

ఉడుపిలో శ్రీకృష్ణ దేవాలయం కర్నాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం. మరియు మంచి వంటకాలకు కూడా ప్రసిద్ధి. ఉడుపి పేరుతో ఉడుపి ఆహారాలు అనేకం తయారవుతాయి. ఇప్పుడు కూడా ఉడుపి హోటళ్ళు చాలా చోట్ల కనపడుతూనే ఉంటాయి. నోరూరించే ఈ శాకాహార వంటకాలను మధ్వమతం వారు తయారు చేస్తారు.వీరు శ్రీకృష్ణుడి దేవాలయానికి ఎన్నో తరాలనుండి వివిధ వంటలు తయారు చేసి నైవేద్యంగా అర్పిస్తున్నారు. ఉడుపి పట్టణం బెంగుళూరుకు 400 కిలోమీటర్లు, మంగుళూరుకు 54 కిలో మీటర్ల దూరంలో ఉంది.
ఉడుపి పట్టణం హిందువుల ఆరాధ్య దైవం శ్రీక్రిష్ణుడికి చెందినది. ఇక్కడికి దగ్గరలో ఉన్న యల్లూరులో మరో శివాలయం ఉంది. ఇది సుమారు వేయి సంవత్సరాల పురాతనమైనదని చెపుతారు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల వారు ఇక్కడ ఉడుపి శ్రీక్రిష్ణ మఠం స్ధాపించారు.
ఈ దేవాలయంలో దేవుడి నైవేద్యం కోసం ఆహార పదార్దాలు బ్రాహ్మణులచే ఎంతో నియమ నిష్టలతో తయారు చేయబడతాయి. ఈ వంటకాలు క్రమేణా ప్రసిద్ధి చెంది కర్నాటక రాష్ట్రంలోనే కాక, దేశం యావత్తూ ప్రసిద్ధి గాంచాయి. వీరు తయారు చేసే దోశలు నేటికి ఎంతో ఇష్టంగా అన్ని ప్రాంతాలలో తింటారు.
స్ధానిక చరిత్ర ప్రకారం చంద్రుడు 27 నక్షత్రాల పేర్లుగల దక్షుని కుమార్తెలను వివాహం చేసుకున్నారు. కానీ రోహిణి ఎడల ఎక్కువగా ఆకర్షితుడై మిగిలిన భార్యల యొడల నిర్లక్ష్యంతో ఉండటంవలన, దక్షుని శాపంచే చంద్రుడు వ్యాధిగ్రస్తుడై క్షీణింపసాగాడు. చంద్రుడు, అతని భార్యలు కలసి శాప విమోచనకై ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇప్పటికి ఈ లింగాన్ని ఉడుపిలో చూడవచ్చు. సంస్కృతంలో ఉడు ...అంటే భగవంతుడని, పా...అంటే నక్షత్రాలని అంటారు.
ఉడుపిలో శ్రీకృష్ణ దేవాలయం గురించి అనేక కధలున్నాయి. ఒక స్ధానిక కధ ప్రకారం 16వ శతాబ్దంలో తక్కువ కులాలకు చెందిన కనకదాస అనే భక్తుడు కృష్ణ దర్శనం కోరాడని, అయితే అతడిని దేవాలయంలోకి అనుమతివ్వలేదని దానికిగాను కనకదాస దేవాలయానికి ఉన్న చిన్న కిటికీ నుండి లోపలికి చూశాడని, అయితే అతనికి శ్రీకృష్ణుడి వీపు భాగం మాత్రం కనపడిందని, వెంటనే శ్రీకృష్ణుడి తానే ముందుకు తిరిగి అతడికి దర్శన మిచ్చాడని అంటారు.