Retina diseases / కంటి జబ్బులు --రెటీనా
కంటి జబ్బులు --రెటీనా Dr.k.viswanath, Chairman, Pushpagiri eye institute, Secunderabad
ముంచుకొచ్చే ముప్పులో తొలి దశ.. మలి దశ!
మధుమేహం కారణంగా వచ్చే రెటినోపతీ సమస్యను రెండు దశల్లో చూడొచ్చు.
--తొలిదశలో- రెటీనా పొర మీద ఉండే కేశ నాళికల గోడలు దెబ్బతిని, అవి ఉబ్బుతుంటాయి. ఆ ఉబ్బిన చోట నుంచి రక్తంలోని కొవ్వులు, ద్రవాలు రెటీనా పొర మీదికి లీక్ అవుతుంటాయి. దీన్ని నాన్ ప్రోలిఫరేటివ్’ దశ అంటారు. ఈ దశలో చూపు క్రమక్రమంగా తగ్గుతుంటుందిగానీ మొత్తం పోదు.
మలిదశలో- రక్తనాళాలు మొత్తం మూసుకుపోతాయి. దీంతో వాటి లోటును భర్తీ చేసేందుకు కొత్త రక్తనాళాలు పుట్టుకురావటం, వాటి నుంచి రెటీనా పొర మీద రక్తస్రావం కావటం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. ఇది తీవ్రమైన దశ. దీన్ని ప్రోలిఫరేటివ్’ దశ అంటారు. ఈ దశలో హఠాత్తుగా చూపు మొత్తం పోతుంది.
మార్పులు పలు రకాలు
మధుమేహం కారణంగా రెటీనా పొర దెబ్బతినిపోవటమన్నది పలు రకాలుగా జరగొచ్చు. ఇవేమిటో చూద్దాం.
--గోడల ఉబ్బటం: రెటీనా మీది కేశరక్తనాళాల గోడలు దెబ్బతిని, అక్కడక్కడ పల్చబడతాయి. దీంతో ఆ భాగంలో గోడలు బయటకు తోసుకొచ్చినట్టు.. ఉబ్బినట్టు కనబడుతుంటాయి. వీటినే మైక్రో అనూరిజమ్స్’ అంటారు. మధుమేహ రెటీనోపతీ సమస్యలో కనబడే తొలి లక్షణం ఇదే. ఈ స్థితిలోనే మేలుకోవటం ఉత్తమం.
--కొవ్వులు, ద్రవాలు లీకవ్వటం: రక్తనాళాలు పల్చబడి, ఉబ్బిన చోటు నుంచి రక్తంలోని కొవ్వులు, ద్రవాలు లీకయ్యి.. రెటీనా పొరలోకి చేరుకుంటాయి. ఇవి రెటీనా పొర మధ్యభాగం ‘మాక్యులా’ మీద పేరుకుంటాయి. (మ్యాక్యులోపతీ). దీంతో అక్కడ ఒత్తిడి పెరిగి, వాచి.. ఆ భాగం సరిగా పనిచేయదు. ఇలాంటివారికి చుట్టుపక్కల దృశ్యాలన్నీ బాగానే కనిపిస్తుంటాయి గానీ మధ్యలో మబ్బుగా ఉంటుంది. చిన్నచిన్న వస్తువులూ కనబడవు. అద్దాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. వీరికి తక్షణం రెటీనా మీది వాపును తగ్గించటమే మార్గం. వాపును తగ్గించినా కూడా చూపు కొంత మెరుగవుతుందేగానీ మునుపటి స్థాయిలో ఉండదు. అందువల్ల అసలీ స్థితికి రాకుండా చూసుకోవటం ఉత్తమం.
--నాళాలు మూసుకుపోవటం: రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల కేశ నాళికలు మూసుకుపోవచ్చు. దీంతో రెటీనా పొర మీద కొన్నికొన్ని భాగాలకు రక్తసరఫరా ఆగిపోయి, దెబ్బతింటుంది. ఇలా రెటీనా మధ్యభాగానికి (మాక్యులాకు) రక్తసరఫరా నిలిచిపోతే- చూపు పోతుంది. చదవటం, రాయటం వంటివన్నీ కష్టమైపోతాయి. రెటీనా మీద మధ్యభాగం బాగానే ఉండి చుట్టుపక్కల దెబ్బతింటే- ఎదురుగా ఉన్న దృశ్యాలు బాగానే కనబడుతున్నా చూట్టూతా అంతా మసకగా కనబడతుంది. దీనివల్ల అటూఇటూ తిరగటం వంటివన్నీ కష్టమవుతాయి.
--కొత్త నాళాలు పుట్టటం: కేశనాళాలు మూసుకుపోయినప్పుడు రెటీనాకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో శరీరం ఆ లోటును భర్తీ చేసుకునేందుకు కొత్త రక్తనాళాలను తయారుచేసుకునే పని ఆరంభిస్తుంది. దీనికోసం వ్యాస్కుల్యార్ ఎండోథిలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్’ అనేవి విడుదల అవుతాయి. ఇవి పాతనాళాల పక్క నుంచి కొత్త నాళాలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. అయితే ఇలా కొత్తగా పుట్టే నాళాలు పాత వాటికన్నా పల్చగా, బలహీనంగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా చిట్లి, వీటి నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. ఈ రక్తం రెటీనా ముందు భాగంలో ఉండే ద్రవంలో గూడు కట్టుకుంటుంది (విట్రియజ్ హెమరేజ్). దీంతో హఠాత్తుగా చూపు పోయే ప్రమాదముంది.
--రెటీనా వూడిపోవటం: మధుమేహులకు వచ్చే రెటినోపతీ’లో చివరిదశ ఇది. రెటీనా పొర ముందున్న ద్రవంలోకి రక్తస్రావం అయిపోయి.. అది గూడుకట్టినప్పుడు.. క్రమేపీ అది పొరలు పొరలుగా ఏర్పడుతుంది. అవి కరిగే క్రమంలో రెటీనా పొర ముందుకు ముందుకు గుంజినట్లవుతుంది. దీంతో రెటీనా పొర వడివడిపోయి, ¬డినట్లవుతుంది. ఇది చాలా తీవ్రమైన దశ.
.....................................తరువాత పేజీలో....................................