header

Kneel Replacement

మార్పిడి ఒక్కటే మార్గమా?
మోకీళ్లు బాగా అరిగిపోయి, తీవ్రమైన నొప్పులతో బాధపడేవారికి మోకీలు మార్పిడి ఎంతగానో ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. అయితే అందరికీ దీన్ని చేయటం కుదరదు. ఇతరత్రా చికిత్సలేవీ పనిచేయనప్పుడే.. చివరి అవకాశంగానే దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కీళ్లనొప్పులతో బాధపడేవారికి ముందుగా- మోకీళ్లపై భారం పడేలా చేసే పనులకు (మెట్లు ఎక్కటం వంటివి) దూరంగా ఉండటం.. అధిక బరువును తగ్గించుకోవటం వంటి జీవనశైలి మార్పులను సూచిస్తారు. కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు కీళ్లు బిగుసుకుపోవటాన్ని తగ్గిస్తాయి, కదలికలను మెరుగుపరుస్తాయి. అందువల్ల ఫిజియోథెరపీ కూడా సిఫారసు చేస్తారు. వేడి కాపు పెట్టటం, సాధారణ నొప్పి మందులు, మలాములతోనూ ఫలితం కనబడొచ్చు. అవసరమైతే మోకీలులోకి ఇంజెక్షన్లు ఇచ్చి కూడా ప్రయత్నిస్తారు. కొందరికి ఎక్స్రేలో మోకీలు పెద్దగా క్షీణించినట్టు కనబడకపోయినా నొప్పితో విలవిలలాడుతుంటారు. వీరిలో కొందరికి మూలకణ చికిత్సతోనూ ప్రయోజనం ఉండొచ్చు. ఇలాంటి పద్ధతులతో ఎలాంటి ఫలితం లేకపోతే.. పైగా మోకీలు వంకరవటం, ఎముక పెచ్చులు వూడటం వంటివీ కనబడుతుంటే.. చివరి ప్రయత్నంగానే మోకీలు మార్పిడికి ప్రయత్నిస్తారు.
పాక్షిక మార్పిడి ఎవరికి?
మోకీలులో ఒక వైపుననే మృదులాస్థి క్షీణించినవారికి
రోజువారీ పనులకు నొప్పులు ఇబ్బందికరంగా పరిణమించినవారికి
మందులు, ఫిజయోథెరపీ వంటి ఇతరత్రా చికిత్సలతో ఉపశమనం కలగనివారికి
పడుకున్నప్పుడు కూడా నొప్పి మూలంగా మెలకువ వస్తున్నవారికి
నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు మోకీళ్లు స్థిరంగా ఉండకుండా కదలిపోతున్నవారికి
చిన్నవయసు వారికి కూడా..
నిజానికి పాక్షిక మోకీలు మార్పిడి గత 30 ఏళ్లుగా చేస్తున్నదే. కాకపోతే అంతగా చేసేవారు కాదు. ఎందుకంటే మొత్తం మోకీలు మార్పిడితో పోలిస్తే.. ఇది కాస్త సంక్లిష్టమైన ప్రక్రియ. తప్పులు జరిగే అవకాశం ఎక్కువ. అయితే కంప్యూటర్ నావిగేషన్ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాక ఇలాంటి తప్పులకు ఆస్కారం బాగా తగ్గిపోయింది. ఎముక ఆకారం, కణజాలం తీరుతెన్నులు కచ్చితంగా తెలుసుకునే వీలుండటం.. వీటి ఆధారంగా ఎముకను అవసరమైన మేరకే కత్తిరించటం.. మిల్లీమీటరు వ్యత్యాసమైనా లేకుండా పరికరాన్ని అమర్చటం సాధ్యమవుతోంది. దీంతో ప్లాస్టిక్ వాషర్ మీద సరి సమానంగా ఒత్తిడి పడటం వల్ల పరికరం ఎక్కువకాలం మన్నటానికీ వీలవుతోంది. ఒకప్పుడు 65 ఏళ్లు పైబడినవారికే పాక్షిక మోకీలు మార్పిడిని సిఫారసు చేసేవారు. ఇప్పుడు చిన్నవయసు వారికీ చేస్తున్నారు. దీనికి వయో పరిమితంటూ ఏమీ లేదు.
ఎలా చేస్తారు?
పాక్షిక మోకీలు మార్పిడి నైపుణ్యంతో కూడుకున్న ప్రక్రియ. దెబ్బతిన్న భాగాన్ని కచ్చితంగా గుర్తించటం, అంతవరకే ఎముకను కత్తిరించటం చాలా కీలకం. ముందుగా ఎక్స్రే, అవసరమైతే ఎంఆర్ఐ పరీక్షల ద్వారా కీలు ఎంతమేరకు దెబ్బతిన్నదనేది నిర్ధరించి చికిత్సను నిర్ణయిస్తారు. రెండో వైపున కూడా మృదులాస్థి దెబ్బతిన్నట్టు, ఏసీఎల్ కండరబంధనం తెగినట్టు తేలితే పూర్తి మోకీలు మార్పిడికే మొగ్గుచూపుతారు. కంప్యూటర్ నావిగేషన్ పద్ధతి సాయంతో ఎముక స్థితి, అమరిక, కోణం వంటివి నిశితంగా గమనించి.. చర్మం మీద 5-6 సెంటీమీటర్ల కోతతో మోకాలును తెరుస్తారు. దెబ్బతిన్న భాగానికి పైన, కింద ఉండే ఎముకలను కత్తిరించి.. ప్రత్యేకమైన సిమెంటుతో పరికరాన్ని అతికిస్తారు.
తరువాత పేజీలో.......