header

ట్రైగ్లిజరైడ్లు...... Triglysaroids

ట్రైగ్లిజరైడ్లు...... Triglysaroids

కొలెస్ట్రాల్‌.. దీని గురించి మనకు ఇప్పుడు ఎంతో కొంత తెలుసు. మనం కొలెస్ట్రాల్‌ గురించి ఎక్కువే ఆందోళన చెందుతున్నాం. తరచుగా కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకుని చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే వెంటనే తగ్గించుకునే మార్గం గురించి ఆలోచిస్తున్నాం. ఇది అవసరమేగానీ.. ఇంతకంటే ప్రాముఖ్యం ఉన్నదీ, మనం బాగా నిర్లక్ష్యం చేస్తున్నదీ మరోటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు!
మనం ‘లిపిడ్‌ ప్రొఫైల్‌’ పరీక్ష చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్‌తో పాటుగా రిపోర్టులో ఇది కూడా ఉంటుందిగానీ దీన్ని గురించి మనం ఎక్కువగా పట్టించుకోవటం లేదు. ఇది సరికాదు. ఆరోగ్య పరంగా, వైద్యపరంగా కొలెస్ట్రాల్‌ కంటే ట్రైగ్లిజరైడ్లకు కాస్త ఎక్కువ ప్రాధాన్యమే ఉందిగానీ తక్కువ కాదు. ముఖ్యంగా మన భారతీయుల్లో చాలా అనారోగ్యాలకు, వ్యాధులకు ట్రైగ్లిజరైడ్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భారతీయుల్లో మరీ ఎక్కువ: మన భారతీయులకు రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువుండటం కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువుండటమనే సమస్య అధికం! ఈ విషయాన్ని యాభై ఏళ్లుగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వంటి అత్యున్నత సంస్థలు చేస్తున్న అధ్యయనాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఆ విజ్ఞానం రోగుల వరకూ, చికిత్సల వరకూ రావటం లేదు. వైద్యులు కూడా కొలెస్ట్రాల్‌ గురించి తీసుకున్నంతటి శ్రద్ధ ఈ ట్రైగ్లిజరైడ్ల విషయంలో చూపించటం లేదన్న వాదన ఉంది. కానీ మన భారతీయులకు సంబంధించి ట్రైగ్లిజరైడ్లు మరీ కీలకమైనవని గుర్తించటం చాలా అవసరం.
ఎక్కువుంటే నష్టం ఏమిటి?
* ట్రైగ్లిజరైడ్లు ఎక్కువుంటే గుండె జబ్బులు పొంచి ఉంటాయి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువ ఉండటం వల్ల ఎప్పుడైనా కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, రక్తనాళాల వ్యాధుల వంటివన్నీ పొంచి ఉంటాయి. ఇదొక రకం సమస్య అయితే... గుండె, రక్తనాళాల జబ్బుల బారినపడుతున్న 70% మందికి కొలెస్ట్రాల్‌ సాధారణ స్థాయిలోనే ఉండి, కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి చాలా రకాల జీవనశైలి సంబంధ రుగ్మతలకు ట్రైగ్లిజరైడ్లను మూలంగా భావిస్తున్నారు.
* ట్రైగ్లిజరైడ్ల స్థాయి చాలా ఎక్కువైతే (ఈ సమస్య మద్యం ఎక్కువగా తాగే వారిలో మరీ అధికం) క్లోమగ్రంథి దెబ్బతినే ‘పాంక్రియాటైటిస్‌’ అనే తీవ్ర సమస్య తలెత్తుతుంది.
* ట్రైగ్లిజరైడ్లు అనేవి కొవ్వు పదార్థం. ఇవి ఎక్కువగా ఉంటే శరీరంలోని ప్రతి జీవ రసాయన క్రియకూ అడ్డుపడుతూ శారీరక ప్రక్రియలన్నింటినీ మందగింపజేస్తాయి. హైపోథైరాయిడిజం, లివర్‌ సిరోసిస్‌ వంటి సమస్యలుంటే దీనివల్ల అవి ఎక్కువ కావచ్చు.
* ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం వల్ల అతిపెద్ద నష్టం- రక్తనాళాల గోడలు దెబ్బతినటం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ కొవ్వు ముద్దలు పేరుకోవటం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి అక్కడ కొలెస్ట్రాల్‌ పేరుకోవటానికి ముందే- రక్తంలో అధికంగా ఉన్న ట్రైగ్లిజరైడ్లు ఆ ప్రాంతాన్ని (ఎండోథీలియం) దెబ్బతీస్తాయి. ఇవి ముందు దెబ్బతీస్తే.. తర్వాత ఆ ప్రదేశంలో కొలెస్ట్రాల్‌ (ఎథిరోమా) వచ్చి పేరుకుంటుంది. వాస్తవంగా పరీక్షించి చూస్తే అక్కడ పేరుకునే దానిలో కొలెస్ట్రాలే ఉండొచ్చుగానీ అసలు దారి తీసే పరిస్థితిని సృష్టించేవి ఈ ట్రైగ్లిజరైడ్లే! కాబట్టి ముందే వీటిని అడ్డుకుంటే కొలెస్ట్రాల్‌ పేరుకునే సమస్యను బాగా నివారించవచ్చు.
