header

Mysore Town / మైసూర్ పట్టణం

Mysore Town / మైసూర్ పట్టణం
కర్నాటక రాష్ట్రానికి మైసూర్ పట్టణం సాంస్కృతిక రాజధాని. ఈ పట్టణం దక్షిణ భారతదేశంలోని ఒక సంపన్న మరియు రాచరిక ప్రాధాన్యతలు కల ఒక పట్టణం.
గంధపు చెక్కల సువాసనలు, గులాబీల గుబాళింపులు మైసూర్ పట్టణానికి గంధపు నగరం లేదా శాండల్ వుడ్ సిటీ అనే పేరు తెచ్చిపెట్టాయి. దీనినే ఐవరీ సిటీ అని, లేదా రాజప్రాసాదాల నగరం అని కూడా అంటారు. మైసూర్ లో యోగా కేంద్రాలు అధికంగా కనపడే కారణంగా దీనిని యోగా సిటీ అని కూడా పిలుస్తారు.
మైసూర్ లో నిర్వహించే అష్టాంగ యోగ కార్యక్రమాలు దేశ విదేశాలనుండి యోగా ప్రియులను ఎంతో ఆకర్షిస్తాయి.
మైసూర్ పట్టణం దేవీ భాగవతం మేరకు ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షస రాజు పాలించాడు.
కాలక్రమేణా అది మహిషూరు లేదా మైసూరుగా రూపొంది ఆంగ్లేయుల పాలనలో మైసూర్ గా స్ధిరపడింది. ఈ రాక్షసుడు ఆ ప్రాంత ప్రజలు కొలిచే దేవీ మాత చాముండిచే చంపబడతాడు. దేవీ చాముండి దేవాలయం నేటికి మైసూర్ పట్టణానికి తూర్పు దిశగా చాముండి హిల్స్ పై ఉన్నది.
అశోక చక్రవర్తి కాలంలో మైసూర్ చాలా ప్రసిద్ధి చెందినట్లు క్రీ.పూ.245 సంవత్సరాలనాటి చరిత్ర చెపుతోంది
మైసూరు యదు వంశస్ధుడైన బెట్టడ చామరాజ ఒడయార్ మైసూర్ కోటను 1584 లో నిర్మించి దానిని తన పాలనకు ప్రధాన నగరంగా చేసుకున్నాడు. తర్వాత అతడు తన రాజధానిని మైసూర్ నుండి శ్రీరంగ పట్టణానికి 1610వ సంవత్సరంలో బదలాయించాడు.
మైసూర్ పట్టణాన్ని విశాలమైన రోడ్లు, అతి పెద్ద రాజ భవనాలు, తోటలు మరియు సరస్సులు ఏర్పాటు చేయటంతో ఒక ప్రత్యేక నగరంగా చక్కటి ప్రణాళిక మేరకు రూపొందించిన ఘనత క్రిష్ణరాజ ఒడయార్ IV (1895-1940)కు దక్కుతుంది. స్ధానిక సంస్కృతి మరియు ఆకర్షణలు - మైసూర్ పట్టణాన్ని సందర్శించే పర్యాటకులు విభిన్నమైన మైసూర్ సంస్కృతికి అబ్బుర పడతారు. ఈ ప్రాంత ప్రజల సంప్రదాయాలు, కళలు, చేతిపనులు, ఆహారాలు, జీవనవిధానం ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. ఈనగరం విభిన్న మతాల, విభిన్న ప్రాంతాల, విభిన్న రంగాల ప్రజలతో కాస్మోపాలిటన్ నగరంగా ప్రసిద్ధి చెందింది. మైసూర్ వారసత్వపు భవనాలు, చారిత్రక చిహ్నాలు, ప్రాచీన దేవాలయాలు, మ్యూజియములు, సరస్సులు, గార్డెన్లు వంటివాటితో ఈ నగరం రాజ భవనాల నగరంగా ప్రసిద్ధి చెందింది.
