header

Retina diseases

Retina diseases / కంటి జబ్బులు --రెటీనా

retina

కంటి జబ్బులు --రెటీనా Dr.k.viswanath, Chairman, Pushpagiri eye institute, Secunderabad
మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినటం, ముఖ్యంగా రెటీనోపతి’ అన్నది చాలా తీవ్రమైన సమస్య. కంటి లోపల రెటీనా పొర దెబ్బతింటున్నా కూడా తొలిదశలో పెద్దగా లక్షణాలేం ఉండకపోవచ్చు. కానీ లోలోపల సమస్య ముదురుతూ, చూపు మొత్తం దెబ్బతిని, అంధత్వంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు మధుమేహానికీ, కంటిలోని రెటీనా పొరకూ లంకె ఏమిటి? వివరంగా చూద్దాం.
లంకె ఎక్కడుంది?
--రెటీనా: మన కనుగుడ్డులో వెనకాల వైపున ఉండే సున్నితమైన పొర ఇది. ఒక రకంగా ఇది మన కంట్లో ఉండే సినిమా తెరలాంటిది. కంటి ముందున్న వస్తువుల ప్రతిబింబం దీని మీద పడి, సంకేతాల రూపంలోకి మారితే.. ఆ సంకేతాలు మెదడును చేరి.. అప్పుడు మనకు ఎదురుగా ఉన్నదేదో కనబడుతుంది’. కాబట్టి చూపు మొత్తానికి ఈ రెటీనా పొర అత్యంత కీలకం.
--మధుమేహం: రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుండటమే మధుమేహం. ఈ మధుమేహం- రెటీనా’ పొరను రకరకాలుగా పాడుచేస్తుంది. దాని పనితీరును చెడగొడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావాలంటే మన శరీరంలో జరుగుతుండే సహజ ప్రక్రియలను, మధుమేహం వల్ల వచ్చే మార్పులను కొద్దిగా అర్థం చేసుకోవటం అవసరం.
మన శరీరంలో ప్రతి కణానికీ, ప్రతి అవయవానికీ శక్తి అవసరం. ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారి, అది రక్తంలో కలుస్తుంది. రక్తం.. ఆ గ్లూకోజును శరీరంలోని అణవణువుకూ తీసుకువెళుతుంది. కాబట్టి రక్తాన్ని సరఫరా చేసేందుకు మన శరీరమంతా కూడా చిన్నాపెద్దా రక్తనాళాలు బోలెడన్ని ఉంటాయి. శరీరంలోని చిట్టచివ్వరి, సున్నిత భాగాలక్కూడా రక్తసరఫరా చేసేందుకు చాలా సన్నటి, సూక్ష్మ రక్త కేశ నాళాలుంటాయి. మధుమేహ బాధితుల్లో- రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి.. గ్లూకోజు అధికంగా ఉన్న రక్తం ఈ రక్తనాళాలు, కేశనాళాల గుండా నిరంతరం ప్రవహిస్తున్నప్పుడు క్రమేపీ ఈ నాళాలు దెబ్బతింటాయి. కంటిలోని రెటీనా’ పొర నిండా కూడా రక్తకేశనాళికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. మధుమేహుల్లో ఈ కేశనాళాలు దెబ్బతిని, రెటీనా పొర మీద కొన్ని రకాల సమస్యలు బయల్దేరతాయి. క్రమేపీ ఇవే చూపు దెబ్బతినటానికి దారి తీస్తాయి.
--రెండోది- మన రక్తంలోని ఎర్ర కణాల్లో హిమోగ్లోబిన్‌ ఉంటుంది. శరీర భాగాలన్నింటికీ ఇది ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంటుంది. రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజు స్థాయిలు ఎక్కువైపోతాయో.. అప్పుడా గ్లూకోజు ఎర్ర కణాల్లో కూడా చేరిపోతుంది (గ్లైకేషన్‌). ఫలితంగా ఎర్ర కణాలు సరిగా పనిచెయ్యలేవు. దీంతో శరీర భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది, వాటి పని మందగిస్తుంది. రెటీనా పొరకు కూడా ఇలాగే ఆక్సిజన్‌ అందక, దాని పనితీరు దెబ్బతింటుంది.
లక్షణాలు
తొలిదశలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. చూపు బానే ఉంటుంది. క్రమేపీ ముదురుతున్న దశలో- అక్షరాలు వంకరగా అగుపించటం, పక్క పదం కనబడకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఇలాంటి సూక్ష్మమైన మార్పులను గుర్తించటం కీలకం. నిజానికి లక్షణాలు కొద్దిగా కనబడటం ఆరంభమయ్యే సరికే లోపల సమస్య తీవ్రమై ఉంటుందని, చూపు దెబ్బతినటాకి దారితీస్తోందని గుర్తించాలి. ఈ సమయంలో జాగ్రత్త పడితే సమస్య ఇంకా ముదిరి చూపు పూర్తిగా పోయే స్థితి రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి చూపులో ఎలాంటి తేడా కనబడినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, తప్పకుండా రెటీనా పరీక్ష చేయించుకోవాలి.
ఇలా ఎప్పుడు జరుగుతుంది?
కంటి సమస్యలు మధుమేహులు ఎవరికైనా రావచ్చుగానీ... దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారికి, ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో లేని వారికి ఈ సమస్యల ముప్పు చాలా ఎక్కువ. మధుమేహం వచ్చిన పదేళ్ల తర్వాత దుష్ప్రభావాలు మొదలవ్వచ్చు. అయితే మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే 10 ఏళ్ల తర్వాత రావాల్సిన మార్పులు ఐదేళ్లకే రావచ్చు. అవి పదేళ్లకల్లా చూపును దెబ్బతీసే స్థాయికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 40 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చి, పదేళ్ల పాటు నియంత్రణలో లేకపోతే 50 ఏళ్లకల్లా చదవటానికి అవసరమైన సున్నితమైన చూపు దెబ్బతినొచ్చు. ఆ తర్వాత పనులు చేసుకోవటానికి అవసరమైన చూపూ పోవచ్చు. దీంతో కుటుంబం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. ఇలా ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారు. అందుకే దీన్ని ఏమాత్రం విస్మరించటానికి లేదు.
పరీక్షలు
నేరుగా రెటీనా పొరను చూడటం చాలా ముఖ్యం. దీన్ని ఫండస్‌ ఎగ్జామినేషన్‌’ అంటారు. ఇందుకు ఫండోస్కోపీ, అలాగే డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌ ఫండస్‌ కెమేరాలు బాగా ఉపయోగపడతాయి. స్లిట్‌ల్యాంప్‌లో కూడా కటకాల సాయంతో కంటిపాపను పెద్దదిగా చేసి పరీక్షిస్తే రెటీనా మధ్యభాగంలో (మాక్యులాలో) ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఈ పరీక్షలను తరచుగా చేస్తుంటే రెటీనా సమస్యలను ముందుగానే పసిగట్టే వీలుంది. --ఫ్లోరొసిన్‌ యాంజియోగ్రఫీ:
రెటీనా పొర మీద మధుమేహం కారణంగా మార్పులు మొదలై.. రక్తనాళాలు అక్కడక్కడ ఉబ్బుతున్నాయని గుర్తించిన వారికి తప్పనిసరిగా చెయ్యాల్సిన పరీక్ష ఇది. దీన్ని రెటీనల్‌ యాంజియోగ్రామ్‌’ అంటారు. ఇందులో ముందుగా ముంజేతి రక్తనాళంలోకి ఒక రకం రంగు పదార్థాన్ని (సోడియం ఫ్లోరొసిన్‌) ఎక్కిస్తారు. ఇది 15-20 సెకండ్లలోపే కంటిలోని రెటీనాను చేరుకుంటుంది. ఈ సమయంలో చకచకా రెటీనాను ఫొటోలు తీస్తారు. దీనిలో కేశరక్తనాళాలు ఎలా ఉన్నాయి? అవి ఎక్కడెక్కడ ఉబ్బాయి? వాటిల్లోంచి రక్తం లేదా ద్రవం లీకవుతోందా? రక్తనాళాలు ఎక్కడన్నా మూసుకుపోయాయా? వాటిస్థానంలో కొత్తవి పుట్టుకొస్తున్నాయా? తదితర సమాచారం అంతా తెలుస్తుంది. రెటినోపతి ఏ దశలో ఉందన్నది ఇందులో బయటపడుతుంది.
--ఆప్టికల్‌ కొహెరెన్స్‌ టోమోగ్రఫీ (ఓసీటీ): ఇందులో ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలను రెటీనా మీద పడేలా చేస్తారు. ఇవి పరావర్తనం చెంది.. స్కానింగు చిత్రం వస్తుంది. ఇందులో రెటీనా పొరల్లో, ముఖ్యంగా రెటీనా మధ్య భాగం మాక్యులాలో- వాపు ఏమైనా ఉందా? అక్కడ నీరు చేరిందా? అన్నది తెలుస్తుంది. ఈ పరీక్షల ఆధారంగా రెటీనోపతి సమస్య ఏ దశలో ఉందన్నది తెలుస్తుంది. దశను బట్టి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది.
.....................................తరువాత పేజీలో....................................