ఛంఢీఘర్ నుండి మండీ మీదుగా ప్రపయాణం చేస్తే వచ్చే జంజెహ్లి పురాణ గాథలతో సంబంధమున్న ప్రదేశం. మహాభారత కాలం నుండి ఉన్న కాలి బాటలు నేటికి ఉన్నాయి. జంజెహ్లికి కాలి బాటల ద్వారా వెళ్ళాల్సిందే. పాండవులు కొంతకాలం ఈ ప్రాంతంలోనే అరణ్యవాసం చేసారంటారు.
జంజెహ్లి పర్వతం మీదకు వెళ్ళాలంటే 12 కి.మీ. కాలిబాటన వెళ్ళాల్సిందే. ఇక్కడే పైభాగాన శిఖరదేవి మందిరం ఉంది. ఈ మందిరానికి పైకప్పు లేదు.చిన్నవేదిక మీద నిర్మించబడిన పవిత్ర దేవాలయంలో అమ్మవారి రూపం ఉంటుంది. ఈ అమ్మవారి దర్శనానికి భక్తులు ఎంతో శ్రమపడి కాలిబాటన వస్తారు.
శిఖరదేవి మందిరం సముద్ర మట్టానికి మూడువేల మూడువందల ముప్పరెండు మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడ నిలబడి సూర్య నమస్కారం చేయడం ఒక గొప్ప అనుభూతి. ఇదే చోట నిలబడి సూర్యాస్తమయం సమయాన లోయ అందాలను చూడటం కూడా మరపురాని అనుభవం. కాలి బాటమీద నడవగలిగిన వారు మాత్రమే ఇక్కడికి వెళతారు. కొండ దిగువ ప్రాంతం నుండి 3 కి.మీ ప్రయాణిస్తే పాండవశిల అనే బండను చూడవచ్చు. ఈ శిలను భీముడు వేళ్ళతో కదిలించాడంటారు.