మండే వేసవిలో మంచులాంటి చల్లదనం......
సెలవుల్లో ఉల్లాసాన్ని కలిగించే వినోదం...
డార్జిలింగ్ - పశ్చిమ బెంగాల్ వెళ్లాలి.
డార్జిలింగ్ వెళ్లగానే మొదట చూడాల్సింది కాంచన్జంగా పర్వతాన్ని. ఇది ప్రపంచంలోనే మూడో ఎత్తై పర్వతం. ఇక్కడ స్నో లెపర్డ్, హిమాలయన్ బ్లాక్ బేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పర్వతం చుట్టుపక్కల ఉండే జలపాతాలు, తోటల అందాలు కళ్లను చెదర గొడుతుంటాయి. దాని దగ్గరే ఉన్న డార్జిలింగ్ వార్ మెమోరియల్, టైగర్ హిల్ మంచి సందర్శనీయ స్థలాలు. ఉదయం నాలుగు గంటలకు టైగర్ హిల్ మీది నుంచి సూర్యోదయాన్ని చూడటం ఓ గొప్ప అనుభూతి.
డార్జిలింగ్లో పార్కులు ఎక్కువ. ముఖ్యంగా పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు పిల్లలను బాగా ఆకట్టు కుంటాయి. పద్మజా నాయుడు పార్కు 67 ఎకరాల విస్తీర్ణంలో, మైదానం మీది నుంచి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. దేశంలో అత్యంత ఎత్తై ప్రదేశంలో ఉన్న పార్కుగా దీనికి గొప్ప పేరుంది. చప్రమారి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం 960.31 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. వర్షాకాలంలో (జూన్ 16- సెప్టెంబర్ 15) ఈ పార్క్ను మూసి వేస్తారు. మిగతా అన్ని రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచే ఉంటుంది.
డార్జిలింగ్ మంచి ఆధ్యాత్మిక కేంద్రం కూడా. ముఖ్యంగా మహాకాల్ మందిరం. హిందూ, బౌద్ధం... రెండు మత సంప్రదాయాలనూ ఈ మందిరంలో చూడవచ్చు. ఇందులో మూడు గోల్డ్ ప్లేటెడ్ విగ్రహాలుంటాయి. వాటిని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులుగా కొలుస్తారు భక్తులు. అలాగే పీస్ పగోడా అనే బౌద్ధాలయంలో బంగారు పూత పూసిన బుద్ధుని విగ్రహం ఉంటుంది. అక్కడ గోడలపై ఉండే రాతి శిల్పాలు బుద్ధుని జీవిత చరిత్ర చెబుతుంటాయి.
డార్జిలింగ్కి అతి పెద్ద ఆకర్షణ టీ ఎస్టేట్స్. మొత్తం 86 టీ తోటలు ఉన్నాయి. ఉత్తమజాతి తేయాకును పండిస్తారు. టీపొడి అక్కడే అమ్ము తారు కూడా. రుచి చూశాకే కొనుక్కో వచ్చు.
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను ‘డార్జిలింగ్ టాయ్ ట్రెయిన్’ అంటారు. ఈ రైల్లో నుంచి హిమాలయాల అందాలను వీక్షణం మరచిపోలేని అనుభూతి. ఇది వివిధ స్టేషన్లలో ఆగుకుంటూ వెళ్తుంది. ఓ చోట 360 డిగ్రీలు తిరుగుతుంది. అప్పుడు ప్రపంచాన్నే చుట్టేసిన అనుభవం కలుగుతుంది.
టికెట్ మనిషికి రూ.360 ఉంటుంది. ఉదయం 9:00 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ ట్రెయిన్లో ప్రయాణించొచ్చు.
రోప్వేపై కేబుల్ కార్లలో ప్రయాణిస్తూ డార్జిలింగ్ ఓవర్వ్యూ చూస్తుంటే... ఆ అందాలను చూడటానికి రెండు కళ్లూ చాలవు!
డార్జిలింగ్లో షాపింగ్ భలే సరదాగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ భారతీయ వస్తువులు, దుస్తులతో పాటు టిబెట్, నేపాల్, భూటాన్ ప్రాంతాలకు చెందిన వస్తువులు, దుస్తులు కూడా విరివిగా దొరుకుతాయి. చౌరస్తా అనే ప్రాంతం షాపింగ్కి ప్రసిద్ధి. ఇక్కడ లేని వస్తువు ఉండదు. హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, సిల్క్ దుస్తులు, ఉన్ని వస్త్రాలు రకరకాల మోడళ్లలో దొరుకుతాయి. వెదురుతో చేసిన వస్తువులైతే మతి పోగొడుతుంటాయి.
