header

Madhyapradesh Tourism / మధ్యప్రదేశ్ పర్యాటకం, పచ్ మఢీ

Pachmadi / పచ్ మఢీ
నలువైపులా విస్తరించిన ఎత్తయిన కొండలు... కొండల నడుమ లోతైన లోయలు... దట్టమైన అడవులు... అడవుల్లో యథేచ్ఛగా సంచరించే వన్యప్రాణాలు... కొండల పైనుంచి ఉధృత వేగంతో నేలపైకి ఉరకలు వేసే జలపాతాలు... సహజ సరోవరాలు... కొండ గుహలలో ప్రాచీన మానవులు చిత్రించిన చిత్రాలు... ఎటు చూసినా ప్రకృతి గీసిన సజీవ చిత్రాల్లాంటి దృశ్యాలను ఒకే చోట ....... పచ్ మఢీలో
దేశానికి నడిబొడ్డున సత్పురా పర్వతాల నడుమ వెలసిన అద్భుత ప్రదేశం పచ్ మఢీ . మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇది సైనిక స్థావరంగా ఉండేది. పచ్మఢీకి ఈ పేరు ‘పాంచ్’ (ఐదు), ‘మఢీ’ (గుహలు) అనే అర్థంలో వచ్చిందని చెబుతారు. ‘పాంచ్మఢీ’ కాలక్రమంలో పచ్ మఢీ గా మారిందని అంటారు. సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్న పచ్ మఢీ వాతావరణం వేసవిలోనూ చల్లగానే ఉంటుంది. వేసవిలో జూన్ నెలాఖరు వరకు ఈ ప్రాంతంలోని వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.
పంచ పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడి ఐదు గుహలలో ఉండేవారని ప్రతీతి. ఇక్కడి జలపాతాల దిగువన ఏర్పడిన కొలనును ‘ద్రౌపదీ కుండం/పాంచాలీ కుండం’ అంటారు. మహాభారత గాథతో ముడిపడిన ఈ ప్రదేశాలను పచ్మఢీకి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు.
సత్పురా పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరం ‘ధూప్గఢ్’ ఇక్కడే ఉంది. ఈ శిఖరం పైనుంచి చూస్తే పచ్మఢీ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, లోయలు కనువిందు చేస్తాయి. పర్వతారోహణపై మక్కువ గలవారిని ఈ శిఖరం ఎంతో ఆకట్టుకుంటుంది.
సత్పురా పర్వతశ్రేణుల్లో ఎక్కడికక్కడ కనిపించే జలపాతాలు పచ్ మఢీ లోనూ చాలానే కనిపిస్తాయి. పచ్మఢీ కొండల మీదుగా దూకే బీ, డచెస్, రజత్ ప్రపాత్, అప్సరా జలపాతాల అందాలను చూసి తీరాల్సిందే. వేసవిలో ఈ జలపాతాల వద్ద పర్యాటకులు జలకాలాడటానికి ఇష్టపడతారు.
ధూప్గఢ్ శిఖరానికి దిగువన చేరిన జలపాతాల నీటితో సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు బోటింగ్కు అనువుగా ఉంటుంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.
పచ్ మఢీలో చుట్టూ విస్తరించుకున్న సత్పురా జాతీయ అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, మొక్కలు, లతలు, వన్యప్రాణులు కనిపిస్తాయి. ‘ఇండియన్ జెయింట్ స్క్విర్రల్’గా పిలుచుకునే భారీ ఉడుతలు, పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, కణుజులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఈ అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఈ అడవిలో పాములు కూడా విరివిగానే కనిపిస్తాయి. సత్పురా అభయారణ్యంలో సఫారీ థ్రిల్లింగ్గా ఉంటుంది.
పురాతన నేపథ్యం గల పచ్మఢీ పరిసరాల్లో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో జటాశంకర్ గుహలో వెలసిన శైవక్షేత్రం భక్తులను ఆకట్టుకుంటుంది. అలాగే, చౌరాగఢ్ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇవే కాకుండా, బాబా మహాదేవ్, గుప్త్ మహాదేవ్ వంటి పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా సందర్శకులకు చక్కని అనుభూతిని ఇస్తాయి.
పచ్ మఢీ సమీపంలోని భీమ్బెట్కా, బాఘ్, ఉదయగిరి గుహలలో గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. చరిత్ర పూర్వయుగానికి చెందినవిగా భావిస్తున్న ఈ చిత్రాలు కనీసం పదివేల ఏళ్ల నాటివని పరిశోధకులు తేల్చారు.
