22
దద్దులలో చాలా రకాలు ఉంటాయని శాస్త్రీయ అవగాహన లేకపోవటం వన చాలా మంది తల్లిదండ్రులు ప్రతి దద్దును అమ్మవారిగా భావించి సరైన వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని వలన ఒక్కోసారి పరిస్ధితి ప్రాణాలమీదకు వస్తుంది. కాబట్టి చర్మం మీద దద్దులు, మచ్చలు, పొక్కులు ఇలా ఏది కనబడినా సత్వరమే వైద్యులకు చూపించి కారణం తెలుసుకొని సరైన వైద్యం చేయించాలి. పిల్లలలో వచ్చే రకరకాల దద్దులను గురించి...
పిల్లలకు ఆటాపాటా వయసులో వచ్చే అతి సాధారణ సమస్య ఆటలమ్మ (చికెన్ ఫాక్స్) వైరస్ కారణంగా తలెత్తే ఈ సమస్య లక్షణు ముందుగా చిన్నగా జ్వరం, గొంతునొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత ఒంటి మీద అక్కడక్కడా చిన్న చిన్న దద్దులు, నీటి పొక్కుల్లాంటివి కనిపిస్తాయి. కొత్త వచ్చిన దద్దులు నిగనిగలాడుతుంటే నిన్న మొన్న వచ్చినవి వాడిపోయి కనిపించడం దీని ప్రత్యేకత. నాలుగో రోజు చూస్తే మొదట వచ్చినవి చెక్కు కట్టి వుంటాయి. రెండో రోజు వచ్చినవి చీము పట్టి ఉంటే మూడో రోజు వచ్చినవి నీటిబుగ్గల్లా ఉంటాయి. ఇక అదే రోజు వచ్చినవి దద్దు మాదిరి కనిపిస్తుంటుంది.
ఆటలమ్మ వచ్చినా పిల్లలు ఏమంత నలతగా ఉండరు. బాగానే ఆడుకుంటూ ఉంటారు. ఈ పొక్కులన్నీ వారం పదిరోజుల్లో చెక్కు కట్టి ఊడిపోతాయి. ఇదేమంత ప్రమాదకరమైనది కాదు కాబట్టి అంతగా భయపడాల్సిన పనిలేదు. మందులు అవసరం కూడా అంతగా ఉండదు. కాకపోతే పొక్కు గిల్లకుండా, గోకకుండా చూడాలి. ఇతరులకు అంటుకోకుండా సమస్య తగ్గేవరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకోవాలి.
తట్టు (మీజిల్స్) కాస్త ప్రమాదకరమైనది. లక్షణాలు తెలుకుసుంటే తట్టును గుర్తుపట్టటం చాలా తేలిక.
లక్షణాలు : ముందుగా పిల్లలు బాగా నలతగా, నీరసంగా ఉంటారు. తిండి తినబుద్ది కాదు. కళ్ళు ముక్కు, నోరు ఎర్రగా అవుతాయి. దగ్గుతుంటారు. రెండు మూడు విరోచనాలు కావొచ్చు. పైగా తీవ్రమైన జ్వరం, నాలుగో రోజున సన్నగా దద్దు ప్రారంభమవుతుంది. ముందు ముఖం మీద తర్వాత చెవుల వెనుక, ఒకటి, రెండు పూటలో ఛాతీ మీద, ఆ తర్వాత రోజు కాళ్ళకు, ఇలా క్రమేపి తల నుంచి కాళ్ల వరకూ శరీరమంతా దద్దు వ్యాపిస్తుంది.
చికిత్స : ఈ లక్షణాలను బట్టి తట్టును గుర్తించి అత్యవసరంగా చికిత్స ఆరంభించాలి. వెంటనే డాక్టరుకు చూపించాలి. చాలా మంది ఇలాంటి సమయాల్లో పిల్లలను ఇంట్లో కూచోపెట్టి నానా పధ్యాలు చేయిస్తుంటారు. ఇది సరికాదు. ఎందుకంటే దీని మూలంగా ఇతరత్రా సమస్యలు పొంచి ఉంటాయి. తట్టు వచ్చినవారిలో ఎ విటమిన్ లోపం చాలా ఎక్కువ. దీంతో చూపుపోయే ప్రమాదముంది. మనదేశంలో చాలామంది తట్టు వచ్చినపుడే విటమిన్ ఎ లోపం మరింత పెరిగి చూపు కోల్పోతున్నారు.
