header

Kanyakumari Tourism

కన్యాకుమారి
భారతదేశానికి దక్షిణం వైపున ఉన్న కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలమే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా. కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఉన్నది మహాసముద్రం, పడమర అరేబియా సముద్రాలను హద్దులుగా కలిగి ఉంటుంది కన్యాకుమారి. సూర్యుడు ఉదయాన బంగాళాఖాతం నుండి ఉదయించటం, సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమించటం చూడటం ఒక అద్భుతమైన ఆనందం.
సముద్రతీరం ప్రకృతి శోభతో వుండే కన్యాకుమారి సముద్ర తీరంలో ఇసుక థోరియం ధాతువుతో కూడి వుండటం పరమేశ్వరుడి అద్భుత శక్తికి నిదర్శనమని అంటారు. మూడు సముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతుందని, కన్యాకుమారి పార్వతీ మాతకు నివాస స్థలమని భక్తులు నమ్ముతారు. కన్యాకుమారి ఆలయం దక్షిణభారత దేశంలోని పవిత్రమైన ఆలయాలలో కన్యాకుమారి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని అంటారు. అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది.





వివేకానంద కేంద్రం
స్వామి వివేకానంద 1892లో చికాగొలో జరిగిన అఖిల మత సమావేశానికి కన్యాకుమారి నుండే ప్రయాణం సాగించాడు. తీరానికి కొంచెం దూరంలో సముద్రంలో ఉన్న ఎత్తైన రాతి గట్టుమీద వివేకానందుడు తపస్సు చేశారు. 1963 లో ఆయన శతజయంతికి , వివేకానంద స్మారక ట్రస్ట్ వారు వివేకానంద స్మృతి మందిరాన్ని నిర్మించారు. ఈ భవనం అంతా బయట భాగంలో ఎర్రరాయి, లోపల గ్రానైట్ రాయితో నిర్మించారు. తీరం నుండి లాంచిలో ఈ మందిరానికి చేరుకొనవచ్చు.


గాంధీజీ స్మారక చిహ్నం
గాంధీ మహాత్ముడు ఇక్కడికి వచ్చి ప్రకృతి సౌందర్యానికి పరవశించి సముద్రతీరంలో గడిపిన చోట గాంధీ స్మారక మందిరాన్ని నిర్మించి జాతికి అంకితమిచ్చారు. ఈ కట్టడం ఒరిస్సా కట్టడాలను పోలి వుంటుంది. 1956లో ఈ కట్టడం నిర్మాణాన్ని పూర్తిచేసారు.

మాథూర్ బ్రిడ్జ్
కన్యాకుమారి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బ్రిడ్జి. ఇక్కడ పరిసర ప్రాంతాలలో ప్రకృతి సౌందర్వం చూడవలసిందే గానీ చెప్పటానికి వీలులేనిది. ఈ బ్రిడ్జి 155 అడుగుల ఎత్తులో కట్టబడింది, పొడవు ఒక కిలోమీటర్. తిరువత్తార్ పంచాయితీ సమీపంలోని అరువిక్కరామ్ గ్రామంలో ఈ బ్రిడ్జి ఉన్నది.




మహాకవి తిరువాళ్లవార్ విగ్రహం
తిరువాళ్లవార్ తమిళ ప్రాంతానికి చెందిన మహాకవి. ఈయన జ్ఙాపకార్ధం తమిళనాడు ప్రభుత్వం 133 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 38 అడుగుల రాతి చట్రం ఈ కవి రాసిన కూరల్ లో 38 అధ్యాయాలకు ప్రతీక. 140 మెట్లు ఎక్కి విగ్రహం పైభాగాన్ని చూడవచ్చు. ఈ విగ్రహాన్ని జనవరి 1వ తేదీ, 2000వ సంవత్సరంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు.



ఇందిరాపాయింట్‌… కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్‌ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమి ళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్‌ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.
ఎలా వెళ్లాలి ?
కన్యాకుమారికి వెళ్లాలంటే తెలంగాణా రాజధాని నగరం హైదరాబాద్ నుండి రైలు మార్గం లేక బస్సులలో వెళ్లవచ్చు. లేక మద్రాసు నగరానికి రైలు లేక బస్సుల ద్వారా చేరుకుని అక్కడ నుండి వెళ్లవచ్చు. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి కన్యాకుమారి 1240 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానమార్గంలో వెళ్లాలంటే తివేండ్రం వరకు వెళ్లి అక్కడ నుండి బస్సులు లేక కార్లలో వెళ్లవచ్చు. తివేండ్రం విమానాశ్రయం నుండి కన్యాకుమారి 67 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.