

మంగుళూరు పట్టణాన్ని కర్నాటక రాష్ట్రానికి ముఖద్వారంగా పేర్కొంటారు. ఎంతో సుందరమైన నగరం. ఒక పక్క అరేబియా మహాసముద్రం మరోపక్క పశ్చిమ కనుమలు ఈ నగరానికి ఎంతో వన్నె తెచ్చాయి. నగరాన్ని దేవీమాత మంగళాదేవి పేరుపై మంగుళూరు అని నామకరణం చేశారు. మంగుళూరు ఓడరేవు ఎగుమతులు, దిగుమతులతో ఎంతో సందడిగా ఉంటుంది. పోర్చుగీసు వారు, బ్రిటీష్ వారు, మైసూర్ పాలకులు హైదర్ ఆలి, టిపు సుల్తాన్ లు ఈ నగరం కొరకు యుద్ధాలు చేశారు.
నేడు ఈ మంగుళూరు నగరం వివిధ సంస్కృతుల నగరంగా విరాజిల్లుతోంది. అంతేకాక ఈ నగరం నేటికి దేశంలోని ప్రధాన ఓడరేవులలో ఒకటిగా భారతదేశంలో పండిన కాఫీ, జీడిపప్పు, ఇతర వాణిజ్య పంటలను ఇతరదేశాలకు ఎగుమతులు చేస్తోంది.
మంగుళూరు ప్రకృతి ఆస్వాదకులకు ఒక స్వర్గం నగర సహజ అందాలు ఆ నగరానికి ఎంతో శోభనిస్తాయి. ఈ నగరం నేత్రావతి మరియు గురుపుర నదుల మధ్య విస్తరించింది . అరేబియా సముద్ర తీరంలోని చక్కటి సముద్రతీరాలు, తాటిచెట్లు మరింత అందాన్ని తెచ్చాయి. ఈ సుందర నగరం పచ్చటి కొండలు, ఎర్రటి పెంకుల ఉపరిభాగం కల ఇండ్లతో కనువిందు చేస్తుంది.
మంగుళూరు నగరం వివిధ మతాల ప్రజలకు, భాషలకు నిలయం. నాలుగు భాషలు తుళు, కొంకణి, బియరీ, కన్నడ భాషలు మాట్లాడతారు. సాంప్రదాయక యక్షగానం, శ్రీక్రష్ణ జన్మాష్టమి, కరదాయ్ వేష డ్యాన్స్ మొదలైవి పేరుపొందినవి. వాస్తవానికి మంగుళూరులోని దసరా పండుగ వేడుకలు రాచరిక హంగులతో దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
మంగుళూరులో చూడవలసిన సహజ అందాలు, వారసత్వ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఉన్న మంగళాదేవి దేవాలయానికి దేశ వ్యాప్తంగా వేలాది ప్రజలు వస్తారు. ఎన్నో పురాతన దేవాలయాలు, భవనాలు కలవు. కద్రి మంజునాధ దేవాలయం, సెయింట్ అలోషియస్ ఛాపెల్, రొసారియో కేధడ్రల్, జామా మసీదు వంటివి ఎన్నో చూడదగిన ప్రదేశాలు. చక్కటి ఎండ, ఇసుక తిన్నెలు ఇష్టపడే వారికి సోమేశ్వర, తన్నీర్ బావి బీచ్ లు అనుకూలం. మంగుళూరు ఎన్నో శతాబ్దాలనుండి వేలాది పర్యాటకులను ఆకర్షిస్తోంది. నేటికి ఒక సుందర నగరంగా విరాజిల్లతోంది.