header

Madhyapradesh Tourism / మధ్యప్రదేశ్ పర్యాటకం

Madhyapradesh Tourism / మధ్యప్రదేశ్ పర్యాటకం

వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్యప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి.
వివిధ రాజుల పాలన వల్ల విభిన్న కళా, నిర్మాణ శైలులు ఏర్సడ్డాయి. ఖజురహో లోని అద్భుతమైన శృంగార శిల్పాలు, రాజసం వుట్టిపడే గ్వాలియర్ కోట, ఉజ్జయినిలోని దేవాలయాలు, ఒర్చ్చా లోని చిత్రకూట్ లేదా చట్ట్రిస్ – అన్నీ అద్భుత నిర్మాణాలకు ప్రతీకలే.
ఖజురహో, సంచి, భీమ్ బెట్కా లను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా ప్రకటించింది. మధ్య ప్రదేశ్ లోని గిరిజన సంస్కృతి ఇక్కడి పర్యాటకంలో ప్రధాన భాగం. గోండ్ లు, భిల్లులు, ఇక్కడ నివసించే ప్రధాన జాతులు. గిరిజన హస్త కళాకృతులు ఇక్కడి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం దేశ కళా వారసత్వానికి పట్టుగొమ్మలు.
వన్య ప్రాణులు –
మధ్య ప్రదేశ్ లో ప్రేరణ కలిగించే అంశం.వింధ్య, సాత్పురా పర్వతాలు, పచ్చటి అడవులు చాలా జీవజాతులకు ఆలవాలం. వన్య ప్రాణి అభయారణ్యాలు, వన్యప్రాణి జాతీయ పార్కులు కూడా మధ్య ప్రదేశ్ పర్యాటకంలోని ప్రధాన ఆకర్షణలు.
బాంధవ్ ఘర్ జాతీయ పార్కు, పెంచ్ జాతీయ పార్కు, వన్ విహార్ జాతీయ పార్కు, కాన్హా జాతీయ పార్కు, సాత్పురా జాతీయ పార్కు, మాధవ్ జాతీయ పార్కు, పన్నా జాతీయ పార్కు మధ్య ప్రదేశ్ లోని కొన్ని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు. ఈ కేంద్రాల్లో చాలా జాతులకు చెందిన పక్షులు, జంతువులూ, మొక్కలూ చూడవచ్చు. నీముచ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యం కూడా వన్యప్రాణి నిలయమే.
మధ్య ప్రదేశ్ లోని విభిన్న వంటకాలు, పండుగలు మధ్యప్రదేశ్ పర్యాటకానికి కీలకమైనవి. ఆహారంలో ప్రధానంగా రాజస్థానీ, గుజరాతీ వంటకాలను ఆస్వాదించవచ్చు. సీఖ్, షాహీ కబాబ్ లాంటి రాచరికపు వంటకాలకు రాజధాని భోపాల్ ప్రసిద్ది. జిలేబీ, జీడిపప్పు బర్ఫీ లైతే మధ్య ప్రదేశ్ లోని అన్ని నగరాల్లో ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరుకుతాయి. అయితే రాష్ట్రంలోని వివిధ భాగాలలో ఆహారపు అలవాట్లలో తేడా వుంది.
ఖజురహో లోని ఖజురహో నృత్యోత్సవం, గ్వాలియర్ లో జరిగే తాన్సేన్ సంగీత ఉత్సవం ప్రపంచ ప్రసిద్ది పొందాయి. మడాయి పండుగ, భాగోరియా పండుగ గిరిజన తెగలు జరుపుకునే సుప్రసిద్ధ గిరిజన పండుగలు.