తట్టు మూలంగా న్యూమోనియా, చెవిలో చీము, మెదడు వాపు వస్తుంది. కాబట్టి తప్పకుండా డాక్టర్‌కు చూపించాలి. ఈ పిల్లలందరికి విటమిన్ ఎ, బి కాంప్లెక్స్ తప్పకుండా ఇవ్వాలి. తగినన్ని నీళ్ళు తాగించాలి. ఏ రూపంలోనైనా ఆహారం ఇవ్వాలి. నోటితో తీసుకోలేక పోతే సెలైన్ పెట్టాల్సి ఉంటుంది. తట్టు చాలా ప్రమాదకరమైనది కాబట్టే జాతీయ టీకా కార్యక్రమంలో తట్టు టీకాను చేర్చారు. బిడ్డకు 9 నెలలు నిండగానే దీనిని ఇస్తారు. దీనితో చాలా వరకు ఈ సమస్య రాదు. కానీ మన దేశంలో కేవలం 60 శాతానికి పైబడి మాత్రమే పిల్లలు ఈ టీకాను తీసుకున్నారు. ఇంకా దాదాపు 40 శాతం మంది తీసుకోవాల్సి ఉంది. దేశంలో 80 శాతం మంది పిల్లలు ఈ టీకాను తీసుకునేలా చేయగలిగితే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం తగ్గుతుంది. అప్పుడు దీన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది. చాలా దేశాలలో తట్టును ఇప్పటికే పూర్తిగా నిర్మూలించారు గాని మనం ఇంకా ఆ దశకు చేరలేదు. పోషకార లోపం గలవారికి ఇది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
ఆటలమ్మ తెచ్చిపెట్టే వారిసెల్లా జోస్టర్ వైరస్ శరీరంలో ఒక భాగంలోనే దాడి చేయటం వల్ల వచ్చే సమస్య ఈ హెర్పిస్ జోస్టర్. దీనినే వాడుకలో కంచుక, చల్ది, సర్ఫి అని రకరకాలుగా పిలుస్తారు. ఇది ముఖానికి, ఛాతీకి నడుముకు ఇలా ఎక్కడో ఒకచోట ఒక లైనులా రావచ్చు. పిల్లలలో రోగ నిరోధకశక్తి తగ్గినపుడు ఇది బయటపడుతుంది. గతంలో దీని గురించి సరైన అవగాహన లేక దీనికి మంత్రాలు వేయటం, జాజు పెట్టటం చేసేవారు. ఇది సరైన పద్ధతి కాదు. చల్ది కనిపిస్తే వెంటనే డాక్టర్‌కి చూపించాలి. ఈ పొక్కు మందు ఎర్రగా, తర్వాత నీటి బుడగగా, ఆ తర్వాత పక్కు కట్టి మానిపోతాయి. ఇది వృద్ధులలో తరచుగా కనిపిస్తుంది. గానీ పిల్లలలోనూ రావచ్చు. ఇలాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ మూలంగా వచ్చే దద్దుకు ప్రత్యేకించి మందులేమీ ఉండవు. జ్వరం బాధలు తగ్గటానికి మాత్రం, దురద లేకుండా క్యామైన్ లోషన్ వంటి పూత మందు ఇస్తారు
ఈ దద్దు చాలావరకు కొన్ని రకాల మందులు సరిపడక, లేదా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, రియాక్షన్ల వలన వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. చేత్తో కాస్త గట్టిగా రాస్తే చాలు. తోలు ఊడిపోతుంది. నోట్లో చర్మం ఊడివస్తుంటుంది. పెదాలు, పగులుతాయి.జననాంగాలు కూడా ప్రభావితమవుతాయి. రక్తంలోని ద్రవం నాళాల్లో నుండి బయటకు లీక్ అవుతూ రక్తపరిమాణం తగ్గి, తీవ్రంగా షాక్‌లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇది చాలావరకూ సల్ఫా డ్రగ్స్, మలేరియాకు వాడే సల్ఫోడాక్సిన్ పైరిమిథమీన్ లేకపోతే టెట్రాసైక్లిన్స్, కొందరికి చివరికి ఆస్పిరిన్‌తో కూడా రావచ్చు. కొందిరికి గార్డినాల్, ఫెనటాయిన్ వంటి ఫిట్స్‌కు వాడే మందులతో రావచ్చు. ఇవేకాదు, నిజానికి ఏ మందులతోనైనా రావచ్చు. కొందరికి టెట్రాసైక్లిన్స్ పెన్సిలిన్స్‌తో వస్తాయి. కాబట్టి దేనివల్ల ఇలా వచ్చిందన్నది తెలుసుకుంటే మున్ముందు మళ్ళీ ఇలాంటి విపత్తు రాకుండా చూసుకోవచ్చు. సమస్య తలెత్తినపుడు వెంటనే ఆ మందేదో గుర్తించి ఆపెయ్యటం, వాపు తగ్గించే మందు, సెకండరీ ఇన్ఫెక్షన్లు రాకుండా మందులు ఇవ్వటం, ఒంట్లో నీరు తగ్గకుండా చూడటం, కళ్ళు, పేగులు, మూత్రపిండాలు వంటివేవీ దెబ్బతినకుండా వైద్యం అందించటం అవసరం. చాలామంది ఈ ఉపశమన చికిత్సతో బయటపడతారు. కొందరి విషయంలో ఎంత చేసినా ప్రాణాలు దక్కటం కష్టం కావచ్చు.