ఎందుకు పెరుగుతాయి?
1. వూబకాయంv 2. మధుమేహం
3. మద్యం ఎక్కువగా తీసుకోవటం వల్లగానీ, క్లోమంలో రాళ్ల వల్లగానీ ఏదైనా కారణంతో పాంక్రియాస్‌ గ్రంథి వాపునకు గురైతే దానివల్ల ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి.
4. లివర్‌ జబ్బులు, సిరోసిస్‌
5. పసరుతిత్తిలో రాళ్ల వంటివీ ట్రైగ్లిజరైడ్లను పెంచుతాయి.
6. పుట్టుకతో వచ్చే కొన్ని కొవ్వుల సమస్యలు. ఇవి ప్రధాన కారణాలేగానీ..
వాస్తవానికి భారతీయుల్లో 70% మందికి ఇవేమీ లేకుండా కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీటి విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మన తీరు వేరు! మనం ఆహారం తీసుకుంటాం. అది జీర్ణమై.. మన శరీరానికి అవసరమైన శక్తి రూపంలోకి ఎలా పరిణామం చెందుతోంది? ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందన్న దానిపై బెంగళూరుకు చెందిన సెయింట్‌ జాన్స్‌ వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం వారు దాదాపు 25 ఏళ్ల క్రితమే లోతుగా అధ్యయనం చేసి.. ఈ విషయంలో మన భారతీయులకూ - పాశ్చాత్యులకూ మధ్య చాలా కీలకమైన వ్యత్యాసం ఉందని గుర్తించారు. ఆహారం తీసుకున్నప్పుడు దానిలోని కొవ్వు పదార్ధాల్ని మన భారతీయుల్లో శరీరం ముందుగా గ్లిజరాల్‌, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చుకుని.. పేగుల గోడల్లోనే ‘ట్రైగ్లిజరైడ్లు’గా మార్చేసుకుని.. అక్కడి నుంచే దాన్ని దాచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అలా నిల్వ రూపంలోకి మార్చుకోగా మిగిలే దాన్నే శక్తిగా మార్చుకుని ఖర్చు పెడుతోందని గుర్తించారు.
కానీ పాశ్చాత్యుల్లో వారి శరీరం తిన్న ఆహారంలోని కొవ్వుల్ని ముందుగా గ్లిజరాల్‌, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చుకుని.. శక్తిలా వినియోగించుకుంటూ, అలా వాడుకోగా మిగిలిన దాన్ని అప్పుడు ట్రైగ్లిజరైడ్లు, కొవ్వులుగా మార్చుకుని నిల్వ చేసుకుంటోంది. మన భారతీయులకూ, పాశ్చాత్యులకూ ఇంత తేడా ఎందుకు వచ్చిందన్న దానికి చాలా సిద్ధాంతాలున్నాయి. బలంగా వినిపించేది మాత్రం ‘థ్రిఫ్టీ జీన్‌’ సిద్ధాంతం. దీనిప్రకారం ఒకప్పుడు మన ప్రాంతంలో కరవులు, క్షామాలు ఎక్కువగా ఉండటం వల్ల శక్తిని, ఆహారాన్ని ఎక్కువగా నిల్వ ఉంచుకునేందుకు మనలో జన్యుపరంగానే మార్పులుచోటుచేసుకున్నాయి. అందువల్ల పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయుల్లో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తలెత్తుతోంది. కొలెస్ట్రాల్‌ కంటే మరీ ప్రమాదం..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలన్నీ కూడా కొలెస్ట్రాల్‌ కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం మరింత ప్రమాదకరమైన విషయమని నానాటికీ గుర్తిస్తున్నాయి. క్రమేపీ వైద్యరంగం దృష్టి కొలెస్ట్రాల్‌ మీది నుంచి ట్రైగ్లిజరైడ్ల మీదికి మళ్లుతోంది. అందుకు ముఖ్యమైన ఉదాహరణ- ఆధునిక రుగ్మతలన్నింటికీ మూలకారణంగా భావిస్తున్న‘మెటబాలిక్‌ సిండ్రోమ్‌’ను నిర్వచించే విషయంలో దానికి కారణమయ్యే అంశాల్లో ‘టోటల్‌ కొలెస్ట్రాల్‌’కు బదులుగా ట్రైగ్లిజరైడ్లను ఉంచటం! ఆ కారణాలేమిటన్నది చూస్తే- బొజ్జ, అధిక బీపీ, రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్‌ తక్కువుండటం. దీన్నిబట్టి ట్రైగ్లిజరైడ్ల ప్రాధాన్యం సుస్పష్టం.
..............................తరువాత పేజీలో................................