అరేబియా సముద్రంలో దుర్భిణీ వేసి వెతికితే తప్ప కనిపించని ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది... అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం ‘పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ’ కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు. కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ మన జాతీయ జెండా ఎగురవేయడంతో ఇండియాలో భాగమేనని ఖరారయ్యాయి ఈ దీవులు. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం.
కేరళ తీరానికి సుమారు 250 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది.
విమానంలో... లక్షద్వీప్కు దగ్గరగా ఉన్న తీరం కేరళలోని కొచ్చి నగరం. కొచ్చి నుంచి అగట్టి దీవికి ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్లు ఉంటాయి.
రైలు మార్గం... కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి విమానం లేదా షిప్లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది.
లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది. ‘ఎం.వి. టిప్పు సుల్తాన్, ఎం.వి. భరత్సీమ, ఎం.వి. ఆమినిదీవి, ఎం.వి. మినికోయ్’ అనే నాలుగు క్రూయిజ్లున్నాయి. వీటిలో ప్రయాణానికి లక్షద్వీప్ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎయిర్కండిషన్ క్రూయిజ్లే.
సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్ట్ హౌస్ల నుంచి ఐదు వేలు చార్జ్ చేసే రిసార్టుల వరకు ఉన్నాయి.
ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. కేరళ నుంచి టిన్డ్ ఫుడ్ వస్తుంది.