header

Karnataka Tourism / కర్నాటక పర్యాటకం

కనులకు విందు చేసే పచ్చని ప్రదేశాలు, ఒంపు సొంపులతో సాగే ఎత్తైన జలపాతాలతో కెమ్మనగుండి, కుద్రేముఖ్ ప్రాంతాలు రాష్ట్రంలో పేరొందిన ప్రధాన హిల్ స్టేషన్లుగా పేరు తెచ్చుకున్నాయి. అంతులేని విస్తీర్ణంతో అతి పెద్ద కోస్తాతీరంగా చెప్పబడే మంగుళూరు బీచ్ కర్నాటక పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణ. మంగుళూరుకి దగ్గరలో గల కొల్లూరు మూకాంబిక దేవాలయం, ఉడుపి క్రిష్ణ దేవాలయం, హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం, శృంగేరి శారదా దేవి ఆలయం, కుక్కే సుబ్రమణ్య, ధర్మస్ధ, మొదలైన చూడవలసినవి.
బైందూర్, మాల్పే, కార్వార్ ప్రదేశాలు చక్కటి బీచ్ లు కాగా మరావంతే ఒక ప్రశాంతమైన కోస్తా తీరానికి ఉదాహరణగా నిలుస్తుంది. చారిత్రక ప్రాధాన్యతలుగల ప్రదేశాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి.
మైసూర్, బాదామి, హంపి, బేళూరు, హళేబీడు, శ్రావణబెళగొళ, మొదలైనవి శిల్పకళా వైభవాలకు అద్దం పడుతూ గడచిన యుగాలపై అనేక గాధలు వినిపిస్తాయి. సాహస క్రీడలను ఇష్టపడే వారికి కర్నాటక రాష్ట్రం ఆహ్వానం పలుకుతుంది. కావేరి ఫిషింగ్ కేంప్, భీమేశ్రి, గాలిబోర్ మరియు దొడ్డమాకలి ప్రదేశాలు సాహసికులకు ఆనందకర అనుభవాన్నిస్తాయి. సావన్ దుర్గ, అంతరగంగే, శివగిరి, రామనగరం మొదలైన పట్టణాలు రాక్ క్లైంబింగ్ మరియు ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఆనందం ఇస్తాయి. హొన్నెమర్దు, శివగంగ, శివనసముద్ర, సంగమ మొదలైన ప్రదేశాలు బోటింగ్, రివర్ ర్యాఫ్టింగ్, నావ ప్రయాణం మరికొన్ని ఇతర నీటి సంబంధిత క్రీడలకు పేరు పొందినవి. కర్నాటకలోని వన్యజీవులు కూడా పర్యాటకులకు ఆకర్షణే.
ప్రఖ్యాత టైగర్ రిజర్వు అయిన బండిపూర్, ఏనుగులతో నిండిన కాబిని మరియు నాగరహోళే, బి. ఆర్ హిల్స్, దండేలి, భద్ర వంటి వన్యజీవుల సంరక్షణాలయాలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచి పర్యాటకులకు మరువలేని అనుభూతులు కలిగిస్తాయి.
రాష్ట్రంలో బెంగుళూరు, మైసూర్, మంగుళూరు, మొదలైనవి ప్రధాన నగరాలు. బెంగుళూరు ఆధునిక షాపింగ్ మాల్స్ లో పర్యాటకులు తమకిష్టమైనవి షాపింగ్ చేయవచ్చు.