పహల్గావ్ లో ఉన్న శివాలయం నుంచే అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. ఇది శివుడు అమర్నాథ్ గుహకు వెళ్లేటప్పుడు నందిని వదిలి వెళ్లిన స్థలమని ప్రతీతి. అందుకే దీన్ని మొదట్లో భైరవ్గావ్ అనేవారట.
ఆరువ్యాలీ, బేతాబ్వ్యాలీ ముఖ్యమైనవి. ఇక్కడ ఎప్పుడూ ఏవో సినిమా షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించలేం.
పహల్గావ్ నుంచి గుల్మార్గ్ దారిలో అన్నీ ఆపిల్ తోటలే అక్కడ ఆగి ఆపిల్స్ కొనవచ్చు. గుల్మార్గ్లో ఎటు చూసినా విశాలమైన మైదానాలే. అక్కడే పోలో గ్రౌండు ఉంది. చలికాలంలో ఇది స్కేటింగ్ కేంద్రంగా మారిపోతుందంటారు. ఇక్కడ ఉన్న రెండు కొండలను కలుపుతూ రోప్ వే ఏర్పాటుచేశారు. పర్యటకులు గుర్రాలమీద తిరుగుతూ కాశ్మీర్ అందాల్ని ఆస్వాదించవచ్చు.
శ్రీనగర్………అన్నీ పూలవనాలే. అందులో ప్రధానంగా మొఘల్, షాలిమార్, నిశాంత్ ఉద్యానవనాలు ముఖ్యమైనవి. మొఘల్ గార్డెన్స్లో అందరూ కాశ్మీర్ డ్రెస్సు వేసుకుని ఫొటోలు తీయించుకుంటారు.
కాశ్మీర్ వెళ్లినవాళ్లు దాల్సరస్సులోని హౌస్బోటులో బస చేయకుండా వెనుతిరగలేరు. పైన్, దేవదారు చెక్కతో చేసి ఆ బోట్లు చాలా అందంగా ఉంటాయి. వాటిని నిర్మించడంలోనే కాశ్మీరీల పనితనం కనిపిస్తుంది. వాటిమీద లతలూ పువ్వుల డిజైన్లే ఎక్కువ. 22 చ.కి.మీ మేర విస్తరించిన దాల్ లేక్లో వందలకొద్దీ హౌస్బోట్లు ఉన్నాయి. వేసవిలో వీటిల్లో గది దొరకడం కష్టం. అద్దె రోజుకి సుమారు ఏడు నుంచి పది వేల రూపాయల వరకూ ఉంటుంది. ఈ పడవలు సుమారు ఐదువందల సంవత్సరాల నుంచీ ఉన్నాయట. ఈ ప్రాంతాన్ని పాలించిన హిందూ చక్రవర్తులూ మహ్మదీయ సుల్తానులూ బ్రిటిష్ పాలకులూ వీటిని వేసవి విడిదిగా వాడుకునేవారట.
హౌస్బోటు స్టార్ హోటల్కి ఏమాత్రం తీసిపోదు. ఇందులో ఓ డ్రాయింగ్రూమూ, డైనింగు హాలూ, ఐదు పెద్ద పడకగదులూ ఉంటాయి. గదుల్లోని హస్తకళాకృతులన్నింటి మీదా చీనార్ ఆకుల డిజైన్లే.
కాశ్మీరీలకు ఈ చెట్లే ప్రాణదాతలు. ఇవి ఎక్కువ ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అందుకే ఒక్క చీనార్ ఆకుని తుంచినా అక్కడి ప్రజలు ఊరుకోరు. ఈ బోటులోని ప్రతి బెడ్ రూముకీ ఓ బాత్రూము ఉంటుంది. ఇది అధునాతన హంగులతో ఉంటుంది. స్నానానికి పెద్ద బాత్ టబ్ కూడా ఉంది. కేరళలో మాదిరిగా ఇవి నీళ్లలో తిరగవు. వీటిని ఒడ్డుకి తీగలతో కట్టి ఉంచుతారు. మనం భోజన, ఫలహారాలకు ఆర్డరు ఇస్తే బయట తయారుచేసి తీసుకువచ్చి ఇక్కడ వడ్డిస్తారు. కిచెన్ ఉంటుంది కానీ సామాన్లు భద్రపరచడానికి మాత్రమే వాడతారు. తెల్లవారగానే రకరకాల పండ్లూ కూరగాయలూ ఉన్న పడవలు ఈ బోటు దగ్గరకే వస్తాయి. వాటిల్లో నుంచి కుంకుమపువ్వూ, రకరకాల డ్రై నట్స్ లాంటివి కొనుక్కోవచ్చు. ఇళ్లూ మార్కెట్లూ ఆసుపత్రులూ అన్నీ నీళ్లమీదే. సరస్సులోనే నెహ్రూ పార్క్, చినార్గేట్, హోటల్, వాటర్ సర్ఫింగ్... వంటివన్నీ ఉన్నాయి. మొత్తమ్మీద ఈ సరస్సు ఓ నీటిపట్టణాన్ని తలపిస్తుంది.
సోనామార్గ్………. ఇది సుమారు 85 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 9200 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రత -20 డిగ్రీలు ఉంటుంది. వాహనాలని నియంత్రించి ముందుకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఈ రోడ్డుమీదనే ప్రయాణించి లద్దాఖ్ చేరుకోవచ్చు..
ఇక్కడ అన్నింటిలోకీ చూడదగ్గది జోజిలా పాస్. ఇది సుమారు 11,600 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడకు వెళ్లడానికి మన వాహనాలని అనుమతించరు. స్థానిక ఆపరేటర్లు వాళ్ల వాహనాల్లోనే తీసుకువెళ్తారు. ఈ ప్రయాణం ఓ మరువలేని అనుభూతిని అందిస్తుంది. ఎత్తైన పర్వతాల నడుమ సన్ననిదారిలో వాహనాలను నడపడం కత్తిమీద సాములాంటిదే.. అక్కడ గ్లేసియర్లను దగ్గరగా చూడటం, వాటిమీద నడవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ నుంచే పవిత్ర అమర్నాథ్ గుహకి హెలీకాఫ్టర్లు బయల్దేరతాయి. నిజానికి జోజిలాపాస్ అమర్నాథ్ గుహకి వెనకవైపు ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే నాలుగైదు గంటల్లో చేరుకోవచ్చు. కానీ అక్కడకు వెళ్లడానికి ముందే అనుమతులూ రిజిస్ట్రేషన్లూ తప్పనిసరి.
జమ్మూలో ప్రముఖ దేవాలయాలైన రఘునాథ్మందిర్, కాళీమాతా మందిర్, నవదుర్గ మందిర్, జాంబవంత్గుహ మొదలైనవి చూడదగ్గవి....
తరువాత పేజీలో.....శ్రీనగర్