

కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో చిక్కమగళూరు పట్టణం ఉంది. ఇక్కడ అనేక పర్యాటక స్ధలాలున్నాయి
చిక్కమగళూరు అంటే...‘చిన్న కుమార్తె ఊరు ’ అని అర్ధం అంటారు. ఈ పట్టణాన్ని స్థానిక పాలకుడు తన చిన్న కుమార్తెకు కానుకగా ఇచ్చాడని, ఆ కారణంగానే దానిని చిక్కమగళూరు అంటారని చరిత్ర.
చిక్కమగళూరు చుట్టుపట్ల అనేక సహజ ప్రకృతి ప్రదేశాలు సుందర దృశ్యాలతో సందర్శకులను అలరిస్తాయి. పల్లపు భూములనుండి మల్నాడు లోని పర్వత ప్రాంతాలవరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలో పెద్ద పెద్ద కాఫీ తోటలు ఉన్నాయి. దీనిని కర్నాటక రాష్ట్ర కాఫీ రాజధాని అని కూడా అంటారు.
చిక్కమగళూరు పట్టణంలో మహాత్మ గాంధీ పార్క్ పర్యాటకుల ప్రదేశంగా పేరొందింది. పర్యాటకులు ప్రధానంగా దసరా పండుగల సమయంలో జరిగే జానపద కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలను చూసి ఆనందించడానికి ఇక్కడకు వస్తారు. ఆ రోజులలో జరిగే వివిధ కార్యక్రమాలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి.
షాపింగ్ చేయాలనుకునేవారు మహాత్మ గాంధీ రోడ్డులోని దుకాణాలకు వెళ్లవచ్చు.
కాంక్రీట్ నగరాలుగా పేరుపొందిన పట్టణాల నుండి విముక్తి కోరేవారికి చక్కటి ప్రదేశం చిక్కమగళూరు. ఈ ప్రాంతం పర్యాటకులకు ఒక స్వర్గాన్ని తలపిస్తుంది. యాత్రా ప్రదేశాలనుండి కాఫీ తోటలవరకు, అటవీ సంబంధ ప్రదేశాలు, సాహసోపేత క్రీడల ప్రదేశాలు, హిల్ స్టేషన్లు, దేవాలయాలు, జలపాతాలు, వన్యప్రాణుల విహారాలు ఎన్నో మరెన్నో ఆకర్షణలు కలిగి ఒకసారి చూసిన వారు మరలా మరలా వస్తారు.
కెమ్మనగుండి హిల్ స్టేషన్, రోజ్ గార్డెన్, సుందరమైన జలపాతాలు ఎన్నో ఆకర్షణలు. ఇవి పట్టణానికి అతి కొద్ది దూరంలోనే ఉంటాయి.
చిక్కమగళూరు పట్టణ సమీపంలోనే దట్టమైన అడవులతో కూడిన మరో పచ్చటి ప్రదేశం కుద్రేముఖ్. ఈ ప్రాంతంలో గుర్రపు ముఖ ఆకారంలో ఒక కొండ ఉండటంచే దీనికి కుద్రేముఖ్ అనే పేరువచ్చింది. కుదురే అనగా కన్నడంలో గుర్రం అని, ముఖ్ అనగా ముఖం అని చెపుతారు.
కర్నాటకలో ముల్లాయనగిరి అతి పొడవైన శిఖరం. ఇది బాబా భూదాన్ గిరి కొండలలో ఒక భాగం. ఈ కొండ శిఖరం 1930 మీటర్ల పొడవుతో ట్రెక్కింగ్ విహారానికి అత్యంత అనువైన ప్రదేశంగా చెప్పబడుతుంది. కొండ శిఖర పైభాగానికి వెళ్ళి అక్కడినుండి చూస్తే ఎటువంటి వారికైనా సరే ఎంతో ఆనందోత్సాహాలలో మునిగిపోతారు. ఈ ప్రాంతంలో అనేక జలపాతాలు ...కళాతగిరి జలపాతం లేదా కాళహస్తి జలపాతం నుండి రెండు దశలలో ప్రవహించే హెబ్బె జలపాతం వరకు సందర్శకులకు కనువిందు చేస్తాయి.
జలపాతాలైన మాణిక్య ధార జలపాతం, శాంతి జలపాతం, కాదంబి జలపాతాలను కూడా ఈ ప్రాంతంలో సందర్శించవచ్చు. ప్రశాంతత కోరే ఆధ్యాత్మిక వ్యక్తులకు ఇది చక్కటి ప్రదేశం. వీరికి శృంగేరి నుండి హొరనాడు మరియు కలాసా వరకు ఎన్నో ప్రదేశాలు కలవు.