india tour header

Barot Vally / బరోట్ లోయ

Spiti Valley / స్పితి లోయ...
మనదేశానికి ఉత్తర సరిహద్దులో చైనా, టిబెట్ పొలిమేరల్లో ఉంది. స్పితి అంటే మధ్యనున్న నేల అని అర్థం. హిమాలయ సానువుల్లో విస్తరించిన ప్రదేశం ఇది. ఈ లోయతోపాటు ఇక్కడ ప్రవహిస్తున్న నది కూడా అదే పేరుతో స్పితి నదిగా వాడుకలోకి వచ్చేసింది. బౌద్ధం కొలువుదీరిన ప్రదేశం ఇది. ఇక్కడ బౌద్ధలామాలు తిరుగాడుతుంటారు. పర్వతసానువుల్లో క్లిష్టమైన మలుపులు దాటుకుంటూ ముందుకు పోతుంటే ఇక్కడ మనుషులు నివసించడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతుంది. ఇంతలో కాషాయధారులైన బౌద్ధసన్యానులు కనిపిస్తారు. కొండదారుల్లో నడవడం దినచర్య కావడంతో వాళ్లు ఏ మాత్రం తొట్రుపడకుండా ఒకరి వెనుక ఒకరుగా క్రమశిక్షణతో సాగిపోతుంటారు.
ఆల్టిట్యూడ్ సిక్నెస్(భూమి వాతావరణం నుంచి పైకి వెళ్లేకొద్దీ ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు... తల తిరిగినట్లు ఉండడం, ఊపిరి తీసుకోవడంలో కొద్దిపాటి ఇబ్బందుల వంటివి) ఎంతో ఎత్తుకి వెళ్తున్నామని తెలియజేస్తుంటుంది, కానీ ఎంత ఎత్తులో ఉన్నదీ అర్థం కాదు. ఎందుకంటే కిందకు చూస్తే అనేక శిఖరాలు తప్ప చదునైన నేల కనిపించదు. ఎక్కడో ఒకచోట మైలురాళ్లలాగ ఎత్తును తెలిపే రాళ్లుంటాయి. 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నారనే విషయాన్ని నిర్ధారిస్తూన్న బోర్డులను దాటి ముందుకెళ్లి కొండ మలుపు తిరిగితే దూరంగా బౌద్ధారామాలు, చైత్యాలు కనిపిస్తుంటాయి. ప్రైమరీ స్కూల్లో సోషల్ పాఠాల్లో చదివినప్పుడు అర్థం అయినట్లూ కానట్లూ మస్తిష్కంలో ఏదో ఒక మూలన ప్రశ్నార్థకాల్లా మిగిలిపోయిన ‘కీ’ మోనాస్టెరీ, టాబో మోనాస్టెరీలు స్పితి లోయ పర్యటనలో కనిపిస్తాయి. ఇవి రెండూ బౌద్ధం పురుడుపోసుకున్న తొలినాళ్లలో కట్టిన బౌద్ధచైత్యాలు. అందుకేనేమో ఇది దలైలామాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అయింది.
హిమాచల్ ప్రదేశ్లో పర్యటన అంటే మొదటగా గుర్తొచ్చేవి సిమ్లా, కులు, మనాలి. కులు లోయ నుంచి స్పితిలోయకు దారి ఉంటుంది. స్పితిలోయకు వెళ్లే దారిలో రొహటాంగ్ పాస్ దాటిన తర్వాత ఒక పక్కగా కనిపిస్తుంది కుంజుమ్ కనుమ. శీతాకాలంలో హిమపర్వతాలను కప్పేసిన మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. ఇక్కడ ఇంకా అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి
ఈ పట్టణానికి మోటార్ వాహనం నడిచే రోడ్డు ఉంది. హిక్కిమ్ పట్టణం కజాకు పాతిక కిలోమీటర్ల దూరాన 15 వేల అడుగులకంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అలాగే మరో ప్రశ్న కూడా! ప్రపంచంలో ఎత్తై నివాస ప్రాంతం ఎక్కడ అంటే దానికి బదులు కూడా ఇక్కడే దొరుకుతుంది. అది గెట్టె గ్రామం. కాజా పట్టణానికి కొద్దిదూరాన సముద్రమట్టానికి 4270 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పర్యటనలో ఆకర్షించే మరో ప్రదేశం బారా సిగ్రి గ్లేసియర్. రొహటాంగ్ పాస్ దాటి 20 కి.మీ.లు ప్రయాణిస్తే గ్రంఫూ గ్రామం వస్తుంది. ఇక్కడి కుడి వైపున బారా సిగ్రి గ్లేసియర్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే పొడవైన హిమనదాల్లో రెండవది.
కుంజుంమ్ కనుమ శిఖరం మీద దుర్గామాత ఆలయం ఉంటుంది. ఈ శిఖరం నుంచి ఎటు చూసినా ప్రకృతి కనువిందు చేస్తుంటుంది. ఈ కనుమకు ఆరు కిలోమీటర్ల దూరాన చందర్తాల్ ఉంది. ఇది చంద్ర నది పరివాహక ప్రదేశంలో ఉంది. నది ఇక్కడ చిన్న పాయగా చీలి మడుగు కట్టింది. ఇది చంద్ర నది పేరుతోనే చందర్తాల్గా వాడుకలోకి వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం... పాండవ అగ్రజుడు యుధిష్టిరుడిని స్వర్గానికి తీసుకెళ్లడానికి ఇంద్రుడు రథాన్ని పంపించాడని, ఆ రథంలో ధర్మరాజు స్వర్గానికి చేరాడని చెబుతారు. ధర్మరాజు రథాన్ని అధిరోహించింది చందర్తాల్ తీరాన అని ఒక విశ్వాసం. ఇక్కడి నుంచి కుంజుంమ్ పాస్కి ముఖద్వారంగా ఉన్న రొహటాంగ్ పాస్ని చూసేసి, లోసార్లో సరదాగా జడల బర్రెలు, గుర్రాల మీద సవారీ చేసి డల్హౌసీ చేరుకుంటే మరో ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. ఇది బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ హయాంలో కాత్లాగ్, పోట్రేయస్, తెహ్రా, బక్రోటా, బలున్ అనే ఐదు కొండల మీద నిర్మితమైన నివాస ప్రదేశం. మధ్యయుగం నాటి నిర్మాణశైలిలో ఉన్న చర్చిలు, దేవదారు, పైన్ వృక్షాలు, రంగుల పూలతో అందమైన ఉద్యానవనాన్ని తలపిస్తుంది.
