ఆగ్రాకు 37 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ కోట ఉంది. అక్బర్ కాలంలో, సిక్రీ గ్రామంలో షేక్ సలీం చిస్తీ అనే బాబా ఉండేవాడు. గుజరాత్ దండయాత్ర చేసి విజయానందంతో తిరిగి వస్తున్న అక్బర్ ఆ గ్రామంలో మజిలీ చేసి, బాబా ఆశీస్సులు పొందుతాడు. ఆ కారణంగానే జోధాబాయికి పుట్టిన కుమారుడికి సలీం అని పేరు పెట్టాడు. అతనే జహంగీర్ అక్బర్ అక్కడ ఫతేబాద్ నిర్మించాడు. అదే ఫతేపూర్ సిక్రీ.
దాదాపు మూడు కిలోమీటర్ల పొడవూ కిలోమీటరు వెడల్పులతో మూడువైపులా 50 అడుగుల ప్రహరీ, ఒకవైపు కృత్రిమ సరస్సుతో నగరం అద్భుతంగా నిర్మించబడింది. నగరం లోపలికి రావడానికి ఏడు అతిపెద్ద దర్వాజాలు ఉన్నాయి. ఆగ్రా గేటు ద్వారా లోపలికి ప్రవేశించగానే నౌబత్ ఖానా భవనం నుంచి చక్రవర్తి రాకపోకలకు అనుగుణంగా సంగీతం వినిపించేవారట. దీనికి తూర్పుదిశగా టంకశాల ఉంది. ఇది శిథిలావస్థలో ఉంది.
ఫతేపూర్ సిక్రీ రాజభవనాలకు ప్రవేశ ద్వారంగా ఉన్నదే బులంద్ దర్వాజ. దీన్ని దక్షిణ భారతం విజయాలను పురస్కరించుకుని నిర్మించాడట. 176 అడుగుల ఎత్తున్న ఈ ద్వారం ప్రపంచంలోని అతిపెద్ద దర్వాజాల్లో ఒకటిగా పేరొందింది. దీన్నుంచి లోపలకు వెళ్లగానే సూఫీ మతబోధకుడైన సలీం చిస్తీ సమాధి ఉన్న పాలరాతి కట్టడం కనిపిస్తుంది. తరవాత అక్బరు ప్రజాదర్బారు నిర్వహించిన భవనానం ఉంది. అక్బర్ చదరంగం ఆడిన చోటు కూడా ఇక్కడే ఉంది. గళ్లలో పావులకు బదులు మనుషులను నిలబెట్టి ఆడేవారట. దివాన్-ఎ-ఆమ్ వెనక వైపున ఉన్న భవనాలను ఖాస్ మహల్‌గా పిలుస్తారు. ఇవన్నీ రాజూ, రాణిలకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసినవి. దీనికి మధ్యలో అక్బర్‌కోసం నిర్మించిన పడకగదిలో మధ్యలో నాలుగైదు అడుగుల ఎత్తులో మంచె నిర్మించి ఉంది. పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. నలువైపులా పొడవాటి నీటితొట్టెల ఏర్పాటు ఉంది. అందులో సుగంధద్రవ్యాలను కలిపేవారట. ఇక్కడే రాణుల కోసం విడివిడిగా భవనాలూ వంటగదీ స్నానపుగదులూ ఉన్నాయి. జోధాబాయి భవనం అలంకరణ హిందూ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది.
వేసవి కాలంలో ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు భవన సముదాయం మధ్యలో నీటి సరస్సులను ఏర్పాటుచేయడం వీరి ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చు తునక. అందులోభాగంగానే ఖాస్‌మహల్ ప్రాంతంలో చార్ చమన్ పేరిట ఓ నీటి సరస్సును ఏర్పాటుచేశారు. సరస్సు మధ్యలోకి రావడానికి నలువైపుల నుంచీ దారులు ఉన్నాయి. మధ్యలో ఓ వేదిక ఉంది. తాన్‌సేన్ ఈ వేదికమీద కూర్చునే రాజకుటుంబీకులను సంగీత రసాంబుధిలో ఓలలాడించేవాడట.
ఫతేపూర్ సిక్రీ కోట యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాల జాబితాలో ఉంది.