header

Bone Fracture

Dr.k.krishnaiah ఎముక విరిగింది.. అతుక్కోవాలంటే ఏం చెయ్యాలి?

ఎలా విరుగుతాయి?
ఎముకలు విరగటానికి సర్వసాధారణ కారణాలు:
రోడ్డు, వాహన ప్రమాదాలు
ఆటల్లో దెబ్బలు తగలటం
మెట్ల మీంచి పడటం
స్నానాల గదుల్లో జారిపోవటం
లోలోపలి కారణాలు
అరుదే అయినా కొద్దిమందికి దెబ్బల్లాంటివేమీ తగలకుండానే చిటుక్కున ఎముకల విరుగుతుంటాయి. దీనికి ఇతరత్రా శారీరక సమస్యలు కారణమవుతుంటాయి, వీటిని ‘పెథలాజికల్‌ ఫ్రాక్చర్స్‌’ అంటారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎముక గుల్లబారటం (ఆస్టియోపొరోసిస్‌). ఈ సమస్య వృద్ధుల్లో ఎక్కువ. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకలు గుల్లబారుతూ.. వాటి పటుత్వం తగ్గుతుంది. దీంతో చిన్నపాటి కుదుపునకు కూడా ఎముక విరగొచ్చు. కారు వేగంగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా బ్రేకు వేసినా, ఏదైనా వస్తువు అందుకోటానికి అటూఇటూ తిరిగినా కూడా ఎముకలు విరగొచ్చు.
కొందరిలో ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్‌ తలెత్తితే అది ఎముకకు విస్తరించి స్థిరపడుతుంటుంది. దీంతో అక్కడ ఎముక గుల్లబారి, పటుత్వం తగ్గి విరుగుతుంటుంది.
పసరుకట్లు వద్దు!
చాలామంది నేటికీ ఎముకలు విరిగినప్పుడు పసరు కట్లను ఆశ్రయిస్తున్నారు. వాస్తవానికి ఆ పసరులో ఎముక అతుక్కునేలా చేసే గుణమేదీ ఉండదు. గట్టిగా లాగి కట్టటం వల్ల విరిగిన ఎముకలు కదలకుండా ఉండి, అవి సహజంగానే అతుక్కుంటాయి. కానీ కొన్నిసార్లు కట్టు మరీ గట్టిగా కట్టటం వల్ల రక్తసరఫరా ఆగిపోయి ఆ భాగం కుళ్లిపోయిన (గ్యాంగ్రీన్‌) ఘటనలూ ఉంటున్నాయి. అలాగే ఎముక విరిగి, అటూఇటూ జరిగినప్పుడు దాన్ని సరైన స్థానంలో ఉంచటం అన్నది ఈ పసరు కట్లతో సాధ్యం కాదు. ఏదో ఉజ్జాయింపుగా ఎముకలను లాగి కట్టేస్తుంటారు. దీనివల్ల ఎముకలు వంకరగా అతుక్కుపోతూ, జీవితాంతం ఆ ఎముక, కీళ్ల కదలికలు అస్తవ్యస్తంగానే ఉండిపోతాయి. పసరు కట్లు శాస్త్రీయమైనవి కావు. ఏదో తాతముత్తాతలు చేస్తున్నది చూసి నేర్చుకోవటం తప్పించి సరైన శిక్షణ తీసుకున్న వారు కాకపోవటం వల్ల- సంక్లిష్టమైన ఫ్రాక్చర్లను సరిచేసే అవకాశం ఉండదు. సాధారణ ఫ్రాక్చర్ల విషయంలో కూడా అవి సరిగ్గా అతుక్కుంటాయన్న నమ్మకం ఉండదు. కాబట్టి ఈ ఆధునిక కాలంలో పసరు కట్లను ఆశ్రయించటం మంచి పద్ధతి కానేకాదు. పొగ దెబ్బే!
పొగ తాగే వాళ్లలో విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవు! ఇది శాస్త్రీయంగా నిరూపణ అయిన వాస్తవం. పొగలో ఉండే నికొటిన్‌ శరీరంలో చేరి కణవిభజననూ, ఎముక అతుక్కునే ప్రక్రియను దెబ్బతీస్తుండటం వల్ల వీరిలో ఎముకలు అతుక్కోవటం చాలా ఆలస్యమవుతుంటుంది, కొన్నిసార్లు ఎంతకీ అతుక్కోవు కూడా. సాయం చెయ్యాలిగానీ..!
చాలామంది ప్రమాదం జరిగినప్పుడు- బాధితులను రక్షించాలన్న తాపత్రయంలో వారిని కారుల్లో, ఆటోల్లో, స్కూటర్ల మీద తీసుకుపోతుంటారు. దీనివల్ల అప్పటికే విరిగిన ఎముకల వంటివి మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎముకలు విరిగాయన్న అనుమానం తలెత్తినప్పుడు ముందు బాధితుల కాళ్లు చేతుల వంటి అవయవాలు కదలిపోకుండా స్థిరంగా ఉంచే బద్దలు (యూనివర్సల్‌ స్లి్పంట్‌) వంటవి అమర్చి జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించాలి. విరిగిన ఎముకలు కదులుతుంటే నొప్పి తీవ్రమై, ఒంట్లో క్యాటకోలమైన్స్‌ ఎక్కువగా విడుదలై, బీపీ పడిపోయి, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఎలా అతుక్కుంటాయి?
చర్మం గీసుకుపోతే కొద్దిరోజుల్లో దానంతటదే మానిపోతుంది. మనం చెయ్యాల్సిందల్లా గీరుకున్న చర్మం అంచులు దగ్గరగా ఉండేలా చూడటం. అచ్చం ఎముక విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎముక మీద ‘పెరియాస్టియమ్‌’ అనే దట్టమైన పొర ఉంటుంది. బలమైన దెబ్బ తగిలి, గాయమైతే ఈ పొర చినిగి, రక్తనాళాలు తెగి రక్తస్రావమవుతుంది. ఈ రక్తంలోని ప్లేట్‌లెట్‌ కణాలు విడివడి, అక్కడున్న మూలకణాలను ప్రేరేపించే రసాయనాలు (గ్రోత్‌ ఫ్యాక్టర్స్‌) విడుదల అవుతాయి. దీంతో మూలకణాలు వృద్ధి చెందుతూ, ఎముకల మధ్య ఏర్పడిన ఖాళీలో చేరతాయి. ముందుగా అక్కడ మృదు కణజాలం (కార్టిలేజ్‌ కణాలు), తర్వాత ఎముక కణాలు ఏర్పడతాయి. ఈ కణాల్లో, వాటి మధ్యలో క్యాల్షియం చేరి, గట్టిపడుతుంది. దీంతో ఎముక మళ్లీ దృఢంగా అతుక్కుపోతుంది. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియే!
ఇదీ చికిత్స! ఇవీ సూత్రాలు!!
ఎముక దానంతట అదే అతుక్కుంటుందిగానీ అది- వేగంగా, సరిగ్గా అతుక్కునేలా చూడటం, దానివల్ల ఇతరత్రా దుష్ప్రభావాలు రాకుండా చూడటం చాలా కీలకం. కాబట్టి ఈ సందర్భంగా కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
...............తరువాత పేజీలో ............