header

Ankylosing Spondylitis Pain/ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్

Ankylosing Spondylitis Pain/ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్

Doctor Saratchandra Mouli/Rumatology Dept/Kims Hospital/Secunderabad డాక్టర్ శరత్ చంద్రమౌళి/రుమటాలజి/కిమ్స్/సికింద్రాబాద్ సౌజన్యంతో....
ఎంతిసైటిస్:
ఎముకతో స్నాయువులు కలిసేచోట వాపు తలెత్తటం (ఎంతిసైటిస్) మరో ముఖ్య లక్షణం. దీంతో చాలామందిలో మడమల వద్ద ఎకిలిస్ టెండన్లో నొప్పి పుడుతుంది. మోకాలు, మోచేతి స్నాయువుల్లోనూ వాపు తలెత్తొచ్చు. ఒకోసారి పక్కటెముకలకు అంటుకునే స్నాయువులు, కండర బంధనాలతోనూ ఒకరకమైన ఛాతీనొప్పి రావొచ్చు. దీంతో శ్వాస తీసుకోవటమూ కష్టమవుతుంది. చాలామంది దీన్ని గుండెనొప్పిగానూ పొరపడుతుంటారు.
కంటి వాపు: యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బాధితుల్లో కనుగుడ్డు మధ్యపొరలో వాపు (యువిఐటిస్) కూడా తలెత్తొచ్చు. దీంతో కళ్లు ఎర్రబడటం, నీరు కారటం, నొప్పి, చూపు మసకబారటం వంటివి మొదలవుతాయి. నిర్లక్ష్యం చేస్తే శుక్లాలకూ దారితీయొచ్చు. అరుదుగా చూపు కూడా పోవచ్చు.
ఇతర లక్షణాలు: బరువు తగ్గటం, నిస్సత్తువ, కొద్దిపాటి జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టటం వంటివీ ఉండొచ్చు. ముఖ్యంగా తొలిదశలో ఇలాంటివి కనబడుతుంటాయి. ఇది మామూలు నడుం నొప్పి కాదు!
మామూలుగా మనం చూసే చాలా నడుంనొప్పులు డిస్కులకు సంబంధించినవే. కావటానికి నడుంనొప్పే అయినా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వాటికి చాలా భిన్నం. ఉదయం నిద్ర లేచాక వెన్నెముక ఎంతసేపు బిగసుకుంటోదనే దాన్ని బట్టి వీటి మధ్య తేడాను తేలికగానే గుర్తించొచ్చు. లేచాక అరగంట కన్నా తక్కువసేపుంటే డిస్కు సమస్యగానూ.. ముప్పావుగంట కన్నా ఎక్కువసేపు బిగుసుకుపోతుంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్గానూ అనుమానించొచ్చు
పిరుదుల్లో ఆరంభం!
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ప్రధానంగా నడుం, మెడలపై ప్రభావం చూపినప్పటికీ.. ఇది పిరుదుల వద్దే ఆరంభమవుతుంది. కటి ఎముకలోని సాక్రమ్, ఇలియమ్ మధ్యలోని సాక్రోఇలియాక్ కీళ్లలో వాపు తలెత్తటం దీనికి మూలం. అనంతరం నడుము భాగంలోని వెన్నెముక.. అక్కడ్నుంచి ఛాతీ దగ్గర.. తర్వాత మెడ దగ్గరి పూసలు.. ఇలా ఒకదాని తర్వాత మరోటి ప్రభావితమవుతాయి. అయితే కొందరికి సాక్రో ఇలియాక్ కీలులో మొదలై నేరుగా మెడ దగ్గరి పూసల్లోనే సమస్యకు దారితీయొచ్చు. కొందరికి మోకాళ్లు, మోచేతులు, పాదాల్లోని పెద్ద కీళ్లు సైతం ప్రభావితమవుతుంటాయి. పురుషుల్లోనే ఎక్కువ
నిజానికి కీళ్లవాతం సమస్యలు ఆడవారిలోనే ఎక్కువ. కానీ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ మహిళల్లో కన్నా పురుషుల్లో 9 రెట్లు అధికం. ఇది సాధారణంగా 20-45 ఏళ్ల మధ్యలో మొదలవుతుంది. 45 ఏళ్ల తర్వాత రావటం చాలా అరుదు. ఇది లోలోపలే నెమ్మదిగా ముదురుతూ వస్తుంటుంది. అందుకే చాలామంది జబ్బు మొదలైన 10-20 ఏళ్ల తర్వాత గానీ గుర్తించరు. కొందరు వయసుతో పాటు ఇలాంటి మార్పులు వస్తున్నాయని పొరబడి, నిర్లక్ష్యం చేస్తుంటారు కూడా. జబ్బు తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండకపోవటమూ దీనికి కారణమే. ఇది ఒకొకరిలో ఒకోలా ఉంటుంది. కొందరిలో తీవ్ర దశకు చేరితే.. మరికొందరికి తొలిదశ లక్షణాలతోనే ఆగిపోవచ్చు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కనబడకపోనూవచ్చు.
జీవనశైలి మార్పులతో మేలు
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బాధితులు క్యాల్షియం, విటమిన్ డితో కూడిన పదార్థాలు మరింత ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఖర్జూరం, అంజీరా వంటి ఎండుఫలాలు.. బాదం, అక్రోట్ల వంటి గింజపప్పులు ఎంతో మేలు చేస్తాయి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. బరువును అదుపులో ఉంచుకోవటం, పొగ అలవాటుకు దూరంగా ఉండటం ఉత్తమం. మెడను విరవటం, గట్టిగా మర్దనలు చేయటం తగదు. ముందు నుంచే దిండు సైజు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మరీ గట్టిగా, మరీ మెత్తగా లేని పరుపులు వాడుకోవాలి. వీరికి ప్రమాదాల్లో కుదుపులకు ఎముకలు విరిగే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకొస్తుంది?
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎందుకొస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ హెచ్ఎల్ఏ బి27 జన్యువుతో దీనికి బలమైన సంబంధం ఉంటుండటం మాత్రం నిజం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బారినపడ్డ 90% మందిలో ఈ జన్యువు కనబడుతుండటమే దీనికి నిదర్శనం. అయితే హెచ్ఎల్ఏ బి27 జన్యువు ఉన్నా కూడా జబ్బు రావాలనేమీ లేదు. ఈ జన్యువు ఉన్నవారిలో కేవలం 2% మందికే వచ్చే అవకాశముంది. కాబట్టి జన్యువు ఉండటంతో పాటు నడుంనొప్పి, కీళ్లనొప్పులు, ఉదయం పూట శరీరం బిగుసుకుపోవటం వంటి లక్షణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సమస్యను నిర్ధరించాల్సి ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుందనీ చెప్పలేం. ఎందుకంటే హెచ్ఎల్ఏ బి27 తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం 50 శాతమే. ఒకవేళ పిల్లల్లో జన్యువు ఉన్నా కూడా జబ్బు వచ్చే అవకాశం 15 శాతమే కావటం గమనార్హం. పేగుల్లో ఇన్ఫెక్షన్, మూత్ర ఇన్ఫెక్షన్ల వంటి ఇతరత్రా అంశాలు కూడా దీన్ని ప్రేరేపించొచ్చు.
మిగతా పేజీలో తరువాత పేజీలో.....