షాపింగ్ .....
పచ్ మఢీలో అడవులు స్వచ్ఛమైన తేనెకు పెట్టింది పేరు. ఇక్కడి గిరిజనులు సేకరించిన తేనె పచ్మఢీ దుకాణాల్లో చౌకగా దొరుకుతుంది.
బస్తర్ ప్రాంత గిరిజనులు తయారు చేసిన హస్తకళాకృతులు, వెదురు బుట్టలు, గిరిజన చిత్రకారులు తీర్చిదిద్దిన సంప్రదాయ చిత్రాల పెయింటింగ్స్ ఇక్కడ విరివిగా దొరుకుతాయి.
సత్పురా అడవుల్లో లభించే పలు ఆయుర్వేద వనమూలికలు, అటవీ ఉత్పత్తులు కూడా పచ్మఢీ దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి.
నగరాల్లోని కృత్రిమ జలవిహారాల్లోని జలకాలాటల కంటే, వేసవిలో పచ్మఢీ పరిసరాల్లోని జలపాతాల్లో జలకాలాటలు గొప్ప అనుభూతినిస్తాయి.
పచ్మఢీ పరిసరాల్లో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంచక్కా వనవిహారం చేయవచ్చు.
ట్రెక్కింగ్పై ఆసక్తి గలవారు ఇక్కడి కొండ శిఖరాలను అధిరోహించి, అక్కడి నుంచి కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు.
ఇక్కడి సహజసిద్ధమైన కొలనులు, సరస్సుల్లో పడవ ప్రయాణం ఆహ్లాదభరితంగా ఉంటుంది.
సత్పురా అభయారణ్యంలో సఫారీ అద్భుతంగా ఉంటుంది. స్వేచ్ఛగా సంచరించే పులులు, చిరుతలు వంటి భారీ జంతువులతో పాటు ఉడుతలు, కుందేళ్లు వంటి చిన్న చిన్న జంతువులను, రక రకాల పక్షులను ఇక్కడ దగ్గరగా తిలకించవచ్చు.
వెండి జిలుగులు
పచ్ మఢీలో చుట్టుపక్కల సుందరమైన జలపాతాలు ఉన్నాయి. అందులో రజత్ ప్రతాప్ జలపాతం ప్రధానమైనది. 351 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందికి దూకుతుంది. ఈ జలపాతంలో నీళ్లు వెండి వెలుగులు జిలుగుతాయి. దీనిని సిల్వర్ ఫాల్ అని కూడా అంటారు. జలపాతం కింద ప్రవాహం తక్కువే! పిల్లలు, పెద్దలు జలకాలాడేందుకు అనుకూలంగా ఉంటుంది. పచ్మఢీ అరణ్యంలో సాల వృక్షాలు, రావి, జువ్వి, వెదురు చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ అడవి గుండా ప్రవహించే రజిత జలపాతం నీళ్లు ఎంతో స్వచ్ఛంగా, మరెన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
సాత్పురా కీ రాణి
పచ్ మఢీలో ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలోనూ బ్రిటిష్ అధికారి ఫార్సిథ్ జేమ్స్ కీలక పాత్ర పోషించాడు. ఉన్నతాధికారులను ఒప్పించి పచ్మఢీని వేసవి విడిదిగా తీర్చిదిద్దాడు. సాత్పురా పర్వత శ్రేణుల్లోని కొండలు, జలపాతాలు, అడవుల వివరాలతో ‘ద హైల్యాండ్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా’ అనే పుస్తకం కూడా రాశాడు జేమ్స్. అందులో పచ్మఢీని ‘క్వీన్ ఆఫ్ సాత్పురా’ (సాత్పురా కీ రాణి) అని అభివర్ణించాడు. పచ్మఢీని ఆయన తొలిసారిగా గుర్తించిన ప్రదేశాన్ని ఫార్సిథ్ పాయింట్గా పిలుస్తారు. 1964లో ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి విచ్చేశారు. అప్పటి నుంచి దీనిని ‘ప్రియదర్శిని వ్యూ పాయింట్’ అని కూడా పిలుస్తున్నారు.
అప్సర విహార్
అప్సర విహార్ జలపాతంలో కేరింతలు కొట్టకుండా పచ్మఢీ విహారం పూర్తవ్వదు. దాదాపు 35 అడుగుల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటాయి. రజిత జలపాతం నుంచి ప్రవహించే నీరే అప్సర విహార్లో కనువిందు చేస్తాయి. పాండవ గుహలకు ఈ జలపాతం కూత వేటు దూరంలో ఉంటుంది. భస్మాసురుణ్ని సంహరించిన తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈ జలపాతంలో స్నానం చేశాడట. అందుకే అప్సర విహార్ను మోహినీ జలపాతం అని కూడా పిలుస్తారు. జలపాతం అందాలే కాదు.. చుట్టూ ప్రకృతి కూడా సమ్మోహనపరిచే విధంగా ఉంటుంది.