భారత్లోనే పర్యటిస్తున్నామా లేక పొరపాటున సరిహద్దు దాటేసి టిబెట్లోకి అడుగు పెట్టామా అన్నంత అయోమయం కలిగిస్తాయి ఈ పరిసరాలు. కనిపించే మనుషుల్లో కొందరు బౌద్ధలామాలు, మిగిలిన వాళ్లు భోతియాలు. వీరి ముఖకవళికలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు అన్నీ భిన్నంగా ఉంటాయి.
ఈ జాతి వాళ్లు భారత్లోకంటే టిబెట్లోనే ఎక్కువ. ఇక్కడ ఏ పంటలు పండించాలన్నా వాతావరణం అనుకూలించేది ఏడాదిలో నాలుగైదు నెలలే. ఆ నాలుగు నెలల్లో పండించుకుని ఏడాదంతా నిల్వ చేసుకుని జీవనం సాగిస్తారు. వీరి జీవనశైలిలో బౌద్ధం ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. మృదుస్వభావులైన స్థానికులలో పర్యాటకులకు సహాయం చేయాలనే ఉత్సాహం కనిపిస్తుంటుంది. కానీ భాష తెలియకపోవడంతో సహకారం అందడం కష్టమే. ఇక్కడి వాళ్లు మాట్లాడే ‘భోతి’ భాషను వింటుంటే మనకు హిందీలాగ ధ్వనిస్తుంది, కానీ ఒక్క పదం కూడా హిందీతో సరిపోలదు. వీరిలో ఇంగ్లిష్ వచ్చిన వాళ్లు చాలా తక్కువ. ఒక మోస్తరుగా ఇంగ్లిష్ నేర్చుకున్నారంటే గైడ్లుగా స్థిరపడడానికే. గైడ్ల ఇంగ్లిష్ పరిజ్ఞానం కూడా పర్యాటకులకు వివరించడానికి తగినంత మాత్రమే. ఇతర వివరాలను పెద్దగా రాబట్టడం సాధ్యం కాదు. కాబట్టి స్పితి వ్యాలీకి టూర్ ఆపరేటర్లు నిర్వహించే ప్యాకేజ్లో వెళ్లడమే సౌకర్యం. స్పితిలోయలో పర్యటన చక్కటి విహారయాత్ర... అంతకంటే పెద్ద సాహసయాత్ర కూడ.
ఎలా వెళ్లాలి?
స్పితి లోయ... హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాకు 400 కి.మీ.ల దూరంలో ఉంది. సిమ్లా నుంచి ఎనిమిది గంటల ప్రయాణం. సమీప విమానాశ్రయం: కులూలోని భుంటార్ ఎయిర్పోర్టు. కులు, మనాలి నుంచి రొహటాంగ్ పాస్ మీదుగా ‘కజా’ చేరి అక్కడి నుంచి స్పితికి చేరవచ్చు. మనాలి నుంచి స్పితికి జూలై నుంచి అక్టోబర్ వరకు బస్సులు నడుస్తాయి.
సమీప రైల్వేస్టేషన్: మనాలి రైల్వేస్టేషన్. సిమ్లా స్టేషన్లో దిగితే కిన్నూర్ మీదుగా ‘కజా’కి చేరి అక్కడి నుంచి స్పితికి వెళ్లవచ్చు. సిమ్లాలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ఉన్నాయి. సిమ్లా మీదుగా మే నెల నుంచి అక్టోబరు వరకు బస్సులు నడుస్తాయి.
వసతి సౌకర్యం...
స్పితిలోయకు సమీపంలో ఉన్న పట్టణం కాజా. ఇది మనాలికి రెండువందల కిలోమీటర్ల దూరాన స్పితివ్యాలీ తీరాన ఉంటుంది. కాజాలో పిడబ్ల్యుడి గెస్ట్ హౌస్తోపాటు ప్రైవేట్ హోటళ్లు కూడా ఉంటాయి. ధన్కార్ గొంపాలో మనిషికి 150 రూపాయలతో కనీస బస సౌకర్యం ఉంటుంది. సాధారణ భోజనం పెడతారు.
ఆహారం...
స్థానికులు జొన్న, మొక్కజొన్న రొట్టెలు తింటారు. రెస్టారెంట్లలో ఇవి దొరకడం కష్టమే. దాబాలు, రెస్టారెంట్లలో పరాఠా, నూడుల్స్ వంటివి దొరుకుతాయి. కొన్ని రెస్టారెంట్లలో అన్నం దొరుకుతుంది. కానీ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే వండుతారు. నూడుల్స్ పాకెట్స్ తీసుకెళ్లి హోటల్ వాళ్ల సహకారంతో వేడినీటితో ఉడికించుకోవడం సౌకర్యంగా ఉంటుంది.