ఒకటే దురద. గోకితే దద్దు. తుమ్ము మీద తుమ్ము. ఉక్కిరి బిక్కిరి చేసే ఆయాసం. ఇలా అలర్జీలు తెచ్చిపెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు
ప్రస్తుతం మనిషిని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల్లో అలర్జీలదే ప్రథమస్థానం! ఆధునికతతో పాటు ఇవీ పెరుగుతూ వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సుమారు 50% మంది ఏదో ఒక అలర్జీతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలోనూ 20-30% మంది జీవితంలో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక అలర్జీ బారినపడ్డవారే. ఒకరకంగా దీన్ని మన జీవనశైలితో ముడిపడిన సమస్యగానే చెప్పుకోవచ్చు. నగరాల్లో, పట్టణాల్లో అలర్జీలు ఎక్కువగా కనబడుతుండటమే దీనికి నిదర్శనం.
మన వాతావరణం మారిపోయింది, తిండి మారిపోయింది. ఎయిర్ కండిషన్ గదులు, తివాచీలు, సోఫాలు.. ఇలా మన జీవన విధానమే మారిపోయింది. వాతావరణ కాలుష్యమూ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. ఇలాంటివన్నీ అలర్జీలు విజృంభించటానికి అవకాశం కలిగిస్తున్నాయి. చాలామంది అలర్జీని పెద్దవాళ్ల సమస్యగానే భావిస్తుంటారు. కానీ ఇది పిల్లల్లోనూ ఎక్కువే.
ఏమిటీ అలర్జీ?
స్థూలంగా చెప్పాలంటే- రోగనిరోధకవ్యవస్థ మనకు హానిచేయని వాటికీ అతిగా స్పందించటమే అలర్జీ. సాధారణంగా పొగ, దుమ్ముధూళి వంటివి మనకేమీ హానిచేయవు. ఇవి ఒంట్లోకి ప్రవేశించినా రోగనిరోధకశక్తి వీటిని పెద్దగా పట్టించుకోదు (ఇమ్యూన్ టాలరెన్స్). అయితే జన్యుపరంగా అతిగా స్పందించే గుణం గలవారిలో రోగనిరోధక వ్యవస్థ వీటితో అనవసర ‘యుద్ధం’ పెట్టుకుంటుంది! శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిముల వంటివిగా భావించి ‘నువ్వు రావొద్దు కదా. ఎందుకొచ్చినవు’ అని కొట్లాటకు దిగుతుంది. ఇమ్యునోగ్లోబులిన్-ఇ అనే యాంటీబాడీలను, ఈస్నోఫిల్స్ వంటి రసాయనాలను పెద్దఎత్తున విడుదల చేసి దాడికి పురమాయిస్తుంది. దీంతో ఆయా భాగాల్లో వాపు ప్రక్రియ మొదలవుతుంది. రక్తనాళాలు విప్పారి, వాటిలోంచి ద్రవం లీకవుతుంది. సున్నితమైన కండరాలు సంకోచిస్తాయి. నాడులు చికాకుకు గురవుతాయి. ఫలితంగా దురద, దద్దు, ఆయాసం వంటి లక్షణాలు బయలుదేరతాయి. ఇదే అలర్జీ. మున్ముందు ఎప్పుడైనా అదే అలర్జీ కారకం వచ్చినా రోగనిరోధకవ్యవస్థ ఇలాగే స్పందిస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ అలర్జీ వేధిస్తూనే ఉంటుంది.
ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రకృతి నుంచి దూరంగా పోతున్నకొద్దీ అలర్జీలూ ఎక్కువవుతున్నాయి. హాయిగా, సుఖంగా జీవించటానికి సౌకర్యాలు పెంచుకుంటూ పోతున్నాం గానీ అదేస్థాయిలో అలర్జీలు కూడా పెరిగిపోతున్నాయి. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తున్నాయి.
ఆహార అలవాట్లు:
ఎలాంటి తిండి తింటే అలాంటి మనిషి తయారవుతాడు. ప్రస్తుతం పిల్లలకు తల్లిపాలు పట్టటం, ఇంట్లో వండి పెట్టటం తగ్గిపోయింది. డబ్బా తిండ్లు, ప్యాక్డ్ ఫుడ్స్, బయటి తిళ్లు ఎక్కువయ్యాయి. వీటిల్లో ఎక్కువకాలం నిల్వ ఉండటానికి, రంగు, రుచి కోసం రకరకాల పదార్థాలు కలుపుతారు. ఇవి కొందరిలో అలర్జీలకు కారణమవుతున్నాయి.
తరువాత పేజీలో.......