ఇక్కడ దొరికే టిబెటన్ కార్పెట్లు చూస్తే కొనకుండా వదిలి పెట్టబుద్ధి కాదు. ట్రెక్కింగ్ షాప్స్ కూడా ఉంటాయి. వాటిలో ట్రెక్కింగ్, ర్యాఫ్టింగ్ వంటి వాటికి అవసరమయ్యే దుస్తులు, షూస్, రోప్స్ లాంటివి అమ్ముతారు. ‘గుడ్రికీ’ అన్న దుకాణాన్ని ద హౌస్ ఆఫ్ టీ అంటారు. ఇక్కడ రకరకాల టీపొడి అమ్ముతారు. రేట్లు మరీ ఎక్కువేమీ ఉండవు. అతి తక్కువ ధర నుంచీ అందుబాటులో ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, పటాలు వంటివి అమ్మే షాపులూ ఎక్కువే!
డార్జిలింగ్లో పర్వతాలు ఎక్కువ. దాంతో ట్రెక్కింగ్ ప్రియులకు బోలెడంత టైమ్పాస్. ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్పే కేంద్రాలు కూడా అక్కడ ఉన్నాయి. పర్వత ప్రాంతాలన్నీ అందమైన పూల మొక్కలతో నిండి ఉంటాయి. ఆ పూల అందాలను చూస్తూ, వాటి పరిమళాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్ చేయడంలో ఉండే అనుభూతే వేరు. ఇండో-నేపాల్ సరిహద్దుల్లో హిమాలయాలను అధిరోహించడానికి చాలామంది ముచ్చట పడుతుంటారు. ఎక్కగలిగినంత మేర ఎక్కి ముచ్చట తీర్చుకుంటారు. అలాగే అటవీ ప్రాంతంతో సాహసపూరిత యాత్రలు చేయడం కూడా మంచి అనుభవం. అయితే దట్టమైన అడవుల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ ఉండే గైడ్స్ని వెంట తీసుకెళ్లడం మంచిది.
డార్జిలింగ్లో నేచర్ బ్యూటీనే కాదు... రుచికరమైన ఆహారం కూడా తినాలి. ముఖ్యంగా మామోస్ని తినకుండా వచ్చారంటే మంచి స్నాక్ని మిస్సైపోయినట్టే. కూరగాయల ఫిల్లింగ్తోటీ, మాంసం ఫిల్లింగ్తోటీ కూడా చేసే ఈ స్నాక్ డార్జిలింగ్ స్పెషల్. అలాగే థుప్కా అనే టిబెటన్ నూడుల్ సూప్ కూడా చాలా ఫేమస్. డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్టే పచ్చళ్లు సూపర్బ్గా ఉంటాయి. దోసకాయలతో పెట్టే పచ్చడి అయితే నోటిలో నీళ్లు ఊరేలా చేస్తుంది. ఆవుపాలతో చేసే చుర్పీ, మాంసంలో బ్రెడ్ పెట్టి చేసే షఫలాయ్, వెదురు బొంగుల్లో సర్వ్ చేసే తోంగ్బా అనే బీర్ లాంటి పానీయం, డార్జిలింగ్లో పండే స్వచ్ఛమైన తేయాకుతో చేసే టీ... వీటన్నిటినీ ఒక్కసారైనా రుచి చూడకుండా మాత్రం రాకండి.
విమాన మార్గం : హైదరాబాద్ నుంచి డార్జిలింగ్లోని బాగ్దోగ్రా విమానాశ్రయానికి ఫ్లయిట్లో వెళ్లవచ్చు. రాను పోను కలిపి పదహారు వేల పైన ఉంటుంది టిక్కెట్ వెల. ప్యాకేజీ తీసుకుంటే రానుపోను విమాన ఖర్చులతో పాటు మూడు రాత్రులు, నాలుగు పగళ్లకు వసతి, భోజనం, విహార ఖర్చులన్నీ కలిపి ముప్ఫై వేల వరకూ అవుతాయి. డార్జిలింగ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా చూపించే ప్యాకేజీలు ఉన్నాయి.
రైలు మార్గం డార్జిలింగ్కు నేరుగా రైళ్లు లేవు. కోల్కతాకు వెళ్లి, అక్కడ్నుంచి గౌహతి ఎక్స్ప్రెస్లో జల్పాయ్గూర్ వెళ్లి, అక్కడ్నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది.
రోడ్డు మార్గం : డెరైక్ట్ బస్సులు కూడా లేవు. బెంగలూరు వెళ్లి, అక్కడ్నుంచి రైల్లో కానీ విమానంలో కానీ బాగ్దోగ్రా వెళ్లి, అక్కడ్నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటికీ ఇరవై గంటల పైనే పడుతుంది.