

కుద్రేముఖ్ కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉన్న ఒక పర్వత శ్రేణి. కుద్రేముఖ్ ప్రాంతం ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. పచ్చటి ప్రదేశాలు, దట్టమైన అడవులతో కలిగి ఎంతో జీవ వైవిధ్యం గల ప్రాంతం.
కుద్రేముఖ్ నేషనల్ పార్క్ షుమారుగా 600 చ. కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్నో పచ్చిక బయళ్ళు, దట్టమైన పచ్చటి ప్రదేశాలు కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం ఉండటం వలన నీటి నిల్వలు అధికంగా ఉంటాయి. నిరంతరం ప్రవహించే ఎన్నో వాగులు వంకలు కలిగి తుంగ, భద్ర మరియు నేత్రావతి నదులు ఏర్పడ్డాయి.
చల్లటి వాతావరణం, పచ్చదనం, వివిధ రకాల చెట్లు కలిగి ఎన్నో జంతువులకు ఆవాసంగా ఉంది. చిరుతలు, పులి, లేడి, ఉడుతలు, అడవి పందులు, ముళ్ళపందులు, అడవి ఎలుగుబంటి, ముంగీస మొదలైనవి సంచరిస్తూ ఉంటాయి. క్రూర జంతువులైన, పులి, చారల పులి, నక్కలు, అడవి కుక్కల వంటివి కూడా అడవులలో సంచరిస్తాయి.
కుద్రేముఖ్ పట్టణ సమీపంలో అనేక సందర్శనా ప్రాంతాలున్నాయి. లక్ష్య డామ్, రాధా క్రిష్ణ మందిరం, గంగమూల కొండలు, హనుమాన్ గుండి జలపాతాలు వంటివి కలవు. హనుమాన్ గుండి జలపాతాలు 100 అడుగుల ఎత్తునుండి సహజంగా ఏర్పడ్డ రాళ్ళ మధ్యనుండి ప్రవహిస్తున్నాయి. కుద్రేముఖ్ సందర్శకులకు ఈ ప్రదేశం ఒక వినోదం మరియు యాత్రా స్ధలంగా పేరు పొందింది.
కుద్రేముఖ్ ప్రాంతం వివిధ రకాల ట్రెక్కింగ్ మార్గాలకు అనువుగా ఉంటుంది. అయితే ట్రెక్కింగ్ చేయకోరేవారు ముందుగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి. కుద్రేముఖ్ లో ట్రెక్కింగ్ లోబో ప్లేస్ నుండి మొదలవుతుంది. అడవిలో కుద్రేముఖ్ కొండ ఇక్కడినుండి మొదలవుతుంది. ఈ ప్రదేశం సైమన్ లోబో అనే వ్యక్తికి చెందినది. దాని యాజమాన్యం ఎంతోకాలం కిందటే మారినప్పటికి అతని పేరు కొనసాగుతోంది. వివిధ కొండ మార్గాలు, నీటి వాగులు, అటవీ అందాలు కన్నులకు విందు చేస్తాయి.
ఈ ప్రాంత పర్యావరణం ఎంత మార్పు చెందినప్పటికి కుద్రేముఖ్ సందర్శన నేటికి ఎంతో ఆనందంగా ఉంటుంది. విశ్రాంతి పొందేందుకు అనుకూల ప్రదేశం. సాహస క్రీడలు చేయాలనుకునేవారికి అనువైన ప్రదేశంగా చెప్పాలి. ఒక్కసారి అటవీ శాఖ అనుమతులు తీసుకుంటే పర్యాటకులు, యాత్రికులు తమ కిష్టమైన రీతిలో తిరిగి తనివి తీరా పకృతి సహజమైన అందాలను ఆస్వాదించవచ్చు.