ధర్మశాల, హిమాచల ప్రదేశ్ లోని కాంగ్రాకు 27 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యాన ఉన్న ఒక పర్వత పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం కాంగ్రా లోయకు ప్రవేశద్వారంగా పరిగణింపబడుతుంది. ఈ ప్రాంతపు ప్రాకృతిక సౌందర్యం మంచుతో కప్పబడిన ధవళాధర్ పర్వతశ్రేణులతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
ఈ నగరాన్ని రెండు వేర్వేరు ప్రాంతాలుగా విడగొట్టారు, ఎగువ ధర్మశాల, దిగువ ధర్మశాల. దిగువ ధర్మశాల వాణిజ్య కేంద్రం కాగా, ఎగువ ధర్మశాల వలస జీవనశైలికి పేరొందింది. మెక్లియాడ్ గంజ్, ఫర్సిత్ గంజ్ బ్రిటిష్ శివార్లకు ప్రాతినిథ్యం వహిస్తాయి, ఇవి సందర్శి౦చదగ్గవి.
ధర్మశాల ఓక్, కోనిఫెరస్ చెట్ల అడవుల మధ్య మూడు వైపులా ధవళాధర్ శ్రేణులను సరిహద్దులు కలిగి ఉంది. కాంగ్రా లోయ దృశ్యాలను పర్యాకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ధర్మశాలలో ఉన్న కాంగ్రా కళా మ్యూజియంలో ఈ ప్రాంతపు కళాత్మక, సాంస్కృతిక మూలాలు భద్రాపరచబడ్డాయి. 5 వ శతాబ్దపు కళాఖండాలతో బాటు శిల్పాలు, చిత్రాలు, నాణాలు, కుండలు, ఆభరణాలు చేతివ్రాతలు, రాజరికపు దుస్తులు ఇక్కడ చూడవచ్చు.
ధర్మశాల అంతర్జాతీయ గుర్తింపును పొందటంతో బాటుగా ‘ది లిటిల్ లాసా ఇన్ ఇండియా’ అనే ప్రతిష్టాత్మక బిరుదును కూడా పొందింది. ఈ అందమైన ప్రాంతాన్ని పరమ పూజ్య దలైలామా దేశ బహిష్కరణ సమయంలో తన తాత్కాలిక నివాస ప్రాంతంగా చేసుకొన్నారు.
విస్తారమైన టిబెటన్ స్థావరాల కారణంగా, ఈ ప్రాంతాన్ని ఇప్పుడు 'లామాస్ యొక్క భూమి' అని కూడా అంటారు. మెక్లియాడ్ గంజ్ వంటి ప్రాంతాలు ధార్మిక కేంద్రాలుగా పేరొందాయి, ఇక్కడ టిబెట్ బౌద్ధమతపు విద్య, ప్రచారం జరుగుతుంది. అనేక హిందూ, జైన దేవాలయాలతో బాటుగా వివిధ సన్యాస మఠాలు, శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు అందమైన టిబెటన్ హస్తకళాకృతులను, వస్త్రాలు, తంగ్కాస్, హస్తకళాకృతులతో కూడిన స్థానిక జ్ఞాపకార్ధాలను మెక్లియాడ్ గంజ్ మార్కెట్ లో కొనుగోలు చేయవచ్చు.
అనేక చర్చీలు, దేవాలయాలు, మ్యూజియములు, మఠాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. జ్వాలాముఖి దేవాలయం, బ్రిజేశ్వరి దేవాలయం, చాముండా దేవాలయం వంటి అనేక పురాతన దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
కాంగ్రా ఆర్ట్ మ్యూజియం, సెయింట్ జాన్ చర్చి, యుద్ధ స్మారక చిహ్నం ధర్మశాలలోని కొన్ని చూడదగిన ఇతర ప్రముఖ పర్యాటక స్థానాలు. వీటితోబాటుగా ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ షాపింగ్ కేంద్రం, కొత్వాలి బజార్ ను కూడా అనేక మంది సందర్శకులు దర్శిస్తారు. తేయాకు తోటలు, పైన్ అడవులు, దేవదారు అడవులు ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణను జోడిస్తున్నాయి.
ధర్మశాలలో వేసవికాలం మార్చ్ నుండి జూన్ నెలల మధ్య ఉంటుంది. ఈ కాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత 22° సెంటిగ్రేడ్ల నుండి 38° సెంటిగ్రేడ్ల మధ్య ఉంటుంది. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం వలన సాహస ప్రియుల పర్వతారోహణకు ఈ కాలం ఉత్తమంగా ఉంటుంది. భారీ వర్షాలు ఉండటం వలన పర్యాటకులు సాధారణంగా వర్షాకాలంలో ధర్మశాల సందర్శనకు రారు.
శీతాకాలంలో, ఈ ప్రాంతంలో వాతావరణం చాల చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత - 4° సెంటిగ్రేడ్ కు పడిపోతుంది, ఫలితంగా సరిగా కనబడదు, రోడ్లు బ్లాక్ అయిపోతాయి
ధర్మశాల నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్రా మందిర్ అతి దగ్గరి రైలు కేంద్రం.
అయితే అన్ని రైళ్ళు ఈ చిన్న రైలు జంక్షన్లో ఆగవు. ధర్మశాల నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్ కోట్ అతి దగ్గరి ప్రధాన రైలు స్టేషన్. పఠాన్ కోట్ రైలు స్టేషన్ భారత దేశంలోని అన్ని ప్రధాన రైలు స్టేషన్లకు అనుసంధానాన్ని కల్గి ఉంది. రోడ్డు ద్వారా ప్రయాణించాలనుకునే పర్యాటకులు ధర్మశాల దగ్గరలోని నగరాల నుండి ప్రైవేటు, రాష్ట్ర రవాణా బస్సులు రెండింటి సౌకర్యాన్ని పొందవచ్చు.
గగ్గల్ విమానాశ్రయం, కాంగ్రా లోయలో ధర్మశాలకు అతి దగ్గరగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విమానాశ్రయం దేశవాళీ విమానాల ద్వారా న్యూ ఢిల్లీకు అనుసంధానాన్ని కల్గి ఉంది. విదేశీ పర్యాటకులు ఢిల్లీ నుండి గగ్గల్ విమానాశ్రయానికి విమానసౌకర్యం పొందవచ్చు.