భోజనం చేయకుండా కొద్దిరోజులు జీవించొచ్చు. నీళ్లు తాగకుండా కొన్ని గంటలు గడపొచ్చు. కానీ శ్వాస తీసుకోకుండా ఒక్క క్షణమైనా నిలవలేం. మన ప్రాణాలు నిలబడటానికి అత్యవసరమైన ఆక్సిజన్ అందటం నిమిషం ఆలస్యమైనా ఉక్కిరిబిక్కిరైపోతాం. కాబట్టే వూపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. ఇవి ప్రకృతి నుంచి లభించే ఆక్సిజన్‌ను శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటూ.. దాన్ని రక్తం ద్వారా అన్ని కణాలకు సరఫరా అయ్యేలా చేస్తూ.. అవసరం లేని కార్బన్ డయాక్సైడ్‌ను బయటికి పంపిస్తూ.. మన జీవం, జీవితం సజావుగా సాగటానికి నిరంతరం అలుపెరగకుండా పనిచేస్తుంటాయి. ఇలాంటి వూపిరితిత్తుల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇబ్బందే. అలాంటిది అనుక్షణం శరీరాన్ని కబళిస్తూ.. అహరహం నిర్వీర్యం చేసే క్యాన్సర్ ముంచుకొస్తే? పచ్చగా కళకళలాడే చెట్టుకు చీడ సోకితే వాడిపోయినట్టుగానే.. మనకు వూపిరిని అందించే తిత్తులూ వాడిపోవటం మొదలెడతాయి. పైగా వూపిరితిత్తుల క్యాన్సర్‌తో ముప్పేటంటే.. నూటికి 80% మందిలో ఇది బాగా ముదిరిన తర్వాతే బయటపడటం. దీంతో నయం కావటం అటుంచి.. అదుపులో పెట్టుకోవటమే కష్టమవుతోంది. ఒకప్పటి కన్నా ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులోకి వచ్చినా.. ఇంకా ఇది కొరకరాని కొయ్యగానే సవాల్ చేస్తోంది. వూపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకొస్తుందో కచ్చితంగా తెలియదు. ఎవరికి వస్తుందో తెలియదు. కానీ రావటానికి దోహదం చేసే కొన్ని కారణాలను మాత్రం మనం తప్పకుండా నిలువరించుకోవచ్చు.
మన ప్రాణానికి, జీవానికి శ్వాస అత్యంత కీలకం. గుండె కొట్టుకోవటం వంటి ఇతర ప్రక్రియలు సజావుగా జరుగుతున్నా.. శ్వాస సరిగా సాగకపోతే శరీరం వెంటనే కుప్పకూలుతుంది. తగినంత ఆక్సిజన్ అందక కణాలన్నీ చేతులెత్తేస్తాయి. కాబట్టే వూపిరితిత్తులకు ఎలాంటి సమస్య వచ్చినా భరించటం కష్టం. ఇక క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలు ముంచుకొస్తే జీవితం మరింత నరకప్రాయంగా మారుతుంది. మనదేశంలో అతి ఎక్కువగా కనబడే ఐదు రకాల క్యాన్సర్లలో వూపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. ఒకప్పుడు పురుషుల్లో నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువగా కనబడుతుండేవి. ఇప్పుడు వూపిరితిత్తుల క్యాన్సర్ వీటన్నింటినీ అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించేసింది. స్త్రీలు, పురుషులు..
ఇద్దరినీ పరిగణనలోకి తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండో స్థానం కూడా దీనిదే కావటం గమనార్హం. మనదేశంలో కొత్తగా బయటపడుతున్న క్యాన్సర్ కేసుల్లో 6.9% కేసులు వూపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించినవే. క్యాన్సర్ల మూలంగా చనిపోతున్న వారిలో 9.3% మంది వూపిరితిత్తుల క్యాన్సర్ బాధితులే. అయినా కూడా మన సమాజంలో దీనిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. దీనిలోనూ క్షయ మాదిరి లక్షణాలు కనబడుతుండటం పొరబడటానికి దారితీస్తోంది. క్షయకు చికిత్స తీసుకుంటున్నా కూడా లక్షణాలు తగ్గుముఖం పట్టకపోయిన సందర్భాల్లోనూ క్యాన్సర్‌ను అనుమానించటం లేదు. అలాగే విచ్చలవిడిగా పెరిగిపోతున్న పొగాకు అలవాట్లు, వాయు కాలుష్యం వంటివీ వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ఆజ్యం పోస్తున్నాయి.
...............తరువాత పేజీలో ............