అయోధ్య సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన శ్రీ రాముడి జన్మస్థలం కూడా. రామాయణం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన అయోధ్య రఘు వంశీకుల యొక్క రాజధాని.
హిందూమతంతో పాటు అయోధ్యలో బౌద్ధమతం, జైనమతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరు లలో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్ దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు.
అయోధ్య అనగానే శ్రీరాముడు గుర్తుకు వస్తాడు. కానీ భారతీయుల దురదృష్టం కొద్దీ 1527లో శ్రీ రాముడి జన్మ స్థలంగా పరిగణించబడిన ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి బాబ్రీ మసీదును నిర్మించాడు. 1992లో ఈ మసీదు కొందరి చేత కూలగొట్టబడింది. ఆ తరువాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.
శ్రీ రాముడి కుమారుడు కుశుడి చేత నిర్మించబడిన నాగేశ్వరనాథ్ ఆలయం మరియు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. తులసీదాస్ యొక్క జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం చేత నిర్మించబడిన తులసీ స్మారాక్ భవన్ ఇక్కడే ఉంది.
బంగారపు కిరీటాలు ధరించిన సీతారాముల చిత్రాలని కనక భవన్ లో గమనించవచ్చు. హనుమాన్ గర్హి అనే భారీ నిర్మాణాన్ని కూడా చూడవచ్చు. శ్రీ రాముడి తండ్రికి చెందిన దశరధ భవన్ ని ఇక్కడ చూడవచ్చు. ట్రేటా కే ఠాకూర్ అనే ప్రదేశం లోనే శ్రీ రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని అంటారు.
రామ జన్మభూమి ఆలయానికి సమీపంలో సీతాకి రసోయి ఉంది. శ్రీ రాముడితో వివాహం తరువాత సీతాదేవి మొట్ట మొదటి సారి ఇక్కడే వంట చేసిందని అంటారు. సరయు నది వద్ద ఉన్న రామ్ కి పైది అనే స్నానపు ఘాట్ ఉంది. ఆ తరువాత, మని పర్బాత్ అనే బౌద్ధుల విహార ప్రదేశంకూడా ఇక్కడే ఉంది. ఆ తరువాత ఇది హిందువుల ఆలయంగా మార్చారు.