బీ ఫాల్
పచ్ మఢీలో అందరినీ ఆకట్టుకునే మరో జలపాతం బీ ఫాల్. దీనిని జమునా ప్రతాప్ జలపాతం అంటారు. 150 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలు కొండ మీదుగా జలప్రవాహం కొనసాగుతుంది. పర్యాటకులు జలకాలాడేందుకు వీలుగా ఉంటుంది బీ ఫాల్. ఈ జలపాతం నుంచే పచ్మఢీవాసులకు తాగునీరు సరఫరా అవుతుంది.
మహాదేవ శంకర..
పాండవ గుహలకు సమీపంలోని మరో గుహలో శివాలయం ఉంటుంది. దీనిని జటాశంకర గుహ అని పిలుస్తారు. భస్మాసురుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరమ శివుడు ఈ గుహలోకి వచ్చి దాక్కున్నాడని స్థల పురాణం. గర్భాలయంలో సహజ సిద్ధంగా ఏర్పడిన 108 శివలింగాలు కనిపిస్తాయి. గుహలో గుప్త గంగ అనే కుండం కూడా ఉంది. అతి పురాతమైన ఈ ఆలయంలో ఏటా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పాండవ గుహలకు కొంత దూరంలో మహాదేవ కొండ ఉంటుంది. కొండపై అరవై అడుగుల పొడవున్న గుహ ఉంది. దీనిని బడే మహదేవ్ గుహ అని పిలుస్తారు. విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి ఇక్కడే సంహరించారని చెబుతారు. గుహలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యలో జలకుండం ఉంది. ఇందులోని జలాలు శివలింగాన్ని నిరంతరం అభిషేకిస్తుంటాయి.
రాజేంద్రగిరి
పచ్మఢీలో ఉన్న ప్రముఖ వ్యూపాయింట్లలో రాజేంద్రగిరి ఒకటి. ఇది సముద్రమట్టానికి మూడున్నరవేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సూర్యాస్తమయాన్ని చూసేందుకు ఈ కొండపైకి వస్తుంటారు. ఇక్కడే అందమైన ఉద్యానవనం కూడా ఉంది. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దీనిని సందర్శించడంతో.. ఈ కొండకు రాజేంద్రగిరి అని పేరు పెట్టారు. ఆనాడు రాష్ట్రపతి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమై చరిత్రకు సాక్షిగా కనిపిస్తుంది. ఈ గిరిపైనే విడిది కేంద్రమైన రవిశంకర్ భవనం ఉంటుంది.
దూప్గఢ్
సాత్పుర పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశం దూప్గఢ్ వ్యూ పాయింట్. 4,430 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతమంతా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయం కూడా చూడవచ్చు. పచ్మఢీలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి.
ఎప్పుడు వెళ్లవచ్చు
దట్టమైన అడవిలో ఉన్న పచ్మఢీకి వేసవి విడిదిగా పేరుంది. ఈ సమయంలో ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33-35 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. వేసవిలో (ఏప్రిల్- జూన్) పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. నవంబర్-ఫిబ్రవరి వరకు శీతాకాల విహార కేంద్రంగానూ దీనికి మంచి పేరుంది.
వసతి సౌకర్యం: పచ్మఢీలో రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. బడ్జెట్ హోటల్స్ మొదలు రిసార్ట్స్ వరకు అన్ని రకాల ఆతిథ్యం లభిస్తుందిక్కడ. గదుల అద్దె రూ.1,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. దక్షిణాది ఆహారం దొరకడం కష్టమే. ఉత్తరాది వంటకాలు, చైనీస్ రుచులు అన్ని రెస్టారెంట్లలో లభిస్తాయి. ఎలా వెళ్లాలి?
విమానంలో రావాలనుకుంటే దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు విమానాలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి పచ్మఢీకి రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది.
పచ్మఢీకి 47 కిలోమీటర్ల దూరంలోని పిపారియా వరకు దేశంలోని అన్ని మార్గాల నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. పిపారియా నుంచి బస్సు లేదా ట్యాక్సీలో పచ్మఢీకి చేరుకోవచ్చు.
మధ్యప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుంచి పచ్మఢీకి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.