మైసూర్ ప్యాలెస్ లేదా అంబా ప్యాలెస్ అనేది నగరంలో ఎంతో ప్రధానమైన ప్యాలెస్. దేశంలోనే ఈప్యాలెస్ ను చూడటానికి అత్యధికంగా సందర్శకులు వస్తారు. మైసూర్ జంతు ప్రదర్శనశాల, చాముండేశ్వరి దేవాలయం, మహాబలేశ్వర దేవాలయం, సెయింట్ ఫిలోమినా చర్చి, బృందావన గార్డెన్స్, జగన్మోహన ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీ, లలితా మహల్ ప్యాలెస్, జయలక్ష్మీ విలాస్ భవనం, రైల్వే మ్యూజియం, కారంజి లేక్, మరియు కుక్కర హళ్ళి సరస్సు వంటి ప్రదేశాలు మైసూర్ నగరంలో ప్రధాన ఆకర్షణలు. మైసూర్ పట్టణానికి చుట్టు పక్కల ఉన్న శ్రీరంగపట్నం, నంజన్ గూడ్, శివసముద్ర జలపాతాలు, తలకాడు, మేల్ కోటే, సోమనాధపుర, హళీబీడు, బేలూరు, బండిపుర నేషనల్ పార్క్, శ్రావణబెళగొళ మరియు కూర్గ్ గా పిలువబడే కొడగు వంటి ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు మైసూర్ కు వస్తారు.
రాంనగర్ పట్టణానికి చుట్టుపక్కల గల పర్వతాలు పర్వతారోహకులను కట్టుకొంటాయి. మైసూర్ కు దగ్గరలోనే మరికొన్ని పర్వత ప్రాంతాలంటే, సావన్ దుర్గ, కబ్బల దుర్గ, టుంకూరు, తూరహళ్ళి మరియు కనకపుర ప్రాంతాలుగా చెప్పవచ్చు. బాదామి మరియు హంపి ప్రాంతాల వద్ద గల కొండలుకూడా మైసూర్ నగరానికి వచ్చే పర్వతారోహకులను ఆకర్షిస్తాయి. బిలిజిరి రంగణ కొండలు, చిక్కమగళూరు, హాసన్, కొడగు వంటి ప్రాంతాలు ట్రెక్కింగ్ కు పేరు పొందినవి
చేపలు పట్టటంలో ఆసక్తి కలవారికి మైసూర్ పొలిమేరలలో ఉన్న కావేరీ ఫిషింగ్ క్యాంప్ బాగుంటుంది. నాగర్ హోల్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, బి.ఆర్ హిల్స్ శాంక్చురి మరియు రంగనాధతిట్టు బర్డ్ శాంక్చువరీ వంటివి పక్షుల పరిశోదకులకు ఇష్టమైన ప్రదేశాలు.
మైసూర్ నగరం దంతపు పని, పట్టు, గంధపు ఉత్పత్తులు, చెక్క బొమ్మలు, వంటివాటికి ప్రసిద్ధి. దసరా పండుగను మైసూర్ లో పది రోజులపాటు వైభవంగా .రుపుకొంటారు. మైసూర్ ప్రజలే కాక, దేశ వివిధ ప్రాంతాలనుండి ప్రజలు ఈ దసరా పండుగ సమయంలో మైసూర్ కు వచ్చి వేడుకలలో పాల్గొంటారు. మైసూర్ పట్టణం కర్నాటక రాష్ట్రానికి దక్షిణ దిశగా సముద్ర మట్టానికి షుమరు 770 మీటర్ల ఎత్తున కావేరి మరియు కాబిని నదుల మధ్య ఉంది. సందర్శకులకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.
ఈ పట్టణం బెంగుళూరుకు 140 కి.మీ. దూరంలో ఉంది. రోడ్డు, రైలు మార్గాలచే కలుపబడి ఉంది. మైసూర్ విమానాశ్రయం లేదా మందకల్లి స్ధానిక విమానాశ్రయం నుండి దేశంలోని వివిధ నగరాలకు వెళ్లవచ్చు.