ఏమిటీ క్యాన్సర్?
మన ఒంట్లో కణాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం విభజన చెందుతూ.. వృద్ధి చెందుతుంటాయి. ఈ ప్రక్రియను జన్యువులు నియంత్రిస్తుంటాయి. కణ విభజన అవసరం లేదని అనిపించినప్పుడు కణంలోని లేదా పక్కనున్న కణంలోని సంకేత వ్యవస్థ ‘ఇక చాలు’ అని చెబుతుంది. దీని మూలంగానే మన శరీరంలో ఎదుగుదల ఒక క్రమంలో, కట్టుదిట్టంగా సాగుతుంది. ఎందుకో తెలియదు గానీ కొన్నిసార్లు ఈ నియంత్రణ ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంటుంది. పలితంగా అవసరం లేకపోయినా కణ విభజన జరగొచ్చు. లేదూ కణాలు మరణించకుండా అలా పెరుగుతూనే ఉండొచ్చు. ఇవన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి క్యాన్సర్ కణితులుగా మారతాయి. ఇవి పెరుగుతున్నకొద్దీ వూపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. రక్తంలోకి ఆక్సిజన్ సరఫరా కావటం తగ్గుతూ వస్తుంది.
ఎందుకొస్తుంది?
వూపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకొస్తుందో, ఎవరికి వస్తుందో కచ్చితంగా చెప్పలేం. దీనికి పొగాకు, ఆస్‌బెస్టాస్, ఆర్సెనిక్, రేడియో ధార్మికత వంటి క్యాన్సర్ కారకాలు, జన్యువుల వంటి పలు అంశాలు దోహదం చేస్తాయి. ఇతర భాగాల్లో తలెత్తే క్యాన్సర్ కణాలు విస్తరించటం ద్వారానూ వూపిరితిత్తుల క్యాన్సర్ రావొచ్చు.
* క్యాన్సర్ కారకాలు: వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పొగాకు గురించే. పొగాకులో ఆర్సెనిక్, బెంజీన్, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, తారు వంటి పలు క్యాన్సర్ కారకాలుంటాయి. ఇవి నేరుగా శ్వాసనాళం ద్వారా లేదా రక్తం ద్వారా వూపిరితిత్తుల్లోకి చేరుకొని, స్థిరపడతాయి. క్రమంగా వూపిరితిత్తుల కణజాలంలోని జన్యువులను దెబ్బతీసి.. కణితులకు దారితీస్తాయి. మన రోగనిరోధకశక్తి పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల తలెత్తే జబ్బులు.. ఎక్స్‌రేలు, వాతావరణంలో ఉండే రేడియో ధార్మికత కూడా క్యాన్సర్‌ను తెచ్చిపెట్టొచ్చు.
* జన్యువులు: క్యాన్సర్ తలెత్తటంలో జన్యువులు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ‘మా వంశంలో ఎవరికీ లేదు, నాకే క్యాన్సర్ ఎందుకు వచ్చింది’ అని కొందరు మథనపడుతుంటారు. నిజానికి తల్లిదండ్రులకు క్యాన్సర్ లేనంత మాత్రాన పిల్లలకు రాకూడదనేమీ లేదు. అలాగే రక్తసంబంధికులకు క్యాన్సర్ ఉన్నా కూడా తప్పకుండా వస్తుందనీ చెప్పలేం. సాధారణంగా వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం 5% వరకు కనబడుతోంది. పొగ తాగకపోతే రాదనుకోవద్దు..
పొగ తాగే అలవాటు లేనంత మాత్రాన వూపిరితిత్తుల క్యాన్సర్ రాదని అనుకోవటానికి లేదు. నిజానికి వూపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో పొగ అలవాటు గలవారు 30 శాతమే. మిగతా 70% మంది పొగ అలవాటు లేనివారే. అలాగని దీన్ని తప్పుగా అర్థం చేసుకోవటానికీ లేదు. మన సమాజంలో పొగ తాగే వారికన్నా తాగని వారే ఎక్కువ. అందువల్ల వూపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లోనూ పొగతాగని వారి సంఖ్యే ఎక్కువ. అయితే పొగ అలవాటు లేనివారితో పోలిస్తే.. పొగ తాగే అలవాటున్న వారిలోనే ఎక్కువ శాతం మంది వూపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు కనబడుతుంటారు.
లక్షణాలేంటి?
వూపిరితిత్తులకు మాత్రమే పరిమితమైన కణితులు, ఇతర భాగాలకు విస్తరించిన కణితులను బట్టి వేర్వేరు లక్షణాలు కనబడుతుంటాయి.
* విడవకుండా దగ్గు
* శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది
* కళ్లెలో రక్తం పడటం
* బరువు తగ్గటం
* ఆకలి తగ్గిపోవటం
* గొంతు బొంగురు పోవటం
* ముద్ద మింగటంలో ఇబ్బంది
* ఆయాసం
* బ్రాంకైటిస్, న్యుమోనియా
* జ్వరం
* నిస్సత్తువ
* కామెర్లు
* తలనొప్పి, వాంతి
* నాడీ సమస్యలు
...............తరువాత పేజీలో ............