుతో ఉన్న ఒక తపస్వినిని చూస్తారు. హనుమంతుడు ఆమెకు నమస్కరించి రామ కార్యంమీద వచ్చామని చెబుతాడు. ఆమె వారికి అతిధ్యం ఇచ్చి.తన పేరు స్వయం ప్రభ అని ఇది తన స్నేహితురాలైన హేమకు చెందిన ప్రాంతమని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని తెలుపుతుంది. వారిని తన మహిమచేత తిరిగి సముద్రం ఒడ్డుకు చేరుస్తుంది.
వారు బయటకు వచ్చి, సీతను చెప్పిన గడువులో కనిపెట్టలేక పోయినందుకు చండశాసనుడైన సుగ్రీవుడు మరణ దండన విధించి తీరుతాడు కనుక మరణించడమే మేలనుకుంటారు. సంపాతి అనే పక్షి వానరులను గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృధ్ధిగా దొరికిందని వారితో అని వారిని తినటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అంగదుడు హనుమతో" చూసావా హనుమా! జటాయువులా మనకు దురదృష్టకరమయిన మరణం రాసిపెట్టి ఉన్నది." అన్నాడు. సంపాతికి జటాయువు సోదరుడు. సంపాతి వారితో" ఓయీ! జటాయువు మీకు తెలుసా? అని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు రాముని కార్యం మీద తాము వచ్చామని, జటాయువు రావణుని చేతిలో మరణించాడని, రాముడు అంత్యక్రియలు జరిపాడని తెలుపుతాడు. అది విని సంపాతి దుఃఖిస్తూ" నాయనా! జటాయువు నా సోదరుడు అని తెలుపుతాడు. సీత రావణుని చేత అపహరించబడి సముద్రానికి ఆవల లంకానగరంలో ఉన్నదని తెలుపుతాడు.
సుందరాకాండ

హనుమంతుని అకుంఠిత కార్య దీక్ష, సాహసం, నేర్పరితనం సుందరకాండలో తెలుస్తాయి. వానరులంతా సముద్రాన్ని దాటే ఉపాయం తోచక విచారంతో ఉంటారు. హనుమంతుని గురించి తెలిసిన జాంబవంతుడు హనుమంతుని శక్తిని గురించి అతనికి తెలుపుతాడు. హనుమంతుడు తన శరీరాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచి దేవతలకు నమస్కరించి మహేంద్రగిరిపై నుండి ఆకాశంలోనికి లంఘిస్తాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరిస్తాడు, హనుమంతుని శక్తిని తెలుసుకోడానికి దేవతలు సురస అనే దేవతను పంపుతారు. ఆమె హనుమంతునికి అడ్డుపడి" నాకెదురైనవారు నా ఆహారమని దేవతలు చెప్పారు. నా నోటిలోనికి రా" అని నోరు పెద్దగా తెరుస్తుంది. హనుమంతుడు తన శరీరం పెంచుతాడు. సురస కూడా తన నోటిని పెంచుతూ పోయింది. ఒక్క సారి హనుమంతుడు బొటన వేలంతగా మారి ఆమె నోటిలోనికి ప్రవేశించి ఆమె నోరుమూసుకొనేలోగా బయటకు వచ్చేస్తాడు. హనుమంతుని యుక్తికి మెచ్చి సురస హనుమంతుని దీవిస్తుంది.
తరువాత పేజిలో...............