బిర్ బిల్లింగ్ సాహస క్రీడలను ఇష్టపడే ప్రపంచ పర్యాటకులకు ఈ ప్రదేశం నచ్చుతుంది. పారాగ్లైడింగ్ కు అనుకూలమైన ప్రాంతం. విచ్చుకున్న రెక్కలు కలిగిన తెరచాపను ఆధారం చేసుకుని గాలిలో నుండి నెమ్మదిగా కిందికిజారుకుంటూ వచ్చే ఒక ప్రత్యేకమైన క్రీడే పారా గ్లైడింగ్. మే నుండి అక్టోబర్ నెల వరకు ఈ సాహస క్రీడకు అనుకూలం.
బిల్లింగ్ మీదికి ఎక్కి అక్కడ నుండి పారా గ్లైడింగ్ మొదలు పెడతారు. అక్కడ నుండి 14 కి.మీ ప్రయాణం తరువాత దిగే స్థలమే బిర్. ఈ క్రీడలో పాల్గొనేందుకు,చూసేందుకు వేలాదిగా జనం వస్తుంటారు. చుట్టూ చక్కని దట్టమైన అడవులు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా వుండే వృక్షాలు వాటి మీదుగా గ్లైడింగ్ సాహసం మగించుకుని కిందికి దిగగానే స్థానిక వంటలు, విదేశీ రుచులు అందించే హోటళ్ళు అనేకం ఉన్నాయి.
బీర్ లో టిబెట్ కాందీశీకులు స్థిరపడ్డారు. ఇక్కడ నిర్మించిన షెరాల్ లింగ్ ఆరామం మరియు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ధర్మశాలలు ప్రత్యేక ఆకర్షణలు. బీర్ చుట్టూ వున్న దైలధార్ పర్వత శ్రేణులు మంచుతో కప్పబడి
మనోహరంగా ఉంటాయి. జోగిందర్ నగర్ నుండి బైజనాథ్ నుండి రోడ్డు మార్గం గుండా ఇక్కడికి చేరవచ్చు. మార్చి నుండి అక్టోబర్ వరకు పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.