1. కదలకుండా ఉంచటం: విరిగిన ఎముకలు కదులుతూనే ఉంటే ఎముక అతుక్కునే ప్రక్రియ దెబ్బతినిపోతుంది. కాబట్టి విరిగిన భాగం కదలకుండా చూసేందుకు- సిమెంటు కట్లు, బద్దలతో కట్టటం, బరువు వేలాడ దీయటం వంటివన్నీ చేస్తుంటారు. అయితే సిమెంటు పట్టీ ఎక్కువకాలం అలాగే ఉంచితే కండరాలు క్షీణించే ప్రమాదముంది. అటుపక్క ఇటుపక్క కీళ్లు బిగుసుకుపోవచ్చు. భోజనం, స్నానం చేయటం వంటి పనులకు ఇబ్బంది తలెత్తొచ్చు. లోపల దురద, చర్మం కందిపోవటం వంటి సమస్యలూ ఉంటాయి. ఇంతా చేసి, లోపల ఎముక సరైన స్థితిలోనే అతుక్కుంటోందో లేదో తెలియకపోవచ్చు. అందుకే ఇటీవలి కాలంలో ఆపరేషన్ చేసి- లోపలి ఎముకలను ప్లేట్లు, రాడ్లు, స్క్రూలతో దగ్గరకు తెచ్చి, స్థిరంగా ఉండేలా చూడటం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇవి విరిగిన ఎముకను కదలకుండా ఉంచుతూ.. త్వరగా అతుక్కోటానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. ఆపరేషన్ చేసిన వారం పది రోజుల్లోనే తేలికపాటి కదలికలు ఆరంభించొచ్చు. దీంతో కీళ్లు బిగుసుకుపోయే సమస్య ఉండదు. కండరాలు క్షీణించవు. పైన సిమెంటు పట్టీ వంటివేవీ ఉండవు కాబట్టి పనులకు వెళ్లొచ్చు. కాకపోతే వైద్యులు చెప్పే వరకూ కొంతకాలం బరువు పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
2. సరైన స్థితిలో ఉంచటం: విరిగిన ఎముకలను సరైన స్థితిలో, సరైన కోణంలో, కచ్చితంగా దగ్గరకు చేర్చి.. అలాగే కదలకుండా చూడటం ముఖ్యం. లేకపోతే ఎముకలు వంకరగా అతుక్కుని, కీళ్లు అస్తవ్యస్తంగా అరిగిపోవటం వంటి సమస్యలు జీవితాంతం వేధిస్తుంటాయి. విరిగిన ముక్కలు సరైన స్థితిలో, అలాగే కదలకుండా ఉండేందుకు ప్లేట్లు, స్క్రూల వంటివి దోహదం చేస్తాయి.
3. సమస్యలు రాకుండా చూడటం: దెబ్బతిన్న భాగానికి రక్తసరఫరా సరిగా జరిగేలా, ఇన్‌ఫెక్షన్లు తలెత్తకుండా చూడటం ముఖ్యం. వేగంగా నడుస్తున్న వాహన ప్రమాదాల వల్ల సంభవించే ఫ్రాక్చర్లలో- ఎముకకు అంటుకొని ఉండే కండరం కూడా పక్కకు తొలగిపోతుంది. దీంతో రక్త సరఫరా తగ్గి ఎముకలు అతుక్కోవటం ఆలస్యమవుతుంది. అందువల్ల రక్తసరఫరా సాఫీగా జరిగేలా చూడాల్సి ఉంటుంది. గాయాల వల్ల సూక్ష్మక్రిములు లోపల చేరి, ఇన్‌ఫెక్షన్లు మొదలై ఎముక అతుక్కోవటం ఆలస్యమవుతుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్ తలెత్తకుండా, శుభ్రంగా ఉండేలా చూడటమూ కీలకమే. ఒక్కోసారి ఆపరేషన్ గదిలో పరిశుభ్రత లోపించటం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. దీంతో ఎముక అతకటం అటుంచి ఈ ఇన్ఫెక్షన్‌ను తగ్గించటం పెద్ద సమస్యగా తయారవుతుంది. అందుకోసం వేసిన రాడ్‌ను, ప్లేట్లను కూడా తీసి, కొద్దిరోజుల తర్వాత మళ్లీ వెయ్యాల్సి ఉంటుంది. కాబట్టి శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
...............తరువాత పేజీలో ............