india tour header

Rajasthan Tourism

రాజస్ధాన్ వాతావరణం
ఇక్కడి వర్షాకాలంలో తప్పించి మిగిలిన కాలాలలో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. వేసవి అత్యధిక వేడి కలిగి ఉంటుంది. ఉష్ణగోగ్రతలో అత్యధికంగా 48 డిగ్రీలవరకు కూడా చేరతాయి. ఈ కాలంలో హిల్ స్టేషన్ అయిన మౌంట్ అబు ప్రదేశంలో మాత్రం ఆహ్లాదంగా ఉంటుంది.
రాజస్ధానీయులు భాష....
ఇక్కడి ప్రజలు అత్యధికంగా రాజస్ధానీ భాష మాట్లాడుకున్నప్పటికి హింది మరియు ఇంగ్లీష్ భాషలను కూడా ఉపయోగిస్తారు. కొంతమంది ముసలివారు సింధి భాష మాట్లాడటం కూడా గమనించవచ్చు.
రంగుల సంస్కృతి మరియు రుచికర వంటకాలు
రాజస్ధాన్ పేరు చెపితే చాలు ఆ ప్రదేశ అందాలే కాక, అక్కడి రుచికర వంటకాలు కూడా గుర్తుకు వస్తాయి. రాజస్ధాన్ రాష్ట్రం సంస్కృతి సాంప్రదాయల పరంగా ఎంతో పేరుగాంచింది. స్ధానిక రాజస్ధానీయులు, వివిధ రకాల నాట్యాలు, సంగీతాలు చేస్తారు. రాజస్ధాన్ లో అందమైన కళా వస్తువులు కూడా లభిస్తాయి. సాంప్రదాయ దుస్తులు అద్దాలు కుట్టబడి వివిధ రంగులలో ఆకర్షణీయంగా ఉంటాయి. దుస్తులు చూస్తే చాలు అవి రాజస్ధాన్ తయారీ అని చెప్పేయవచ్చు. మొత్తంగా చెప్పాలంటే, కళా ప్రియులందరకు రాజస్ధాన్ రాష్ట్రం ఒక స్వర్గంలా ఉంటుంది. ఈ రాష్ట్రంలో జరుపుకునే ప్రధాన పండుగలు హోళి, తీజ్, దీపావళి, దేవ్ నారాయణ జయంతి, సంక్రాంతి మరియు జన్మాష్టమి. సంవత్సరానికొకసారి రాజస్ధాని ఎడారి పండుగ, ఒంటెల జాతర, మరియు పశువుల జాతరల వంటివి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. రాజస్ధాని వంటకాలు సాధారణంగా కొంచెం పొడిగా ఉంటాయి. కారణం...అక్కడ నీరు తక్కువగా ఉండటం మరియు తాజా కూరలు ఉండకపోవటం. అయినప్పటికి అవి మీకు నోరూరిస్తాయి. సాంప్రదాయక వంటలు అంటే దాల్ బాతి, బెయిల్ గట్టే, రాబ్ది, బజరే కి రోటి లేదా మిల్లెట్ బ్రెడ్ మరియు లాషుం కి చట్నీ, మావా కచోరి మరియు బికనీర్ రసగుల్లాలు. ఈ ప్రదేశానికి వస్తే, ఈ వంటకాలు తప్పక రుచి చూడాలి.
రాజస్ధాన్ ఈ క్రింది ప్రదేశాలు చూడదగ్గవి
రాజస్ధాన్ భౌగోళికతలు, వాతావరణం సంస్కృతుల గురించి చెప్పాం కనుక, ఇక ఇపుడు ఈ రాచరికపు రాష్ట్రంలో ఎక్కడ విహరించాలనేది చూద్దాం. చాలావరకు రాజస్ధాన్ లోని ప్రతి ప్రదేశం అందంగాను, రాచరిక ఠీవితోను ఉంటుంది. అందరికి బాగా తెలిసిన జైపూర్, జోధ్ పూర్, ఉదయపూర్ మరియు జైసల్మేర్ లు తప్పక చూడదగినవి. ఈ పట్టణాలే కాక బన్సవారా, కోట, భరత్ పూర్, బుండి, విరాట్ నగర్, సరిస్క మరియు షేఖ్ వతి వంటి పట్టణాలు కూడా పర్యాటకులకు ఆకర్షణలు అందిస్తాయి.
వన్య జీవులపట్ల ఆసక్తి కలవారికి రాష్ట్రంలోని రత్నంబోర్ నేషనల్ పార్క్, సరిస్కా టైగర్ రిజర్వ్, దర్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు కుంభాల్ ఘర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, అనేక హిందు మరియు జైన దేవాలయాలు, ఇంకా ఇతర పవిత్ర ప్రదేశాలు కూడా కలవు. చారిత్రక ప్రియులకు, పురాతన సంస్కృతి పట్ల ఆసక్తి కలవారికి రాజస్ధాన్ లోని ప్రతి ప్యాలెస్, హవేలి మరియు కోట, శిల్పకళా నైపుణ్యతలు కన్నుల పండుగగా ఉంటాయి.