గ్వాలియర్ లో చరిత్ర మరియు ఆధునికత రెండూ కలసి వుంటాయి. చారిత్రాత్మక స్మారకాలు, కోటలు, మ్యూజియంలు ఉండటమే కాక, పారిశ్రామిక నగరంగా కూడా పేరుపొందింది.
గ్వాలియర్ లోనే మొదటగా 1857లో మరాఠా తెగకు చెందినా రాణి ఝాన్సి దేవి బ్రిటిష్ వారిపై విప్లవం తెచ్చి పోరాటం చేసింది.
గ్వాలియర్ కోట, ఫూల్ బాగ్, సూరజ్ కుండ్, హాతి పూల్, మాన్ మందిర్ పాలస్, జై విలాస్ మహల్, మొదలైనవి గ్వాలియర్ లో చూడవలసినవి. భారతీయ గొప్ప సంగీతకారుడైన తాన్ సేన్ జన్మస్థలం గ్వాలియర్. ఇక్కడ ప్రతి సంవత్సరం తాన్ సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. సంగీతంలో ఘరానా శైలి గ్వాలియర్ పేరుపై వచ్చింది. ఈ ప్రదేశం సిక్కులకు, జైనులకు ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం.
గ్వాలియర్ ప్రయాణం ?
విమాన, రైలు, రోడ్డు మార్గాలలో గ్వాలియర్ చేరవచ్చు. గ్వాలియర్ సందర్శనకు వింటర్ అనుకూల సమయం.
ఈ కోటను ఎప్పుడు నిర్మించారో ఆధారాలు లేవు. ఆరో శతాబ్దం నాటికి ఇది ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వింధ్య పర్వతశ్రేణుల్లోని ఇసుకరాతితో నిర్మితమైనది. ఈ కోటను చూసి ‘హిందూస్తాన్ కోటల హారంలో ఇది మణిపూస వంటిది’ అని బాబర్ వ్యాఖ్యానించాడు. ఐదు అంతస్తులతో నిర్మితమైన ఈ కోటలో మూడు భూగర్భంలోనూ రెండు నేలమీద ఉన్నాయి. భూగర్భ అంతస్తులోకి గాలీవెలుతురూ దారాళంగా వచ్చేలా నిర్మించారు. అప్పట్లోనే అంతస్తుల మధ్య పరస్పర సమాచార మార్పిడికోసం ఇంటర్‌కమ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం విశేషం. గోడల్లో కనిపించకుండా ఏర్పాటుచేసిన గొట్టాల ద్వారా సంభాషించుకునేవారట. 11వ శతాబ్దం నుంచి ఇది పలువురి దురాక్రమణలకు గురయింది. 1568లో అక్బరు ఈ కోటను స్వాధీనం చేసుకుని రాజకీయ శత్రువులను ఉరితీసే ప్రదేశంగా ఉపయోగించబడింది.
తరవాత ఈ కోట గోహాద్ రాణాలూ మరాఠాలూ బ్రిటిషర్ల చేతులుమారి చివరకు సింధియాలకు దక్కింది. ఇందులో మాన్‌సింగ్ నిర్మించిన మన్ మందిర్ నిర్మాణశైలి చూడ్డానికి ఎంతో బాగుంది. కోటలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా సంగీతమహల్ వస్తుంది. దీనిపక్కనే నృత్యమందిర్ ఉంది. అందులో గోడలకు అద్దాలు తాపడం చేసి ఉండేవి. దీపాల వెలుగులో ఆ అద్దాలతోబాటు కళాకారుల దుస్తుల పైన కుట్టిన అద్దాలమీదా ఆ దీపకాంతి ప్రతిబింబించి మందిరమంతా వెలుగులతో నిండిపోయేదట. ఇందులోనే ఓ పక్కన గ్రంథాలయం ఉంది. భూగర్భంలో జలక్రీడలకోసం నీటికొలను ఉంది.
గ్వాలియర్ కోటలో సింధియాల జై విలాస్ ప్యాలెస్ చూడదగ్గది. 1874 సంవత్సరంలోనే దీన్ని నిర్మించటానికి కోటి రూపాయల ఖర్చు అయందంటారు. దీని విలువ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక్కడ ప్రధానంగా చూడదగ్గది అతిపెద్ద భోజనాల బల్ల. దీనిమీద ఓ చిన్న వెండి రైలు తిరుగుతూ అతిథులకి కావలసిన బ్రాందీ, విస్కీ... వంటి పానీయాలూ సిగరెట్లూ సిగార్లూ అందజేస్తూ ఉంటుంది. తమకు కావలసినవి ఉన్న పెట్టె తమ ముందుకు వచ్చినప్పుడు ఎవరికి వారు తీసుకుంటారట.
రెండోది దర్బార్ హాలు. ఇందులో 250 బల్బులు ఉన్న రెండు షాండియర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇవి అతిపెద్ద క్రిస్టల్ షాండ్లియర్లు. దర్బార్ హాల్లో పరిచిన తివాచీ ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందింది. గోడలకీ కప్పుకీ వేసిన పూలూ లతల డిజైన్ల తాపడానికీ దాదాపు రెండు క్వింటాళ్ల బంగారం వినియోగించబడిందంటారు. ఇంకా ఈ భవనంలో అప్పట్లో రాజకుటుంబీకుల జీవనవిధానాన్ని తెలియజేసే వస్తువులతో కూడిన ప్రదర్శనశాల ఉంది.