Khajarahoo / ఖజురహో
ఖజురహో - Khajuraho మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం.
ఢిల్లీ పట్టణానికి 620 కి.మీ. దూరంలో గలదు. ఖజురహో నిర్మాణ సముదాయాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఖజురహో దేవాలయాలు, హిందూ మరియు
జైన దేవాలయాల సముదాయం. ఖజురహో పేరు సంస్కృతం భాష నుండి వచ్చినది. సంస్కృతంలో ఖజూర్ అనగా ఖర్జూరము
ఖజురహో చరిత్ర
10 నుండి 12వ శతాబ్ద కాలం వరకు భారత దేశంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్థిల్లినది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి 1050 మధ్య సుమారు నూరు
సంవత్సరాల మధ్య కాలంలో నిర్మింపబడినవి. తరువాత కాలంలో చందేల రాజధాని మహోబాకు మార్చబడినది. తరువాత మరి కొంత కాలం పాటు ఖజురాహో వెలుగొందినది.
ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారము రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 80కి పైగా హిందూ
దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి ప్రారంభంలో ఈ ప్రాంతంలో మొత్తం 85 వరకు దేవాలయాలు వుండేవి. రానురాను కాలక్రమంలో కొన్ని శిథిలమయిపోగా ఇప్పుడు కేవలం22 మాత్రమే మిగిలాయి.
అందులో హిందూ, జైన మతస్థులకు సంబంధించిన దేవాలయాలు చాలా వున్నాయి. ఉత్తర భారతంలో ఇతర దేవాలయాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీ.శ.1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు.
చాలా కాలం ఖజురహో దేవాలయాలు కనుమరుగు కాగా 19 వ శతాబ్దంలో బ్రిటీష్ వారు వీటిలో కొన్నింటిని కనుగొని వెలుగులోనికి తెచ్చారు.
ఖజురాహోలోని ముఖ్యమైన కొన్ని దేవాలయాల గురించి
లక్ష్మణ టెంపుల్
ఈ ఆలయం 930-950 మధ్యకాలంలో చండేలా అనే రాజు చేత నిర్మించబడినదని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం విష్ణుదేవుని పేరు మీదుగా నిర్మించబడినది. భూమికి సమాంతరంగా ఉన్న దూలంపై విష్ణు,
బ్రహ్మదేవుల, శివుని విగ్రహాలు ఉన్నాయి.
విశ్వనాథ్ టెంపుల్
ఈ ఆలయంలో మహాదేవుడు అయిన శివభగవానుడి విగ్రహం వుంటుంది. అలాగే శివుని వాహనం అయిన ఎద్దును కూడా ఇందులో చెక్కారు. ప్రజల మేలు కోసం శివుడు స్వయంభువుగా కొలువైవున్నాడని ఇక్కడి ప్రజల విశ్వాసం.
వామన ఆలయం
శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారం అయిన వామనుని విగ్రహం ఈ ఆలయంలో ఎంతో ఆధ్మాత్మికంగా దర్శనమిస్తుంది.
శ్రీ విష్ణువు మొట్టమొదటిసారిగా వామనావతారాన్ని దాల్చాడు. నిరాడంబరమైన శిల్పశైలితో నిర్మించిన ఈ దేవాలయం.. కొంచెం దూరంగా వేరే ప్రదేశంలో వుంటుంది. పూర్వం 1050 - 75 మధ్యకాలంలో
ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు తెలుపుతున్నాయి.
వరాహ ఆలయం
శ్రీ మహాశిష్ణువు మూడవ అవతారం అయిన వరాహుని రూపం ఈ ఆలయంలో కనబడుతుంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైంది. పూర్వం 900 - 925 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
పార్శ్వనాథ ఆలయం
ఖజూరాహోలో వున్న ఆలయాలన్నింటిలో ఈ పార్శ్వనాథ ఆలయం ఎంతో పెద్దది. ఇందులో ఒక ప్రత్యేకత కూడా వుంది. ఈ దేవాలయానికి మూడు మిద్దెలు వుంటాయి. వీటి నిర్మాణాలు హిందూ, ముస్లిం,
బౌద్ధ స్వభావాలను తెలిపే శిల్పాలుగా మలచ వుంటాయి.
కందారియ మహాదేవ ఆలయం
భారతదేశంలో వుండే శిల్ప కళలన్నీ ఈ ఆలయంలో ఎంతో అద్భుతంగా దర్శనమిస్తాయి. ఆలయానికి నలువైపులా వుండే అనేక శిల్పాలు చాలా అందంగా కనిపిస్తాయి.
దుల్హాదియో ఆలయం
ఈ ఆలయం నలువైపులా కూడా ఇంద్రలోకంలో వుండే నాట్యమణులు రంభ, ఊర్వశి, మేనక లాంటి అందమైన అప్సరసల శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఈ ఆలయంలో మహాదేవుని శివలింగం వుంటుంది.
చిత్రగుప్త దేవాలయం
యమలోకంలో అందరి పాపాల చిట్టాలను వ్రాసే చిత్రగుప్తుని ఆలయం ఎంతో అందంగా, ఆధ్యాత్మికంగా ఇక్కడ కొలువైవుంది. ఈ ఆలయం సూర్యభగవానుడికి అంకితంగా, తూర్పు ముఖంవైపు నిర్మించబడింది.
చతుర్భుజ ఆలయం
ఖజూరాహోలో వున్న శిల్పకళకు ఈ చతుర్భుజ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో కామ సౌందర్యాల శిల్పాలతోపాటు, 9 అడుగుల ఎత్తులో వున్న విష్ణువు విగ్రహం కూడా కొలువై వుంది.
ఆదినాధ్ జైన్ టెంపుల్
జైన మతస్థులవారికి ఈ ఆలయం ఎంతో ఆధ్యాత్మికమైనది. దీనిని చూడడానికి దేశవిదేశాల నుంచి చాలామంది జైన మతస్థులతో పాటు హిందువులు కూడా వస్తుంటారు. దీని చుట్టూ శిల్పాలతో ఎంతో అందంగా ఉంటాయి.
ఖుజరాహో దేవాలయాలు ఎంతో అద్భుతమైన శైలిలో మలచబడి మన పూర్వికుల జీవనశైలిని, వారి ఆచారాలను, సంస్కృతీ - సంప్రదాయాలను నేటి తరం వారి తెలియపరుస్తుంది.